తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను బుల్లితెర మాటల మాంత్రికురాలు సుమ కలిశారు. ఈ మేరకు కేటీఆర్‌తో దిగిన ఫొటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్‌ను సుమ కలవడానికి వెనుక ఏమైనా రాజకీయ కారణాలు న్నాయా? అనే అనుమానాలు కూడా లేకపోలేదు.
సహజంగా యాంకర్ సుమ రాజకీయాలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. చాలా లౌక్యంగా మాట్లాడుతూ అందర్నీ ఆకట్టుకోవడం ఆమె ప్రత్యేకత. గ్రేటర్ ఎన్నికలను ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని మాటలు తూటాలు పేల్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడ్డం ఎంతో సంతోషంగా ఉందని సుమ పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టడం ఆసక్తి కలిగిస్తోంది.
తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కేటీఆర్, ఆయన టీం కలిసి కృషి చేస్తున్న తీరు అద్భుతమని ఆమె కొనియాడారు. ఓ హైదరాబాదీగా మన నగరం, అభివృద్ధి, తదితర వాటిపై చర్యల గురించి తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని సుమ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఏది ఏమైనా ప్రస్తుతం హైదరాబాద్‌లో రాజకీయం వేడెక్కిన తరుణంలో కేటీఆర్‌ను సుమ కలవడం తప్పకుండా చర్చనీయాంశమే. ఎందుకంటే సుమకు పెద్ద ఎత్తున అభిమానులున్నారు. అందులోనూ కేటీఆర్‌పై సుమ ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో ఎన్నడూ లేంది…. ఇప్పుడే ఎన్నికల సమయంలో ఇలాంటి భేటీ జరగడంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.