జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయం గురించి కొత్తగా చెప్పేదేం లేదు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఒకటికి రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడి తన సత్తా ఏమిటో పవన్ చాటి చెప్పారు. అలాంటి పవన్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ అంటూ ప్రకటించడం ప్రహసనం అయ్యింది.
కేవలం బీజేపీ తనను పట్టించుకోవడం లేదని వారిని బ్లాక్ మెయిల్ చేసి తన వద్దకు వచ్చేలా చేసుకోవడానికే పవన్ కల్యాణ్ పోటీ ప్రకటన చేశాడనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. పోటీ అంటూ ప్రకటించి, ఆ తర్వాత తప్పుకోవడం పవన్ కు కొత్త ఏమీ కాదు.
కొత్తగా పోయే పరువేమీ లేదు కాబట్టి.. పవన్ పోటీ అంటూ మరో కామెడీ ఎపిసోడ్ నడిపించారు. పవన్ కంటే ఇవన్నీ మామూలే కానీ.. బీజేపీ కూడా ఈ కామెడీలో తన వంతు పాత్ర పోషించి నవ్వులపాలయినట్టుగా ఉంది.
పోటీ అంటూ ప్రకటించిన పవన్ కల్యాణ్ ను అలా వదిలేసి ఉంటే.. అసలు కథ పూర్తిగా బయపడేదని పరిశీలకులు అంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు పడే ఓట్లు.. పవన్ రాజకీయ పరిస్థితిని తేటతెల్లం చేసేవి. పవన్ అసలు రాజకీయ శక్తి ఏపీలో ఒకసారి బయటపడగా, జీహెచ్ఎంసీలో మరోసారి వెలుగు చూసేది. అయితే పవన్ మరోసారి కామెడీ కావడం బీజేపీకి కూడా ఇష్టం లేనట్టుంది!
అందుకే ఆ పార్టీ తరఫున నేతలు బేరసారాలకు వెళ్లారు. పవన్ అహాన్ని వారు చల్లార్చారు! తనకు కావాల్సింది కూడా ఇదే కాబట్టి పవన్ కల్యాణ్.. పోటీ లేదని తేల్చారు. ముందు ముందు మాత్రం బీజేపీ-జనసేనలు కలిసి పోటీ చేస్తాయట! ఇలా చెప్పుకుని కామెడీ కావడానికి పవన్ కల్యాణ్ కు పెద్దగా అభ్యంతరం లేనట్టుగా ఉంది.
ఆల్రెడీ ఒకసారి పొత్తు, కలిసి పోటీ అంటూ ప్రకటించి.. తీరా ఎన్నికలు వచ్చిన సమయంలో ముందు ముందు పొత్తు అంటూ ప్రకటించడం పవన్ మార్కు కామెడీ. ఇక ఇంతోటి రాజకీయ నేతతో సమావేశానికి వెళ్లిన బీజేపీపై విమర్శలు తప్పడం లేదు.
ఏపీలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిన వ్యక్తి మద్దతు కోసం బీజేపీ దిగజారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో తామెంతో ఎదిగిపోయినట్టుగా బిల్డప్ ఇస్తున్న బీజేపీ వాళ్లు.. ఇక్కడ నూటికి ఒకటీ రెండు ఓట్లు కూడా లేని పవన్ ప్రాపకం కోసం తన స్థాయిని తనే దిగజార్చుకుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.