బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్‌కు సినిమాల కంటే ఆమె ప్రేమ వ్యవహారమే ఎక్కువ పబ్లిసిటీ తెచ్చింది. ఆమె ఇంత వరకూ కేవలం రెండు సినిమాలే చేసింది. కానీ సారా మాత్రం వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. తనతో కలిసి నటించిన కార్తిక్ ఆర్యన్‌తో సారా అలీఖాన్ డేటింగ్ చేస్తున్నట్టు బాగా ప్రచారమవుతోంది.
మరి కావాలని అన్నదో లేక మరేదైనా ఉద్దేశమో కానీ, ఆ ప్రచారానికి ఆమె స్వయంకృతాపరాధమే అని చెప్పక తప్పదు. గతంలో కాఫీ విత్ కరణ్ షో అనే కార్యక్రమంలో సారా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె కార్తిక్ అంటే తనకు ఇష్టమని మనసులో విషయాన్ని సారా వెల్లడించింది. దీంతో అప్పటి నుంచి వారి మధ్య సంథింగ్…సంథింగ్ అంటూ బాలీవుడ్ చెవులు కొరుక్కొంది.
ప్రస్తుతం కార్తిక్‌తో కలిసి సారా ‘లవ్ ఆజ్ కల్’ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా ఈ నెల 14న ప్రేమికుల దినాన్ని పురస్కరించుకుని విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కార్తిక్‌తో తన బంధం గురించి స్పష్టత ఇచ్చింది. అందరూ అనుకున్నట్టు తమ మధ్య అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పింది.
కార్తిక్‌తో కలిసి ఉండటం చూడాలంటే కేవలం సినిమాలో మాత్రమేనని తెలిపింది. తమను చూడాలనుకుంటే థియేటర్‌కు వెళితే సినిమాలో కనిపిస్తామని సారా ఎంతో తెలివిగా సమాధానం చెప్పింది. అంతేకాదు, ఇలాంటి పుకార్లు రావడం ఇదే తొలిసారి కాదని, భవిష్యత్‌లో కూడా రావని చెప్పలేని సారా పేర్కొంది. తనేంటో తన అంతరాత్మకు తెలుసని చెప్పింది. లోపల ఒకలా, బయటికి మరోలా ఉండాల్సిన అవసరం తనకు లేదని ఆమె కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. పుకార్లకు అవకాశం ఇచ్చేది వాళ్లే, మళ్లీ ఏమీ లేదని తేల్చి చెప్పేది వాళ్లే…ఏంటో ఈ హీరోయిన్లు….