బాబుకు మద్దతుపై చింతిస్తున్న ఆర్కే

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అంటే ఎవరో? ఆయన మొగ్గు ఎటో అందరికీ తెలిసిందే. కానీ ఆయన కూడా ఇప్పుడు తాను సదా చంద్రబాబుకు మద్దతు ఇస్తూ పోవడం పట్ల చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నారట. అంతే కాదు,…

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అంటే ఎవరో? ఆయన మొగ్గు ఎటో అందరికీ తెలిసిందే. కానీ ఆయన కూడా ఇప్పుడు తాను సదా చంద్రబాబుకు మద్దతు ఇస్తూ పోవడం పట్ల చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నారట. అంతే కాదు, ఇలా చేయడం వల్ల తన పరువు, తన పత్రిక ఇమేజ్ చాలా దెబ్బతింటున్నాయట. ఆయన ఈ మేరకు తన సన్నిహితుల దగ్గర చెప్పుకుని వాపోతున్నారట. 

'ఎప్పుడో బాబు చేసిన సాయానికి ఇప్పటికీ ఆయనను మోయాల్సి వస్తోంది. ఆయన కోసం జగన్ ను బదనామ్ చేసే ప్రయత్నం సదా చేయాల్సి వస్తోంది. దీని వల్ల చాలా నష్టపోయాను. నా పత్రిక కూడా ఓ పక్షం అని మాట పడిపోయింది, ఇలా ఇంకెన్నాళ్లో..' అని ఆయన పశ్చాత్తాప పడుతున్నారట. 

నిజం, ఈ గ్యాసిప్ ను నమ్మాలి మనం.  ఎందుకంటే..ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ఆర్కే స్వయంగా వండి వార్చిన కొత్త పలుకులో…

''….జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రావడానికి విశేషంగా కృషి చేసిన ప్రశాంత్‌ కిశోర్‌ కూడా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులను చూస్తూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘‘గత ఎన్నికలలో చంద్రబాబు ఓడిపోవాల్సింది కాదు. కానీ నేను నా వ్యూహంతో ఎన్నికల వాతావరణాన్ని జగన్‌కు అనుకూలంగా మలిచాను’’ అని ఆయన పలువురి వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని విస్తృతంగా చేయడంతోపాటు చంద్రబాబు సామాజికవర్గంపై ఇతర వర్గాలలో ద్వేష భావాన్ని వ్యాపింపజేయడంలో ప్రశాంత్‌ కిశోర్‌ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయనే తాను చేసిన పనికి పశ్చాత్తాపం వ్యక్తంచేస్తున్నారు. ‘జగన్మోహన్‌రెడ్డి పాలన ఇలా ఉంటుందని అనుకోలేదు. నేను చంద్రబాబుకే కాదు,ఆంధ్రప్రదేశ్‌కు కూడా అన్యాయం చేశాను’’ అని ఆయన ఇప్పుడు తీరిగ్గా వాపోతున్నారట…''

ఓ మెయిన్ స్ట్రీమ్ పత్రిక ఎడిటర్ అయిన ఆయనే ..ఇలా అన్నారట..ఇలా చెప్పారట..అంటూ గ్యాసిప్ లు వండి వార్చినపుడు, అవి జనం నమ్మాలి అనుకున్నపుడు, ఆర్కే మీద వచ్చిన గ్యాసిప్ ను కూడా జనం నమ్మాలి కదా?

అందుకే ఆర్కే కూడా బాబుకు సదా మద్దతు ఇస్తూ పోవడానికి ఇబ్బందిగా ఫీలవుతున్నారన్న గ్యాసిప్ ను నమ్మాల్సి వస్తోంది. అంతే కాదు, లోకేష్ అంటే ఆర్కేకు అంతగా నచ్చడం లేదని, ఎన్టీఆర్ ను రంగంలోకి దింపితేనే తెలుగుదేశం పార్టీకి కొత్త నెత్తురు వస్తుందని ఆర్కే తన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానిస్తున్నట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. 

ఇక ఎంత కాలమో, పత్రిక ను, దాని ఇమేజ్ ను పణంగా పెట్టి, వార్తలు వండి వార్చలేనని, సరైన సమయం లో ఈ విషయం చంద్రబాబు కూడా చెప్పేస్తానని ఆర్కే తన సన్నిహితుల దగ్గర చెబుతున్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

ఈ వదంతుల్లో నిజమెంతో, ప్రశాంత్ కిషోర్ గ్యాసిప్ లో నిజమెంతో రెండూ ఆర్కే కే తెలియాలి.