కొడుకును మంద‌లించాల్సింది పోయి….మంత్రి ఓవ‌రాక్ష‌న్‌!

పోకిరీ చేష్ట‌ల‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్న త‌న‌యుడిని మంద‌లించాల్సింది పోయి, వాటిని ప్రోత్స‌హించేలా ఏపీ మంత్రి విశ్వ‌రూప్ వ్య‌వ‌హ‌రించ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ప‌ది మందికి ఆద‌ర్శంగా నిల‌బ‌డ‌డం ప‌క్క‌న పెడితే, ఎలా వుండ‌కూడ‌దో చూసి నేర్చుకోడానికి…

పోకిరీ చేష్ట‌ల‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్న త‌న‌యుడిని మంద‌లించాల్సింది పోయి, వాటిని ప్రోత్స‌హించేలా ఏపీ మంత్రి విశ్వ‌రూప్ వ్య‌వ‌హ‌రించ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ప‌ది మందికి ఆద‌ర్శంగా నిల‌బ‌డ‌డం ప‌క్క‌న పెడితే, ఎలా వుండ‌కూడ‌దో చూసి నేర్చుకోడానికి మంత్రి విశ్వ‌రూప్ వ్య‌వ‌హార శైలి ఓ గుణ‌పాఠం కావ‌డం గ‌మ‌నార్హం. అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా అమ‌లాపురంలో మంత్రి విశ్వ‌రూప్, డీఎస్పీ మాధ‌వ‌రెడ్డి మ‌ధ్య త‌లెత్తిన వివాదం రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

అంబేద్క‌ర్ జ‌యంతి ఉత్స‌వాల సంద‌ర్భంగా కొంద‌రు యువ‌కులు బైక్ సెలైన్స‌ర్లు తీసేసి రోడ్ల‌పై అల్ల‌రి చేయ‌డాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బైక్‌ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజ‌కీయాల‌కు అతీతంగా పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరును త‌ప్ప‌క ప్ర‌శంసించాలి. అంబేద్క‌ర్ జ‌యంతి నాడు యువ‌త ఇలాంటి చేష్ట‌లు చేయ‌డం ఏంటో ఎవ‌రికీ అర్థం కాదు. ఇలాంటి వాటిని అంబేద్క‌ర్ కోరుకోలేదు.

అంబేద్క‌ర్ నేతృత్వంలో ర‌చించిన రాజ్యాంగంలో ఏముందో తెలిసిన యువ‌త …ఇలా బాధ్య‌తారాహిత్యంగా రోడ్ల‌పై సెలెన్స‌ర్లు తీసిన బైక్‌ల‌తో హంగామా సృష్టించి, ప్ర‌జ‌ల‌కు అసౌక‌ర్యం క‌లిగించ‌రు. కానీ మంత్రి విశ్వ‌రూప్ కుమారుడు శ్రీ‌కాంత్ బైకులు విడిచిపెట్టాలంటూ పోలీసుల ఎదుట హ‌ల్‌చ‌ల్ చేయ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. తాను చెప్పినా డీఎస్పీ మాధ‌వ్‌రెడ్డి ప‌ట్టించుకోలేద‌ని, మంత్రి అయిన త‌న తండ్రి విశ్వ‌రూప్‌ను పోలీస్‌స్టేష‌న్‌కు తీసుకెళ్ల‌డం గ‌మ‌నార్హం. బైక్‌లు విడిచి పెట్టాల‌ని మంత్రి ఆదేశించ‌డం, డీఎస్పీ లెక్క చేయ‌క‌పోవ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.

బైక్‌ల‌కు సైలెన్స‌ర్లు బిగించుకుని తీసుకెళ్లాల‌ని డీఎస్పీ సూచించ‌డం మంత్రి గారికి అస‌లు న‌చ్చ‌లేదు. త‌న మాట డీఎస్పీ విన‌లేద‌ని, చ‌లో అమ‌లాపురానికి పిలుపు ఇవ్వ‌మంటారా? అని బెదిరించ‌డం ఆయ‌న‌కే చెల్లింది. గ‌తంలో అమ‌లాపురం త‌గ‌ల‌బెట్టిన‌ప్పుడు ఈ మంత్రి గారూ ఏ క‌లుగులో దాక్కున్నారో మ‌నంద‌రికీ తెలిసిందే. 

గ‌తంలో కోన‌సీమ జిల్లాకు అంబేద్క‌ర్ పేరు పెట్ట‌డం వ‌ల్ల అల్ల‌ర్లు చెల‌రేగ‌డాన్ని దృష్టిలో పెట్టుకుని డీఎస్పీ ముందు జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ని స‌మాచారం. మంత్రి విశ్వ‌రూప్ వ్య‌వ‌హార శైలి అధికార పార్టీకి న‌ష్టం క‌లిగించేలా ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.