'కేంద్ర బడ్జెట్‌ని రాష్ట్రాల వారీగా లెక్కలేయడం సరికాదు.. కేంద్ర పథకాలు ఆటోమేటిక్‌గా రాష్ట్రానికీ అప్లయ్ అవుతాయి.. అయినా, రాష్ట్రానికి కేంద్రం చాలా చాలా చేసింది, చేస్తోంది.. ఇకపైనా చేస్తుంది కూడా..' అంటూ ఏపీ బీజేపీ నేతలు షరామామూలుగానే రాష్ట్ర బడ్జెట్‌పై తమదైన శైలిలో బుకాయింపులు కొనసాగిస్తున్నారు. పైగా, 'ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం.. ఆ అంశాన్ని పట్టుకుని చంద్రబాబులా వైఎస్ జగన్ కూడా రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం సబబు కాదు' అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.
ఇంతేనా.? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎప్పటికీ ఇంతేనా.? అన్న చర్చ రాష్ట్ర ప్రజల్లో జరుగుతున్నా.. అది రాష్ట్ర బీజేపీ నేతలకు పట్టడంలేదు. తమ హయాంలో రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చేసినట్లు.. ఇప్పుడు కొత్తగా రాష్ట్రానికి అన్యాయం జరిగినట్లు తెలుగుదేశం పార్టీ నేతలు, నెపాన్ని వైఎస్సార్సీపీ నెత్తిన రుద్దేస్తున్నారు. ప్రత్యేక హోదా ఎప్పుడు తెస్తారంటూ అధికార వైఎస్సార్సీపీ మీద ఒత్తిడి పేరుతో అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు టీడీపీ నేతలు. చిత్రంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బడ్జెట్ బాగుందంటూనే, రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యిందంటూ వైసీపీ మీద ఫైర్ అయిపోయారు.
బీజేపీ బుకాయింపులు, టీడీపీతోపాటు జనసేన వెక్కిరింతల సంగతి పక్కన పెడితే, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇకపై ఏం చేస్తుంది.? పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తుందా.? మరి, బడ్జెట్ చాలా బావుందంటూ ఇప్పటికే వ్యాఖ్యానించిన వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ఎలాంటి చర్యలుంటాయి.? ఇదే ఇప్పుడు ఆసక్తికరం. బడ్జెట్‌ని పార్లమెంటులో ప్రవేశ పెట్టడం మాత్రమే జరిగింది. దానిపై చర్చ జరుగుతోంది. ఆ చర్చ సందర్భంగా పూర్తి లెక్కలు బయటకొస్తాయి.
మాట్లాడాల్సిన అంశాలు చాలానే వున్నాయి. అందులో ప్రత్యేక హోదా కూడా ఖచ్చితంగా వుంటుంది. రాష్ట్రంలో విపక్షాల మీద విరుచుకుపడ్డంలో చూపే శ్రద్ధని, కేంద్రంపై నిలదీయడానికి వైసీపీ ఎంపీలు చూపించాల్సి వుంటుంది. చిన్న పాటి పెదవి విరుపులు సరిపోవు. పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని చాలా చాలా గట్టిగా నిలదీయాల్సిందే. 'ఎంపీల తీరు అస్సలేమాత్రం బాగా లేదు..' అంటూ ఇప్పటికే వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
నిజమే, రాష్ట్రానికి బడ్జెట్ పరంగా అన్యాయమే జరిగింది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఈ సమయంలోనే గట్టిగా నిలబడాలి.. పార్టీ వాయిస్‌నీ, ప్రజల వాయిస్‌నీ కేంద్రానికి గట్టిగా విన్పించి తీరాల్సిందే. వైసీపీ ఆ క్రమంలో సక్సెస్ అవుతుందా.? తన చిత్తశుద్ధిని చాటుకుంటుందా.? వేచి చూడాల్సిందే.