నందమూరి బాలకృష్ణ నోటి దురుసుకు ఆయన చిన్న అల్లుడు భరత్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందా? అంటే …ఔననే సమాధానం వస్తోంది. ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేశ్ పాదయాత్రలో బాలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌ను సైకోగా అభివర్ణించారు. అలాగే జగన్ ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలారు. దీంతో బాలయ్య అల్లుడి అక్రమ ఆస్తుల గురించి జగన్ ప్రభుత్వానికి గుర్తు చేసినట్టైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విశాఖలో గీతం యూనివర్సిటీలో ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా బాలయ్య నోటి దూల తెచ్చిన తంటా అని గీతం వర్సిటీ అధికారులు వాపోతున్నారు. గతంలో కూడా ఈ వర్సిటీ ఆక్రమణలో ఉన్న 36 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసింది. తాజాగా సర్వే నంబర్ 15, 16, 19, 20 పరిధిలోని 4.36 ఎకరాల ప్రభుత్వ భూమిని తెల్లవారుజామున రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ కూడా వేశారు. నందమూరి బాలకృష్ణ హద్దులు దాటి వ్యక్తిగత విమర్శలు చేయడం ప్రభుత్వ పెద్దలకు కోపం తెప్పించదనే చర్చ జరుగుతోంది. దీంతో ఆయన చిన్నల్లుడు భరత్‌కు సంబంధించి గీతం వర్సిటీ ఆక్రమణలో ఉన్న భూములపై ప్రభుత్వ కన్ను పడింది. ఎట్టకేలకు ఆక్రమణల స్వాధీనం దాదాపు పూర్తయినట్టు చెబుతున్నారు.
ఇదిలా వుండగా గీతం వర్సిటీలో ఆక్రమణ భూముల స్వాధీనాన్ని చంద్రబాబు తప్పు పట్టడం గమనార్హం. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లైనా విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. గీతం యూనివర్సిటీ గోడలు కూల్చడం దుర్మార్గమన్నారు. చదువుల తల్లి గీతం యూనివర్సిటీపై జగన్‌కు కక్ష ఎందుకని ఆయన ప్రశ్నించారు.
చదువుల తల్లి గీతం ప్రభుత్వ భూముల్ని ఎందుకు ఆక్రమించిందనే విషయాన్ని మాత్రం చంద్రబాబు చెప్పడం లేదు. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకోకుండా, తనలాగా వదిలేస్తుందని ఆయన ఎందుకు భావించారో అర్థం కావడం లేవు.