మార్గ‌ద‌ర్శి పుట్టక ముందే మోసాలున్నాయ్‌…వ‌దిలేద్దామా?

మార్గ‌ద‌ర్శి అక్ర‌మాల‌ను, ఆ సంస్థ అధినేత‌ రామోజీరావును వెన‌కేసుకు రావ‌డం ప్ర‌తిప‌క్షాల‌కు ప్యాష‌నైంది. రామోజీ చేతిలో అతిపెద్ద మీడియా వ్య‌వ‌స్థ వుండ‌డంతో మ‌ద్ద‌తుగా నిలిస్తే, త‌మ‌కేమైనా ప్ర‌యోజ‌నం వుంటుంద‌నే చిల్ల‌ర ఆశ‌తో కొంద‌రు త‌మ…

మార్గ‌ద‌ర్శి అక్ర‌మాల‌ను, ఆ సంస్థ అధినేత‌ రామోజీరావును వెన‌కేసుకు రావ‌డం ప్ర‌తిప‌క్షాల‌కు ప్యాష‌నైంది. రామోజీ చేతిలో అతిపెద్ద మీడియా వ్య‌వ‌స్థ వుండ‌డంతో మ‌ద్ద‌తుగా నిలిస్తే, త‌మ‌కేమైనా ప్ర‌యోజ‌నం వుంటుంద‌నే చిల్ల‌ర ఆశ‌తో కొంద‌రు త‌మ స్థాయి దిగ‌జార్జుకుని మాట్లాడుతున్నారు. మార్గ‌ద‌ర్శి, రామోజీల విష‌యానికి వ‌స్తే… ప్ర‌త్య‌ర్థుల నుంచి ఎక్కువ‌గా వినిపిస్తున్న‌ది ఏంటంటే, సీఎం జ‌గ‌న్ పుట్ట‌క ముందు, వైసీపీ పెట్ట‌క ముందే మార్గ‌ద‌ర్శి వుంద‌ని.

ఈ వాద‌న‌లు చేస్తున్న వారికి ఓ మాట‌. మార్గ‌ద‌ర్శి, రామోజీరావు పుట్ట‌క ముందు నుంచే స‌మాజంలో అక్ర‌మాలు, మోసాలు, వంచ‌న‌లు ఉన్నాయి. కాబ‌ట్టి మార్గ‌ద‌ర్శి నిధుల్ని అక్ర‌మ మార్గంలో మ‌ళ్లించ‌డాన్ని స‌మ‌ర్థించాలా? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం ఏంటి? రామోజీకి చ‌ట్టం, న్యాయం, నియ‌మ నిబంధ‌న‌లేవీ వ‌ర్తించ‌వా? అన్నింటికీ ఆయ‌న అతీత‌మైన వ్య‌క్తా? ఈ ధోర‌ణే పౌర స‌మాజానికి ఆయ‌న్ని దూరం చేసింద‌నే అభిప్రాయం వుంది.

మార్గ‌ద‌ర్శి, రామోజీరావు పుట్ట‌క‌ల మీద కాదు విచార‌ణ జ‌రుగుతోంద‌న్న క‌నీస స్పృహ కూడా లేదా? మార్గ‌ద‌ర్శి అక్ర‌మాల‌పై విచార‌ణ జ‌రుగుతున్న సంగ‌తి తెలియ‌దా? మార్గ‌ద‌ర్శిపై విచార‌ణ‌, న్యాయ‌స్థానంలో కేసు త‌దిత‌ర అంశాలేవైనా వైఎస్ జ‌గ‌న్ పాల‌న‌లో చోటు చేసుకున్న‌వా? లేదు క‌దా? మ‌రెందుక‌ని వైఎస్ జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తూ ప్ర‌తిప‌క్షాల నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు?

రామోజీరావుపై వ్య‌క్తిగ‌త ఇష్టం వుండడం ఎవ‌రికీ అభ్యంత‌రం లేదు. అలాంటి వారెవ‌రైనా ఆ పెద్దాయ‌న‌తో క‌లిసి ఏమైనా చేయొచ్చు. కానీ మార్గ‌ద‌ర్శి చిట్‌ఫండ్ వ్య‌వ‌హారంలో ఆర్‌బీఐ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్యవ‌హ‌రించార‌నేది కేసు. దీనిపై కొన్నేళ్లుగా సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ పోరాటం చేస్తున్నారు. ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో ఆయ‌న ఒంటరిపోరు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అస‌లు పిటిష‌న్‌లో బ‌లం లేక‌పోతే స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం స్వీక‌రించేదా?

ప్ర‌తి అడ్డ‌మైన నాయ‌కుడు వాదించేది ఏంటంటే…మార్గ‌ద‌ర్శి ఖాతాదారుల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ చిన్న ఫిర్యాదు కూడా రాలేద‌ని. మ‌రి  ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ ఎవ‌రు? ఒక‌వేళ రామోజీరావు అనుకూలురు వాదిస్తున్న‌ట్టు ఫిర్యాదు చేయ‌క‌పోతే అక్ర‌మాలు కాస్త స‌క్ర‌మాలు అవుతాయా? మార్గ‌ద‌ర్శి వ్య‌వ‌హారంపై సంబంధిత అధికారులు, న్యాయ‌స్థానం తేలుస్తాయి. అంత వ‌ర‌కూ ఓపిక లేక‌పోతే ఎట్లా? రామోజీరావు మీడియాలో పబ్లిసిటీ కోసం మ‌రీ ఇంత దిగ‌జారాలా?

సోష‌ల్ మీడియా యుగంలో ఇంకా ప్ర‌జ‌ల క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్ట‌డం సాధ్య‌మా? రామోజీకి అక్ర‌మాల‌కు పార్టీల‌కు అతీతంగా ప్ర‌తిప‌క్ష నేత‌లు ఏకం కావ‌డం చూస్తే… రాజ‌కీయాలు ఇంత‌గా ప‌త‌నం అయ్యాయా? అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. వైఎస్ జ‌గ‌న్‌పై ఈనాడు చేస్తున్న‌ది మాత్రం దాడి కాద‌ట‌! ఇదే జ‌గ‌న్ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంటే… దాడి, క‌క్ష అని రంకెలు వేయ‌డం వారికే చెల్లింది. ఎవ‌రెంత‌గా అరిచి గోల చేసినా… కాలం అంద‌రి స‌ర‌దా తీరుస్తుంద‌నే వాస్త‌వాన్ని గుర్తించాలి.  రామోజీ, మార్గ‌ద‌ర్శిపై ప్ర‌తిప‌క్ష నేత‌ల్లో త‌ప్ప‌, సామాన్య ప్ర‌జానీకంలో ఎవ‌రికీ సానుభూతి, సానుకూల‌త లేద‌న్న‌ది ప‌చ్చి నిజం.