జేడీ లక్ష్మీ నారాయణ కేసీఆర్ గానం దేనికోసం ..?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ మాట్లాడితే చాలు బీఆర్ఎస్ కేసీఆర్ అంటున్నారు. విశాఖ ఉక్కు మీద బీఆర్ఎస్ నేతలు పక్క రాష్ట్రంలో మాట్లాడుతూంటే జేడీ విశాఖ నుంచి భేష్ అంటూ వస్తున్నారు.…

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ మాట్లాడితే చాలు బీఆర్ఎస్ కేసీఆర్ అంటున్నారు. విశాఖ ఉక్కు మీద బీఆర్ఎస్ నేతలు పక్క రాష్ట్రంలో మాట్లాడుతూంటే జేడీ విశాఖ నుంచి భేష్ అంటూ వస్తున్నారు. నిజానికి విశాఖ ఉక్కు ఉద్యమం రెండేళ్లుగా సాగుతోంది. బీఆర్ఎస్ చేసింది ఏంటి అంటే ఏమీ లేదు అనే చెబుతారు.

విశాఖ ఉక్కునే కొంటామని ఆ పార్టీ నాయకులు చేసిన ప్రకటనలకు ఎంత విలువ ఉందొ కూడా అందరికీ తెలుసు. అసలు ఉక్కు కర్మాగారాన్ని కొనడం సులువు కూడా కాదు, బిడ్ లో సైతం తెలంగాణా రాష్ట్రం పాల్గొనలేదు, నిబంధనలు అలా ఉన్నాయి. అయినా సరే ఇదంతా మా క్రెడిట్ అని  బీఆర్ఎస్ నేతలు క్లెయిం చేసుకుంటూంటే కేసీఆర్ వల్లనే కేంద్రం వెనక్కి తగ్గింది అని జేడీ అంటున్నారు. ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నారు.

కేసీఆర్ లేకపోతే విశాఖ ఉక్కు అన్నదే లేకుండా పోయేది అన్నట్లుగా జేడీ మాటలు ఉన్నాయి. కొంపదీసి ఆయన బీఆర్ఎస్ లో చేరుతారా అన్న సందేహాలు వస్తున్నాయి. దానికి విశాఖ ఉక్కుని ముడిపెడుతున్నారని అంటున్నారు.

ఇంతకీ కేసీఆర్ ఏమి చేసారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నిస్తున్నారు. ఆయన ఏమైనా పోరాడారా అని అడుగుతున్నారు. రెండేళ్లుగా తాము విశాఖ ఉక్కు విషయంలో ఒక పధ్ధతి ప్రకారం పోరాడుతూ వస్తున్నామని చెప్పారు. అయినా కేంద్ర మంత్రి తాజా ప్రకటన ఒక తాత్కాలిక ఉపశమనం మాత్రమే అని కూడా ఆయన అసలు విషయం బయట పెట్టారు. తాము ఉక్కు ప్రైవేట్ మీద స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకూ పోరాడుతామని బొత్స అంటున్నారు.