శాండ్ విచ్.. చేయడం చాలా తేలిక. తినడం కూడా చాలా ఈజీ. అందరికీ అందుబాటులో ఉండే ఫుడ్ ఇది. అయితే ఇందులో కూడా కాస్ట్ లీ శాండ్ విచ్ ఉంది. ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కు ఎక్కిన శాండ్ విచ్ ఒకటి ఉంది. దీని రేటు అక్షరాలా 214 డాలర్లు. భారతీయ కరెన్సీలో అటుఇటుగా 17,500 రూపాయలన్నమాట. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన శాండ్ విచ్ ఇది. ఇది ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ దొరకదు.
ఇంతకీ ఈ శాండ్ విచ్ ప్రత్యేకత ఏంటి..?
ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఛీజ్ తో ఈ శాండ్ విచ్ చేస్తారు. దక్షిణ ఇటలీకి చెందిన పొడోలికా జాతి ఆవుల నుంచి తీసిన పాలతోనే ఈ ఛీజ్ చేస్తారు. ప్రపంచంలో ఆ జాతి ఆవులు కేవలం 25వేలు మాత్రమే ఉన్నాయి. అంతేకాదు, అవి కేవలం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మాత్రమే పాలు ఇస్తాయి. ఆ పాల నుంచి తీసిన వెన్నను ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన వెన్నగా పిలుస్తారు. దానితో ఈ శాండ్ విచ్ ను తయారుచేస్తారు.
ఇక దీనికోసం వాడే బ్రెడ్ ను ఫ్రాన్స్ లోని అత్యుత్తమమైన గోధుమల నుంచి తయారుచేస్తారు. ఈ బ్రెడ్ ను 23కారట్ల బంగారు ఆకులతో తాపడం చేస్తారు. వీటిని కూడా తినొచ్చు. ఇక ఈ శాండ్ విచ్ కు డిప్ కోసం సౌతాఫ్రియా సముద్రతీరంలో అత్యంత అరుదుగా దొరికే పీతలతో చేసిన సాస్ ను ఉపయోగిస్తారు. ఇక ఇటలీలో దొరికే అత్యుత్తమమైన షాంపేన్ ను తాగడానికి ఇస్తారు. అందుకే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన శాండివిచ్ గా ఇది పేరు తెచ్చుకుంది. ఈ శాండ్ విచ్ పేరు 'ది క్వింట్ ఎసెన్సియల్ గ్రిల్ డ్ ఛీజ్ శాండ్ విచ్'.
ప్రస్తుతం ఎక్కడ దొరుకుతుంది..?
అయితే ఈ శాండ్ విచ్ కేవలం గిన్నిస్ రికార్డ్ వరకే పరిమితం. ప్రపంచంలో ఏ రెస్టారెంట్ దీన్ని సెర్వ్ చేయడం లేదు. లాంగ్ గ్యాప్ తర్వాత న్యూయార్క్ కు చెందిన సెరెండిపిటీ-3 (ఎస్3) అనే రెస్టారెంట్ ఈ శాండ్ విచ్ ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం కొన్ని రోజుల పాటు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ఇది కావాలంటే 48 గంటల ముందే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. అమెరికాలో జాతీయ గ్రిల్డ్ ఛీజ్ డేను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ శాండ్ విచ్ ను అందుబాటులోకి తెచ్చారు.