కర్ణాటక ప్రయోగం తెలుగునాట సాధ్యమేనా?

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల టికెట్ లు కేటాయించే విషయంలో భారతీయ జనతా పార్టీ అవలంబించిన విధానం కాస్త షాకింగ్ గానే వుంది. అస్సలు మొహమాటం అనేది లేకుండా కేవలం గెలుపు గుర్రాలకే టికెట్ లు…

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల టికెట్ లు కేటాయించే విషయంలో భారతీయ జనతా పార్టీ అవలంబించిన విధానం కాస్త షాకింగ్ గానే వుంది. అస్సలు మొహమాటం అనేది లేకుండా కేవలం గెలుపు గుర్రాలకే టికెట్ లు ఇచ్చారు. పార్టీ ప్రముఖులను అస్సలు ఖాతరు చేయలేదు. సీనియార్టీలను పక్కన పెట్టారు. ఈ విధంగా టికెట్ లు ఇవ్వడం భాజపాకు సాధ్యమైంది. కానీ తెలుగునాట తెరాస..కాంగ్రెస్, వైకాపా, తెలుగు దేశం పార్టీలకు ఏ మేరకు సాధ్యమవుతుంది అన్నది ప్రశ్న.

ఈ నాలుగు పార్టీలో ఇలా చేయాల్సిన అత్యవసరం అన్నది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వుంది. తెలంగాణలో భాజపా, తెరాసలకు సరైన ప్రత్యామ్నాయంగా ఎదగగలిగిన అవకాశం కాంగ్రెస్ కు వుంది. కానీ వృద్ద తరం అందుకు అస్సలు అవకాశం ఇవ్వడం లేదు. మూడు ముఠాలు, ఆరు తగాదాలు అన్నట్లు వుంది పార్టీ పరిస్థితి. నిర్మొహమాటంగా వృద్ద తరాన్ని పక్కన పెట్టి, కొత్త తరాన్ని ప్రోత్సహించగల ధైర్యం కాంగ్రెస్ అధిష్టానం చూపించాల్సి వుంది. అలా చూపించగలిగితే దాని ప్రభావం వేరుగా వుంటుంది.

ఇక తెరాస వరకు వస్తే, కాస్త ధైర్యం చేయగల అవసరం పెద్దగా లేకున్నా అవకాశం పుష్కలంగా వుంది. ఎందుకంటే గెలుపు చాన్స్ ఎక్కువగా వుంది కనుక, పార్టీ అధిష్టానం, నాయకత్వం బలంగా వుంది కనుక ఎలాంటి ప్రయోగాలైనా చేయవచ్చు. పార్టీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని, ఇప్పటి నుంచి కాస్త డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకోవడం తెరాస కు అవసరమే.

ఆంధ్ర వరకు వస్తే వైకాపా లో ఇలాంటి నిర్మొహమాట చర్యలు కొత్త కాదు. టికెట్ లు కేటాయించడం లో జగన్ అస్సలు ఎవ్వరి మాటా వినరు. తన స్వంత సర్వేలు, ప్రశాంత్ కిషోర్ టీమ్ మీద ఎక్కువగా ఆధారపడతారు. అందరూ అనుకునే ఈక్వేషన్లు వేరు జగన్ ఆలోచనలు వేరు అన్నట్లు వుంటుంది టికెట్ ల కేటాయింపు. 

గతంలో ఇది చాలా సార్లు రుజువు అయింది కూడా. మరి ఈ సారి కూడా అదే దారిన వెళ్తారా అన్నది కాస్త అనుమానం. ఎందుకంటే పార్టీ అధినాయకత్వం మరీ గతంలో వున్నంత బలంగా వున్నట్లు కనిపించడం లేదు. జగన్ వైఖరిలో ఇటీవల కొంత మార్పు కనిపిస్తోంది. కొంచెం మెత్తబడినట్లు తెలుస్తోంది. అందువల్ల తాను నిర్మొహమాటంగా కట్ చేయాలి అనుకున్న వారిని కట్ చేస్తారా? అన్నది వేచి చూడాలి.

ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే, చంద్రబాబు టికెట్ ల కేటాయింపు విషయంలో చారా భయంతో వ్యవహరిస్తారు. 2019 లో కూడా పార్టీలోని వృద్ద తరాన్ని పక్కన పెట్టలేకపోయారు. కానీ ఈసారి మాత్రం పక్కా యువతరానికే అంటున్నారు. ఈ యవతరంలో ఎక్కువ మంది మళ్లీ వారసులే కావడం విశేషం. అంటే వృద్దతరాన్ని పక్కన పెట్టినట్లు..పెట్టనట్లు కాకుండా వ్యవహరించడం అన్నమాట. మరి ఇది జనాలు గమనిస్తారా? అదే కుటుంబం అని పక్కన పెడతారా? కొత్త తరం అని స్వీకరిస్తారా? అన్నది చూడాలి. ఏమైనా కర్ణాటకలో భాజపా చూపించినంత ధైర్యం, తెగువ చంద్రబాబు ఎప్పటికీ చూపించలేరు. అది వాస్తవం.

రాజకీయాల్లోకి ఎప్పటికప్పుడు కొత్త నెత్తురు రావాలంటే మాత్రం భాజపా బాటనే పట్టాలి ఏ పార్టీ అయినా.