పుదుచ్చేరిలోని మహిళల జిమ్ అది. ఆ జిమ్ ఓనర్ కమ్ ట్రైనర్ కూడా మహిళే. జిమ్ లో కసరత్తులు నేర్పించడంతో పాటు, మహిళలకు ఫిట్ నెస్ సలహాలు కూడా ఇస్తుంటుంది. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే ఇటీవలే ఆ జిమ్ ఫిట్ నెస్ కోచ్ మహిళ కాదు, పురుషుడు అని తేలింది. ఆడవేషంలో అందర్నీ మోసం చేయడమే కాకుండా చివరకు బ్లాక్ మెయిల్ కి దిగడంతో ఈ వ్యవహారం బయటపడింది.
మోసం ఎలాగంటే..?
సహజంగా జిమ్ కి వచ్చేవారికి ఎలాంటి కసరత్తులు చేయాలి, కండలు ఎలా పెంచుకోవాలి.. అనే విషయాలపై ఫిట్ నెస్ కోచ్ లు ట్రైనింగ్ ఇస్తుంటారు. దగ్గరుండి ఎక్సర్సైజ్ లు చేయిస్తారు. కొన్నిసార్లు వారి ఫొటోలు తీస్తారు. మూడు నెలల ముందు, ఆరు నెలల తర్వాత అంటూ వారి ప్రోగ్రెస్ ని చూపిస్తుంటారు. సరిగ్గా ఇదే విషయంలో ఆ మోసగాడు జిమ్ కి వచ్చే మహిళలకు టోకరా వేశాడు.
దేహదారుఢ్యం కనిపించేలా వారి ఫొటోలు పంపించాలన్నాడు. ఫిజిక్ కరెక్ట్ గా కనపడాలంటే నగ్న ఫొటోలు కూడా పంపించాలని, అప్పుడే వారికి మెరుగైన ట్రైనింగ్ ఇవ్వగలనని నమ్మబలికాడు. దీంతో చాలామంది మోసగాడికి తమ నగ్న ఫొటోలు, వీడియోలు పంపారు. ట్రైనర్ కూడా మహిళే కదా అనే నమ్మకంతోనే ఆ పనిచేశారు. కానీ చివరకు వాడి మోసానికి బలయ్యారు.
నగ్న ఫొటోలు, వీడియోలు రాగానే ఆడ వేషంలో ఉన్న జిమ్ ట్రైనర్ అసలు రూపం బయటపెట్టాడు. ఆ ఫొటోలు, వీడియోలు బయటపెడతానంటూ వారిని బ్లాక్ మెయిల్ చేశాడు. డబ్బులివ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో వారు బిత్తరపోయారు. ఇన్నాళ్లూ తమతో కసరత్తులు చేయించింది మహిళ కాదు, పురుషుడు అని తెలుసుకొని షాకయ్యారు.
వాడి దగ్గర తమ ఫొటోలు, వీడియోలు ఉన్నాయని భయపడ్డారు. డబ్బులిచ్చినా బ్లాక్ మెయిలింగ్ మానడని నిర్థారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ జిమ్ ట్రైనర్ ని అరెస్ట్ చేశారు. అతడి ఫోన్ లో 10 నగ్న వీడియోలను కనుగొన్నారు.