ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రోజుకో సంచలనం. ఈ కేసులో ప్రధానంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ప్రముఖంగా వినిపించడం రాజకీయ దుమారానికి తెరలేచింది. అసలు తనకు ఏ పాపం తెలియదని ఆమె అంటున్నారు. అయితే స్కామ్‌లో కవిత పాత్రను బయట పెట్టేందుకు బీజేపీ వ్యూహాల్ని రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్‌తో కవిత ఆర్థిక పరమైన అంశాలపై వాట్సాప్‌లో చాట్ చేశారని ఆధారాలతో సహా వివరాలు బయటికొచ్చాయి.
అయితే ఈ వాట్సాప్ చాటింగ్ అంతా డ్రామా అని కవిత కొట్టి పారేయడం గమనార్హం. ఇదంతా తన తండ్రి కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు చేస్తున్న కుట్రగా ఆమె అభివర్ణించారు. ఈ మేరకు కవిత ట్విటర్ వేదికగా లేఖను విడుదల చేశారు. అందులో ఏముందో ప్రధాన అంశాల గురించి తెలుసుకుందాం.
“ఒక ఆర్థిక నేరగాడు, ఒక అనామక లేఖను విడుదల చేయడం, దాని వెంటనే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం, దాని తదనంతరమే ఎంపీ అరవింద్ బీజేపీ టూల్ కిట్‌లో భాగంగా పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో బురదజల్లే కార్యక్రమాన్ని ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నారు. అసలు సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో నాకు పరిచయం కూడా లేదు. అతనెవరో కూడా నాకు తెలియదు. కానీ వాస్తవాలను ఏవి పట్టించుకోకుండా, కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో, పనిగట్టుకొని తప్పుడు వార్తలు ప్రచురించాయి. క్రిమినల్ సుఖేష్‌ను పావుగా వాడుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ వారి కుటుంబ సభ్యులను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారు.
దున్నపోతు ఈనిందంటే దుడ్డెను కట్టేయమన్న చందంగా, అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు తయారైంది ప్రస్తుతం కొన్ని మీడియా సంస్థల తీరు. ఇది అత్యంత దురదృష్టకరం. పాత్రికేయులు కనీస విలువలు పాటించకపోవడం అత్యంత బాధాకరం. కేసీఆర్ మీద కక్షతో, అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలో ముందు వరుసలో నిలిపిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఈర్ష్యతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని తెలంగాణ సమాజం తప్పకుండా తరిమి కొడుతుంది. తెలంగాణ బిడ్డలం తలవంచం.. తెగించి కొట్లాడుతాం” అని కవిత పేర్కొన్నారు. ఈ లేఖలో సుఖేష్‌ను మాత్రం కవిత నేరస్తుడిగా నిర్ధారించారు.