మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డికి పూర్తిగా మతిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయంగా ఆయన్ను ఏ పార్టీ కూడా దగ్గరికి తీయడం లేదు. డీఎల్‌కు మాత్రం బలమైన రాజకీయ ఆకాంక్ష వుంది. సుదీర్ఘ కాలం పాటు మైదుకూరు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించడం, ఇప్పుడు ఏ పదవీ లేకపోవడంతో పట్టించుకునే వారే కరువయ్యారు. దీన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. కానీ ఆయన్ను ఎవరూ నెత్తిన పెట్టుకోలేదు. ఎన్నికల సమయం కావడంతో వైఎస్ జగన్‌పై సంచలన కామెంట్స్ చేస్తే ప్రత్యర్థులు పట్టించుకుంటారనే ఉద్దేశంతో చిల్లర రాజకీయాలకు తెగబడ్డారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పౌర సమాజం అసహ్యించుకునేలా వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై డీఎల్ అవాకులు చెవాకులు పేలారు. చివరికి వైఎస్ జగన్ సతీమణి భారతిపై కూడా విమర్శలు చేసే స్థాయికి దిగజారారు.
వైఎస్ జగన్ నుంచి ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలకు ముప్పు పొంచి వుందని సంచలన ఆరోపణలు చేశారు. వాళ్లిద్దరూ జాగ్రత్తగా వుండాలని ఆయన సూచించారు. ప్రస్తుతం రాజారెడ్డి, రాజశేఖరరెడ్డి కాకుండా, భారతీరెడ్డి రాజ్యాంగం నడుస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ సలహా మేరకు వైఎస్ కుటుంబంలో ఒకరో ఇద్దరిని చంపడానికి కూడా వెనకాడరంటూ సంచలన ఆరోపణలు చేశారు.
రాజకీయ ఉనికి కోసం వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర విమర్శలను డీఎల్ చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అప్పుడప్పుడు మీడియా ముందుకొచ్చి ఎల్లో బ్యాచ్‌ని సంతృప్తి పరిచేలా ఘాటు వ్యాఖ్యలు చేయడం డీఎల్‌కు వ్యసనమైందని వైసీపీ నేతలు అంటున్నారు. రాజకీయం కోసం ఇంతగా దిగజారాలా? అని వారు ప్రశ్నిస్తున్నారు.