వ‌లంటీర్ల‌పై భారం…వైసీపీ నేత‌లు రిలాక్ష్‌!

మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న‌న్న అంటూ వైసీపీ చేప‌ట్టిన కార్య‌క్ర‌మం మూడు రోజుల ముచ్చ‌టే. మొద‌టి, రెండో రోజు మాత్ర‌మే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లు చురుగ్గా పాల్గొన్నారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్…

మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న‌న్న అంటూ వైసీపీ చేప‌ట్టిన కార్య‌క్ర‌మం మూడు రోజుల ముచ్చ‌టే. మొద‌టి, రెండో రోజు మాత్ర‌మే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లు చురుగ్గా పాల్గొన్నారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ దృష్టిలో కార్య‌క్ర‌మం బాగా జ‌రుగుతోంద‌న్న క‌ల‌రింగ్ ఇచ్చారు. ఆ త‌ర్వాత రోజు నుంచి వైసీపీ నేత‌లు రిలాక్ష్ అవుతున్నారు.

అలాగ‌ని కార్య‌క్ర‌మం నిలిచిపోలేదు. ఇంటింటికి వెళ్లే బాధ్య‌త‌ను, భారాన్ని వ‌లంటీర్లు, గృహ‌సారథుల‌పై వేశారు. ఇంటింటికీ వారే వెళ్లి  కుటుంబ సభ్యుల‌తో మాట్లాడి, ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు రాబ‌డుతూ, వారేం చెప్పినా, జ‌గ‌న్‌ను మెప్పించేలా టిక్‌లు కొడుతున్నారు. ఈ కార్య‌క్ర‌మం మ‌మ అనిపించేలా సాగుతోంది. అక్క‌డ‌క్క‌డ మిన‌హాయిస్తే, రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ప్ర‌తి కుటుంబం ద‌గ్గ‌రికి వ‌లంటీర్లు, గృహ సార‌థులే వెళుతున్నారు.

ఎమ్మెల్యేలు ఎక్క‌డ‌ని కొన్ని చోట్ల ప్ర‌జ‌లు వారిని ప్ర‌శ్నిస్తున్నారు. త‌మ‌నే చేసుకుర‌మ్మ‌న్నార‌ని, మీ జ‌వాబులు చెప్పాల‌ని బ‌తిమ‌లాడుతున్నారు. కుటుంబ స‌భ్యుల అంగీకారంతో స్టిక్క‌ర్లు అతికిస్తున్నారు. చాలా వ‌ర‌కూ ఫ‌లానా పార్టీ అని ముద్ర‌ప‌డు తుంద‌నే భ‌యంతో స్టిక్క‌ర్ల‌ను అతికించొద్ద‌ని ప్ర‌జ‌లు అభ్య‌ర్థిస్తున్నారు. అయితే ల‌బ్ధి పొందుతున్న‌ప్పుడు స్టిక్క‌ర్లు వేయించు కోడానికి ఇబ్బంది ఏంట‌ని వ‌లంటీర్లు, గృహ‌సార‌థులు ప్ర‌శ్నిస్తున్నారు.

ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళితే, వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవడంతో పాటు లోపాల‌ను స‌రిద్దుకోవ‌చ్చ‌నేది ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అభిమ‌తం. అయితే జ‌గ‌న్ ల‌క్ష్యం మేర‌కు కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌లేద‌నే అభిప్రాయం ఉంది. ఇలాగైతే ప్ర‌జ‌ల‌కు అధికార పార్టీ నేత‌లు చేరువై, తిరిగి ఆశీస్సులు పొందేదెట్టా? కొత్త కార్య‌క్ర‌మం అమ‌లుపై వైసీపీ అధిష్టానం సీరియ‌స్‌గా దృష్టి సారించాల్సిన అవ‌స‌రం వుంది.