టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పరువు మొత్తాన్ని మాజీ మంత్రి కొడాలి నాని తీశారు. గుడివాడలో చంద్రబాబునాయుడు పర్యటన, జగన్, కొడాలిపై విమర్శల గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొడాలి నాని తనదైన స్టైల్లో చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.
రాష్ట్రానికి చంద్రబాబు చేసిందేమీలేదని అన్నారు. గుడివాడలో 23 వేల మంది పేదలకు ఇళ్లు ఇస్తున్నామన్నారు. గుడివాడ అభివృద్ధిపై చంద్రబాబుతో చర్చకు తాను సిద్ధమని కొడాలి నాని సవాల్ విసిరారు. గుడివాడను చంద్రబాబు 14 ఏళ్లపాటు గాలికి వదిలేశారన్నారు. ఇప్పుడు సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. గుడివాడలో చంద్రబాబు ప్రచారం చేసిన ప్రతి సందర్భంలోనూ టీడీపీ ఓడిపోయిందన్నారు. గుడివాడలో పేదల ఇళ్ల కోసం చంద్రబాబు ఒక్క ఎకరం కొన్నట్లు నిరూపించినా తాను రాజకీయాలు వదిలేస్తా అని కొడాలి నాని సవాల్ విసిరారు.
నిమ్మకూరు ఎన్టీఆర్ పుట్టిన వూరన్నారు. చంద్రబాబుకు అత్తగారి వూరు అని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు 75 ఏళ్ల వయసులో పాడెక్కడానికి రెడీగా ఉన్నారన్నారు.. ఇప్పుడెళ్లి రాత్రి పూట పడుకున్నానని సిగ్గులేకుండా చెబుతున్నాడని దెప్పి పొడిచారు. చంద్రబాబు పెళ్లయి 42 ఏళ్లైందని, మొదటిసారి అత్తారింటికెళ్లి పడుకున్నానని చెబుతున్నాడంటే, ఆయన మమకారం ఏపాటిదో అర్థమవుతోందన్నారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు.
ఎక్కడ పడుకున్నాడో మీరంతా చూశారు కదా…బస్సులో పడుకున్నాడన్నారు. ఎన్టీఆర్ సొంత వూళ్లో కనీసం పడుకోడానికి ఒక ఇల్లు కూడా ఎవరూ ఇవ్వలేదన్నారు. రోడ్డుమీద బస్సు పెట్టుకుని, అక్కడ పడుకున్న దిక్కుమాలిన వ్యక్తి చంద్రబాబునాయుడు అని తన స్టైల్లో చంద్రబాబుకు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు. నిమ్మకూరులో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలు కూడా చంద్రబాబు పెట్టలేదన్నారు. తాము పెట్టిన విగ్రహలకు చంద్రబాబు దండలు వేశారన్నారు.