జస్ట్ కొన్ని రోజుల కిందట తమిళనాడులో ఓ పెళ్లికూతురు ఇచ్చిన షాక్ అందరికీ తెలిసిందే. సరిగ్గా పెళ్లిపీటల మీద వరుడు తాళికట్టే సమయానికి అడ్డం తిరిగింది. తన ప్రియుడు వస్తున్నాడని, అతడ్నే పెళ్లి చేసుకుంటానని మొండికేసింది. దీంతో షాకవ్వడం పెళ్లికొడుకు వంతయింది. అప్పట్లో ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఇప్పుడు సేమ్ సీన్ ఏపీలో రిపీట్ అయింది.
కడప జిల్లాకు చెందిన ఓ అమ్మాయి కూడా ఇలానే పెళ్లికొడుక్కి షాక్ ఇచ్చింది. ఇంకో గంటలో పెళ్లి అయిపోతుందనగా.. తన ప్రేమ విషయాన్ని బయటపెట్టి పంచాయితీ పెట్టింది. దీంతో పెళ్లికొడుకు అవాక్కయ్యాడు.
కడపకు చెందిన భావన చెన్నైలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. తన కొలీగ్ ఆకాష్ తో ప్రేమలో పడింది. అయితే తల్లిదండ్రులు మాత్రం ఆమెకు మరో సంబంధం చూశారు. చిత్తూరు జిల్లా గుర్రంకొండకు చెందిన ఉద్యోగితో పెళ్లికి ఏర్పాట్లు చేశారు.
గ్రాండ్ గా రిసెప్షన్ కూడా పూర్తయింది. పెళ్లికి అంతా సిద్ధం, మరో గంటలో పెళ్లి. అంతలోనే ఊహించని షాక్. చెన్నైలో ఉన్న ప్రియుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అట్నుంచి అటు మదనపల్లి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. పెళ్లికూతురుతో పాటు, ఆమె తల్లిదండ్రుల్ని విచారించారు.
తన ప్రేమ విషయాన్ని భావన అంగీకరించింది. తల్లిదండ్రుల మాట కాదనలేక పెళ్లికి ఒప్పుకున్నానని, తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, ప్రియుడ్నే పెళ్లి చేసుకుంటానని మొండికేసింది. అటు భావన తల్లిదండ్రులు మాత్రం కూతురు ప్రేమ వ్యవహారం తెలియదంటున్నారు.
దీంతో పోలీసులు స్వయంగా భావనను చెన్నైలో ఉన్న ఆమె ప్రియుడి వద్దకు పంపించారు. మరో గంటలో పెళ్లయిపోతుందని భావించిన పెళ్లికొడుకు అన్నీ సర్దుకొని తన ఇంటికి వెళ్లిపోయాడు.