చిత్రం: శాకుంతలం
రేటింగ్: 2/5
తారాగణం: సమంత, దేవ్ మోహన్, మోహన్ బాబు, సచిన్ ఖేడేకర్, అనన్య నాగళ్ల, మధుబాల, ప్రకాష్ రాజ్, గౌతమి, కబీర్ బేడి తదితరులు
కెమెరా: శేఖర్ వి జోసెఫ్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సంగీతం: మణిశర్మ
నిర్మాత: నీలిమ గుణ
దర్శకత్వం: గుణశేఖర్
విడుదల తేదీ: 14 ఏప్రిల్ 2023
వ్యాసమహాభారతంలోని శకుంతల కథని కాళిదాసు నాటకీయంగా మలిచి, కొన్ని స్వీయకల్పనలు జోడించి “అభిజ్ఞాన శాకుంతలం” రాసాడు. ఆ రచన సంస్కృత వాఞ్మయ చరిత్రలో అజరామరం. ఆ కథని వెండి తెర మీదకి ఎక్కించే ప్రయత్నం చేసాడు దర్శకుడు గుణశేఖర్. ఆలోచన, ప్రయత్నం గొప్పవే. ఇంతకీ ఫలితమెలా ఉందో చూద్దాం.
శకుంతల-దుశ్యంతుల కథ చాలా మందికి తెలుసు. అయినా క్లుప్తంగా చెప్పుకోవాలంటే…..
దూశ్యంతుడు ఒక మహారాజు. మునికాంత అయిన శకుంతలని ప్రేమించి వివాహం చేసుకుంటాడు. తన ప్రేమకి గుర్తుగా ఒక ఉంగరాన్ని ఇస్తాడు ఆమెకు. కానీ దూర్వాసముని శాపం వల్ల దుశ్యంతుడు ఆమెను మరిచిపోతాడు. ఆమెకు ప్రేమగా ఇచ్చిన ఏదైనా వస్తువుని చూసినప్పుడు మళ్లీ తనకు ఆమె గుర్తుకొస్తుందని దూర్వాసుడు శాపవిమోచనం చెప్తాడు. శకుంతల వేలికి ఉన్న ఆ వదులైన ఉంగరం ఒక రోజు నీటిలో పడిపోతుంది. అది ఒక చేప మింగుతుంది. దానిని జాలరి కోసినప్పుడు ఆ ఉంగరాన్ని గుర్తిస్తాడు. దానిని అమ్మబోతే అది రాజముద్రికగల ఉంగరమని తెలుసుకుని మహారాజు దుశ్యంతుడి సమక్షానికి తీసుకువచ్చి చూపిస్తారు. ఆ ఉంగరాన్ని చూసిన దుశ్యంతుడికి గతం గుర్తుకొస్తుంది. శకుంతలని కలిసి క్షమించమని కోరతాడు. శాప వృత్తాంతం తెలుసుకున్న శకుంతల అతనిని అంగీకరిస్తుంది. వీళ్లకి పుట్టిన కొడుకే భరతుడు. అతని పేరు మీదనే భరతఖండం వెలిసింది.
ఈ కథని ఇప్పటి ప్రేక్షకులకి నచ్చేలా తీయాలంటే ఎంత ఎమోషనల్ గా ఉండాలి? ఎంత కసరత్తు చెయ్యాలి? ఒక పక్కన బాహుబలి, పొన్నియన్ సెల్వన్ లాంటి సినిమాలు చూసేసిన కళ్లకి ఎప్పుడో 1996లో గుణశేఖర్ తీసిన “బాల రామాయణం” ని తలపించే సెట్టింగులు, బాపు-రమణలు తీసిన ఈటీవీ భాగవతం మాదిరి గ్రాఫిక్స్ పెడితే సరిపోతుందా? ఈ లెక్క అస్సలు వేసుకోకుండా శకుంతలగా సమంత అనగానే తక్కినవేవీ ప్రేక్షకులు పట్టించుకోరు అన్న చందాన తీసిన సినిమాలాగ ఉందిది.
మొత్తం స్టూడియో ఫ్లోర్ లో గ్రీన్ మ్యాట్ వేసి, ఏవరేజ్ గ్రాఫిక్స్ జోడించి చుట్టేసినట్టుంది తప్ప, ప్రచారం చేసుకుంటున్న బజెట్ కి తగ్గట్టుగా ఏ మాత్రం లేదు. విజువల్ గానే పెద్ద మైనస్ అనుకుంటే సంభాషణలు, ఉపకథలు కలిపి ఒక రవీంద్రభారతిలో నాటకం చూస్తున్న అనుభూతి కలిగిస్తుంది.
ఇంద్రసభ అయితే ఏదో స్టార్ హోటల్ లాబీలాగ ఉంది. ఆర్ట్ డైరెక్షన్ కూడా అంత దయనీయంగా ఉందన్నమాట. తాను తీసిన సాంఘిక చిత్రాలకే సెట్టింగుల కోసం నిర్మాతల చేత భారీగా ఖర్చు పెట్టించిన గుణశేఖర్ తాను నిర్మాత అయ్యే సరికి పొదుపు పాటించి సెట్టింగుల మీద కాకుండా చీప్ గ్రాఫిక్స్ మీద ఆధారపడడం చూస్తుంటే జాలేస్తుంది.
చెలికత్తెల చేత దుర్వాసముని వృత్తాంతం, ఉగ్రనేమి కథ చెప్పించడమే పెద్ద తప్పు. ఎలిమెంటిరీ స్కూల్ పిల్లలకి కథ చెప్పే టీచర్ల వాయిస్ లో ఆ చెలికత్తెలు చెపుతుంటే ప్రేక్షకులు మొహం చిట్లించి నీరసంగా గుటకలు వేస్తూ, అసహనంతో కుర్చీలోనే మెలికలు తిరగాల్సిన పరిస్థితి.
కథనానికి అడ్డొస్తూ, ప్రేక్షకుల అటెన్షన్ ని చెడగొట్టే పనులు అస్సలు చెయకూడదనేది కనీస అవగాహన. గుణశేఖర్ లాంటి దర్శకుడు ఆ విషయాన్ని పక్కన పెట్టి అనవసర ఉపకథల జోలికి పోవడం ఆశ్చర్యం.
సాంకేతికంగా చూస్తే సర్వం, సమస్తం కాలం చెల్లిన బాపతే అనిపిస్తాయి. మణిశర్మ సంగీతం నీరసానికి పరాకాష్ట. అసలే కథనం కాళ్లీడుస్తూ సాగుతుంటే ఆ దోషాన్ని పరిహరించాల్సిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత పరీక్ష పెడుతుంది.
పాటలు కూడా నీరసమే. నిజానికి “ఋషివనంలోన..” మంచి సాహిత్యం. కానీ గాయక గాయినీమణులిద్దరూ గాయం చేసారు. ముఖ్యంగా చరణాల్లో ఆడ వాయిస్ హై పిచ్ లో కీచు గొంతులా మారి అసలేం పాడుతోందో అర్ధం కాదు. గాయకులని తప్పుపట్టడం కంటే ఈ శ్రుతికి ఈ గాత్రాల్ని ఎంపిక చేసుకున్న మణిశర్మనే తప్పుబట్టాలి. “మల్లిక మల్లిక” పాటొక్కటీ చూస్తున్నప్పుడు బాగుంది.
ఇక సంభాషణల విషయానికొస్తే అస్సలు తూకం లేకుండా బలవంతంగా తెచ్చిపెట్టుకున్న గ్రాంధిక తెలుగులో రాసినట్టున్నాయి. ఎక్కడా ఒక నేచురల్ ఫ్లో లేదు. దానికి తోడు ఒక్క మోహన్ బాబును మినహాయిస్తే ఆ శైలి డైలాగ్స్ పలకగల నటీనటులు ఒక్కరూ లేరు. దానివల్ల డ్రామా మొత్తం కృతకంగా తయారయ్యి విసిగిస్తుంది. దుశ్యంతుడు చందమామని చూస్తూ ఏదో కవిత్వం లాంటి డైలాగ్ చెప్తాడు. అస్సలు పొసగక చిరాకు తెప్పిస్తుంది.
నటీనటవర్గానికి వస్తే టైటిల్ రోల్ పొషించిన సమంత పర్వాలేదు. నిండుసభలో తనకి అవమానం జరుగుతున్నప్పుడు ఆమె కనబరిచిన నటన బాగుంది. నిజానికి ఆ సన్నివేశంలో ఏ నటి చేసినా బాగానే ఉంటుంది. ఆ సన్నివేశబలం అలాంటిది.
దుశ్యంతుడిగా కనిపించిన దేవ్ మోహన్ చూడడానికి బాగానే ఉన్నా కీలకమైన సన్నివేశాల్లో సరిపడా కరుణరసాన్ని కురిపించలేకపోయాడు. సమంతలాంటి స్టార్డం ఉన్న నటిని శకుంతలగా పెట్టుకున్నప్పుడు దుశ్యంతుడిని కూడా ఆ స్థాయి హీరోని పెట్టుకుని ఉండాల్సింది.
శకుంతల కథకి కణ్వమహాముని పాత్ర చాలా కీలకం. ఆ పాత్రని సచిన్ ఖేడేకర్ కి ఇచ్చి కుదించేసారు.
దూర్వాసుడిగా మోహన్ బాబు కనిపించిన కాసేపు తెర మీద కాస్త పర్ఫార్మెన్స్ చూస్తున్నట్టు అనిపించింది.
శివబాలాజీ కామెడీలాంటిదేదో చేసి కాసేపు విసిగించాడు.
అల్లు అర్హ భరతుడిగా బాగానే ఉంది. అయితే అది కూడా లవకుశులు శ్రీరాముడిని అడివిలో కలిసినప్పుడు సీనులాగ ఉంది.
ఏ రకంగా చూసుకున్నా తీసిన పద్ధతిలో ఫ్రెష్నెస్ అనేది ఇంచుకైనా కనపడదు.
ఇలాంటి సినిమాలు ఇప్పటి పరిస్థితుల్లో తీస్తే బాహుబలిని తలదన్నేలా తీయగలగాలి. అంత బజెట్ తో తీయగలిగే పరిస్థితి లేనప్పుడు విరమించుకోవాలి. అంతే తప్ప ఎలా పడితే అలా తీస్తే జనం చూసేస్తారనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. ఇప్పటి ఆడియన్స్ అంచనాలు, పల్స్ ఏ మాత్రం తెలియకుండా తీసిన సినిమాకి ఉదాహరణ ఈ “శాకుంతలం”.
బాటం లైన్: అతలాకుతలం