తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డికి వయసు పెరిగే కొద్ది…మనిషి ఏదోలా అవుతున్నారు. ఆయన ఎప్పుడు, ఎలా ప్రవర్తిస్తారో దగ్గరి వాళ్లకు కూడా తెలియడం లేదు. నారా లోకేశ్ పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలో పూర్తి చేసుకుని నంద్యాల జిల్లా డోన్‌లో ప్రవేశించింది. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర పూర్తి చేసుకోవడంపై జేసీ మీడియాతో మాట్లాడారు.
లోకేశ్ ఒక కర్మ జీవి అని, కాళ్ల బొబ్బలు పగిలాయని, కళ్లల్లో నీళ్లు వచ్చాయంటూ అన్నంత పని చేశారు. లోకేశ్ ఆంధ్రప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నారని, గొప్ప లీడర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. తనకే ఇంత ఆవేదనగా వుంటే, లోకేశ్ కుటుంబ సభ్యులు ఎలా వున్నారో అంటూ ఉద్వేగంతో చెప్పుకొచ్చారు. అలాగే లోకేశ్‌తో కలిసి తన కొడుకు మూడు రోజులు నడిచాడని, కాళ్లు నొప్పిస్తున్నట్టు చెబుతున్నాడన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడేందుకు లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని, సక్సెస్ అయ్యారని.. ఆయన కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని జేసీ చెప్పారు. కష్టమైనా ఫర్వాలేదని, లోకేశ్ పాదయాత్ర చేయాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి కోరారు. లోకేశ్ నడుస్తుంటే తనకు బాధ వేస్తోందని.. విష్ యూ ఆల్ గుడ్ లక్ అంటూ లోకేశ్‌కు శుభాకాంక్షలు చెబుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి కంట కన్నీళ్లు వచ్చాయి.
లోకేశ్ కోసం జేసీ ఏడ్వడం ఆశ్చర్యంగా వుందని, నటన ఎక్కువైందని ప్రత్యర్థులు సెటైర్స్ విసురుతున్నారు. లోకేశ్‌ను గొప్ప లీడర్‌గా అభివర్ణించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి మానసిక స్థితిని అర్థం చేసుకోవచ్చని దెప్పి పొడుస్తున్నారు.
తన లీడర్‌షిప్‌పై లోకేశ్‌కు, అలాగే కుమారుడిపై చంద్రబాబుకు కూడా లేని అభిప్రాయం, అదేంటో గానీ జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోందంటూ నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు. కనీసం మంగళగిరిలో గెలవని లోకేశ్‌లో గొప్ప నాయకత్వ లక్షణాలు జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఎలా కనిపిస్తున్నాయో అని ప్రశ్నిస్తున్నారు. యాక్షన్ చేస్తే ఓకే కానీ, జేసీది ఓవర్ యాక్షన్ అని సోషల్ మీడియాలో కామెంట్స్.