సెలబ్రిటీలకు మీడియాకు మధ్య ఎప్పుడూ చిన్న పాటి దూరం వుంటుూనే వుంటుంది. దర్శకుడు త్రివిక్రమ్ కు మీడియాకు మధ్య కాస్త కనిపించని దూరమే వుంది. ఆయన చాలా సెలక్టివ్ గా మీడియాను ఎంచుకుని మరీ ఇంట్రాక్ట్ అవుతారు. ఆ విషయంలో అసలు తనకు ఏమీ తెలియదన్నట్లు వుంటారు. కానీ ఎవరి చేత ఎలా చేయించాలో అలా చేయిస్తూ ముందుకు వెళ్తారు. ఓ సారి ఆయన ఓ అపాయింట్ మెంట్ ఇచ్చి, ఒకరికి బదులు ఇద్దరు మీడియా జనాలు వస్తే, తాను ఒక్కరినే అనుమతిస్తా, ఒక్కరితోనే మాట్లాడతా అంటూ ఒకరిని బయట కూర్చోపెట్టారనే గ్యాసిప్ కూడా వుంది.
ఆ మధ్య త్రివిక్రమ్ ఇంటర్వూ ఓ పత్రిక తీసుకుని, సరిగ్గా ప్రచురించలేదని చిన్న గడబిడ అయిందనే గ్యాసిప్ వుంది. అప్పట్లో త్రివిక్రమ్ తన ఇంటర్వూ కన్నా, మరో నటి ఇంటర్వూకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని సీరియస్ అయ్యారని, దానిపై ఇటు అటు చాలా సేపు మల్ల గుల్లాలు నడిచాయని గ్యాసిప్ లు ఓ రెండు రోజుల పాటు వినిపించాయి.
కట్ చేస్తే, నిన్నటికి నిన్న త్రివిక్రమ్-బన్నీ కలిసి కొన్ని పత్రికలకు మాత్రం ఇంటర్వూలు ఇచ్చారు. సినిమా హిట్ అయింది కదా..ఇంకేం వుంది. 'మీ భుజం నేను నొక్కుతా..నా భుజం మీరు నొక్కండి' అనే టైపులో సాగాయి. అయితే బన్నీ-త్రివిక్రమ్ ఇంటర్వూ అనేసరికి పేజీలకు పేజీలు వండి వార్చడం మామూలే. కానీ ఓ పత్రిక మాత్రం సింపుల్ గా ఓ పావు పేజీ ఇచ్చి పక్కన పెట్టింది.
దీని వెనుక సినిమా విడుదలకు ముందు జరిగిన వ్యవహారం ప్రభావం వుందని తెలుస్తోంది. త్రివిక్రమ్ వైఖరికి కినిసిన సదరు మీడియా అధినేత సూచన మేరకు ఇలా జరిగిందని బోగట్టా. చిత్రమేమిటంటే ఈ ఇంటర్వూను హైదరాబాద్ ఎడిషన్ లో వేసి, ఆంధ్ర ఎడిషన్ లో పక్కన పెట్టడం.