చంద్రబాబును ఓ మాయల ఫకీరుగా అభివర్ణించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. జగన్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు, మాయల ఫకీరు టైపులో చంద్రబాబు ఎన్నో కుతంత్రాలు పన్నుతున్నారని, కానీ ప్రజాబలంతో జగన్ వాటన్నింటినీ తిప్పికొడుతున్నారని అన్నారు.
“చంద్రబాబు ఓ మాయల ఫకీర్. ప్రజల్లో ఆయన లేకపోయినా, ప్రజల్లో ఆయనకు బలం లేకపోయినా అనేక ఎత్తుగడలు వేస్తున్నారు. వ్యవస్థలతో ఎన్నో కుట్రలు చేస్తున్నారు. అయినా ప్రజాబలంతో జగన్ నిలబడ్డారు. ఈ ఏడాదిన్నర పాలనలో జగన్ ప్రజల గుండెల్లో గుడికట్టుకున్నారు.”
225 కోట్ల రూపాయలతో ఆక్వా హబ్ లు ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు.. రాష్ట్రంలో ఓ వర్గం చేస్తున్న అరాచకాల్ని అరికట్టడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
“సమాజంలో వందలాది కులాలున్నాయి. ఆ కులాలపై అనాదిగా ఒకే వర్గం అన్యాయం చేస్తోంది. అది చూసి జగన్ గుండె మండింది. ఆ అసమానతలు తొలిగించాలని, ఓ వర్గం చేస్తున్న అన్యాయాన్ని తొలిగించాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు.”
చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా, 32 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం మాత్రం ఆగదంటున్నారు రాంబాబు. చంద్రబాబు కళ్లముందే పట్టాలిచ్చి, ఇళ్లు కూడా నిర్మిస్తామని చెబుతున్నారు.