ఉక్కుకి ఊపిరి ఉన్నట్లే

దాదాపుగా రెండేళ్లకి క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తామని కేంద్రం నుంచి ప్రకటన వచ్చింది ఆనాటి నుంచి విశాఖ ఉక్కు కార్మికులు ఉద్యమిస్తున్నారు. ఈ మధ్యలో ఎన్నో సార్లు కార్మిక…

దాదాపుగా రెండేళ్లకి క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తామని కేంద్రం నుంచి ప్రకటన వచ్చింది ఆనాటి నుంచి విశాఖ ఉక్కు కార్మికులు ఉద్యమిస్తున్నారు. ఈ మధ్యలో ఎన్నో సార్లు కార్మిక నాయకులు ఢిల్లీ వెళ్ళి వచ్చారు. వారికి ఉక్కు మంత్రి అపాయింట్మెంట్ కూడా చాలా సార్లు దొరకలేదు.

విశాఖ ఉక్కుని అమ్మేయడమే అంటూ పార్లమెంట్ సాక్షిగా గంభీరమైన ప్రకటనలు చాలా కేంద్ర మంత్రులు చేస్తూ వచ్చారు. విశాఖ ఉక్కుని కాపాడడం ఎవరి తరం కాదని స్టేట్మెంట్స్ ఇచ్చారు. విశాఖ వచ్చి చూడండి ఉక్కు ఎంత లాభదాయక సంస్థ అన్నది తెలుస్తుంది అని కార్మిక లోకం చెవికి ఇల్లు కట్టుకుని పోరాడినా ఏ ఒక్క మంత్రీ రాలేదు సరికాదా వ్యతిరేక ప్రకటనలు ఆపలేదు.

ఇన్నాళ్ళకు పనిగట్టుకుని మరీ కేంద్ర ఉక్కు మంత్రి ఫగ్గన్‌సింగ్‌ కులస్తే విశాఖ ఉక్కు కర్మాగారానికి వచ్చారు అంటే కేంద్రం వైఖరిని ఎలా అర్ధం చేసుకోవాలో కార్మిక నాయకులకే అర్ధం కావడంలేదు అని అంటున్నారు. కార్మిక మంత్రి ప్లాంట్ లోపలికి వెళ్ళి అన్నీ పరిశీలించారు. ఉక్కు ని మరింత పటిష్టంగా మారుస్తామని చెప్పారు.

ప్రైవేట్ వంటి మాటలు ఇపుడు ఎందుకు లెండి అని మీడియా మీద కాస్తా చికాకు ప్రదర్శించారు. ముందు ఉక్కుని బాగుపడనివ్వండి,మా ప్రయత్నాలు అన్నీ ఆ దిశగానే అంటూ కేంద్ర మంత్రి చెప్పడం వెనక కేంద్రం ఆలోచనలు ఏంటి అన్నదే అందరిలో కలుగుతున్న సందేహం. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రస్తుతానికి ప్రైవేటేకరించమని కేంద్ర మంత్రి అంటున్నారు.

ప్రస్తుతానికి అంటే ఎపుడో ఒకపుడు ఆ ముప్పు పొంచి ఉంది కదా అన్న డౌట్ వస్తోంది. అయితే ఉక్కు కార్మిక నాయకుల మాటలను బట్టి చూసుకున్నా లేక మేధావులు ప్రజా సంఘాల ఆలోచనలు చూసుకున్నా ఇప్పట్లో విశాఖ ఉక్కుని ప్రమాదం వచ్చేది అయితే లేదు. ఎందుకంటే 2024లో లోక్ సభకు ఎన్నికలు ఉన్నాయి. కేంద్రంలోని బీజేపీ ఈసారి సౌత్ వైపు చూస్తోంది.

సౌత్ లో అతి పెద్ద ఉక్కు కర్మాగారాన్ని ఈ కీలక సమయంలో ప్రైవేట్ పరం చేసి లొల్లి పెట్టుకోదు. అందువల్ల 2024 ఎన్నికల దాకా ఉక్కుకి ఊపిరి ఉన్నట్లే అని అంటున్నారు. ఆ మీదట బీజేపీకి ఫుల్ మెజారిటీ రాకపోయినా లేక ఏ ఇతర సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినా ఉక్కు మరింత కాలం దర్జాగా బతికేసినట్లే అంటున్నారు. ఫగ్గన్‌సింగ్‌ కులస్తే ఏ ముహూర్తాన ఉక్కుని ప్రైవేట్ పరం చేయమని అన్నారో కానీ ఉక్కుకు వేయేళ్లు అనే కార్మిక లోకం ఇపుడు ఆనందం వ్యక్తం చేస్తోంది.