ఈ దేశంలో రాజకీయ నాయకులతో పాటుగా పవర్ ఫుల్ గా కనిపించేది స్వామీజీలే. రాజకీయనాయకులు అధికార పీఠాధిపతులైతే స్వాములు ఆధ్యాత్మిక పీఠాధిపతులు. అందువల్ల వారు దేవుడికి దగ్గరగా ఉంటారని, దైవదూతలని ప్రతి ఒక్కరికీ నమ్మకాలు ఉంటాయి.
ఎంత చెడ్డవారు అయినా దేవుడికో దయ్యానికో భయపడతారు. దాంతో స్వాముల వద్దకు క్యూ కట్టే రాజకీయ జీవులతోపాటు, వివిధ రంగాల ప్రముఖులు కూడా ఎక్కువగానే కనిపిస్తారు.
విశాఖలో ఉన్న శ్రీ శారదాపీఠం గురించి చెప్పుకుంటే రెండున్నర దశాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడ ప్రతి నిత్యం అమ్మవారికి పూజలు జరుగుతాయి. స్వరూపానందేంద్ర స్వామి కూడా చాలా శక్తిసంపన్నుడు, ఆయన యాగాలు, హోమాలు చేయిస్తూ ఉంటారు.
ఇక స్వామీజీ ఆశ్రమానికి రాజకీయ నేతల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. వారంతా తన భక్తులేనని స్వామి చెబుతారు, అందరితోనే వారికీ తన అశీస్సులు ఉంటాయని అంటారు.
అయితే గతంలో కాంగ్రెస్, ఇపుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే స్వామిజీ దగ్గరకు ఎక్కువగా వెళ్తూండడమే విశేషం. ఇక స్వామీజీకి పెద్ద భక్తుడు టీ సుబ్బరామిరెడ్డి. ఆయన తరచూ ఆశ్రమానికి వస్తూంటారు.
తాజాగా శారదాపీఠం వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వైసీపీ మంత్రులతో పాటు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో ఆశ్రమంలో కనిపిస్తున్నారు,
స్పీకర్ తమ్మినేని సీతారాం, డీజీపీ గౌతం సవాంగ్ వంటి వారు కూడా ఆశ్రమానికి వచ్చి స్వామీజీని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. కొద్ది నెలల క్రితం జరిగిన స్వామీజీ పుట్టిన రోజు వేడుకలు కూడా వైభవంగా జరిగాయి.
ఇక విశాఖ తొందరలో అధికారికంగా పాలనా రాజధాని కాబోతుందని వార్తలు వస్తున్న నేపధ్యంలో స్వామీజీ పీఠానికి ఎక్కడ లేని తాకిడీ వచ్చిపడుతోంది. ఇక రాజధాని కనుక అయితే మాత్రం పీఠంలో రాజకీయ సందడి మామూలుగా ఉండదని అంటున్నారు.
విశాఖ రాజధానిగా చేయమని వైసీపీ సర్కార్ కి స్వామీజీయే సూచించారని ఇప్పటికే విపక్ష టీడీపీ విమర్శలు చేస్తున్న నేపధ్యంలో రేపటి రోజున ముఖ్యమంత్రి సహా మంత్రులు కొలువైతే శారదాపీఠం వైభవం ఎలా ఉంటుందో చెప్పనక్కరలేదని అంటున్నారు.