ఎమ్బీయస్: జనసేన ఓటింగు శాతం అనే వ్యాసంలో లెక్కలన్నీ కులాల బట్టి వేస్తూ వచ్చాం. ఎన్నికలలో కులప్రభావం లేదని అనలేము కానీ మొద్దంకెల బట్టి, శాతాల బట్టి అంచనాలు వేస్తే తప్పుతాయని నా ఉద్దేశం. కులాల్లో ఉపకులాలు, ఓటరు వయసు, ఆర్థికస్థితి, పార్టీపై అభిమానం, పాలన తీరుపై అభిప్రాయం, ప్రభుత్వం పట్ల అనుకూల లేదా వ్యతిరేక భావం, అభ్యర్థి యిమేజి – యిలాటి వేరే కారణాలను కూడా గణించాలి. అనేక నియోజకవర్గాల్లో ఒకే కులానికి చెందిన అభ్యర్థులు మూడు, నాలుగు పార్టీల నుంచి నిలబడతారు. ఒకరే గెలుస్తారు. ఎందుకు? తక్కిన కారణాలు కులం కంటె బలీయమైనవి కాబట్టి!
యుపిలో ఒకప్పుడు ముస్లిమ్-యాదవ్ కాంబినేషన్, బ్రాహ్మణ-దళిత కాంబినేషన్ అధికారాన్ని తెచ్చిపెట్టాయి. ఇటీవల బిజెపి కులాల్ని ఉపకులాలుగా విడగొట్టి, వాటిలో కొన్నిటిని ఆకర్షించి ఆ కాంబినేషన్ లెక్కలకు గండి కొట్టింది. ముస్లిములలో కూడా పేదవారైన పసమాదా ముస్లిములను చేరదీస్తోంది. కొత్తగా పశ్చిమ యుపిలో అగ్రవర్ణ ముస్లిములను దువ్వుతోంది. ఒకప్పుడు హిందువులుగా ఉన్న ముస్లిము రాజపుత్రులను, ముస్లిము జాట్లను, ముస్లిము గుజ్జార్లను, ముస్లిము త్యాగీలను మొత్తం సమీకరించి ‘స్నేహ్ మిలన్, ఏక్ దేశ్, ఏక్ డిఎన్ఏ సమ్మేళన్’ పేర ముజఫర్‌నగర్‌లో యీ నెలలో సభ పెట్టాలని చూసి 6 లక్షల మంది ఓటర్లను ఆకర్షిద్దామని చూస్తోంది. ఇలాటి డైనమిక్స్ అనేకం ఉండగా ఒక కులం వారందరూ గంపగుత్తగా ఒకే పార్టీకి వేస్తారని లెక్కలు వేయడమెలా?
ఆర్థికపరంగా సమాజంలో పెద్ద చీలిక ఉంటుంది. ఏ కులస్తులూ ఒకే ఆర్థిక స్థాయిలో ఉండరు. ఒకే కులంలో డబ్బున్నవారు ఒకరికి ఓటేస్తే, లేనివారు మరొకరికి వేయవచ్చు. అందుకే మూకుమ్మడిగా ఓట్లు ఎవరికీ పడవు. కొందరు విశ్లేషకులు దీన్ని లెక్కలోకి తీసుకోకుండా కులాల గణాంకాల బట్టి (అవీ కచ్చితంగా తెలియవు, ఊహిస్తారంతే) ఫలితాలు ఊహించి తప్పుతూంటారు. ఏదైనా వేవ్ ఉంటే తప్ప, అభ్యర్థి గుణగణాలు, పనితీరు తప్పకుండా ప్రభావం చూపుతుంది. పార్టీ అభిమానాలు చెప్పనే అక్కరలేదు. కొన్ని పార్టీలకు దశాబ్దాలుగా ఏర్పడిన ఓటు బ్యాంకు 30%కు చేరి ఎట్టి పరిస్థితుల్లోనూ, తప్పనిసరిగా ఉంటుంది. వృద్ధులు సాంప్రదాయిక పద్ధతుల్లో ఓటేస్తే, యువతరం కొత్త తరహా నాయకత్వాన్ని ఆహ్వానిస్తుంది. ఇలాటివన్నీ లెక్కేయాలంటే ఎన్నో కోణాల నుంచి పరామర్శించాలి. 2019లో వైసిపికి 40% కమ్మలు, 40% మంది బిసిలు వైసిపికి వేశారని సర్వేలు చెప్పినా, బిజెపికి కొన్ని రాష్ట్రాలలో 10% మంది ముస్లిములు వేశారన్నా యిలాటి కోణాలను వెతికి పట్టుకోవాలి.
అనేకమంది విశ్లేషకులు కాపు ఓటు, కమ్మ ఓటు, రెడ్డి ఓటు, బిసి ఓటు.. అంటూ వాటి దగ్గరే ఆగిపోతున్నారు. ప్రస్తుతం జగన్ సమాజాన్ని వర్గాల వారీగా కూడా విభజిస్తున్నాడని కూడా మనం గ్రహించి ఆ ఫ్యాక్టరునూ కూడా గణనలోకి తీసుకుని అంచనాలు వేయగలగాలి. గతంలో ఇందిర, తర్వాత ఎన్టీయార్ యిలాగే పేదవర్గాలను ఆకట్టుకుని ఓట్లు తెచ్చుకోగలిగారు. అన్ని కులాలలోని వెనకబడిన వర్గాలు వాళ్లకు ఓట్లేశారు. స్వతంత్ర పార్టీ ధనికుల, మహారాజాల పార్టీగా, జనసంఘ్ ధనిక, మధ్యతరగతి పార్టీగా పేరుబడి ఒక స్థాయికి మించి ముందుకు వెళ్లలేక పోయాయి. ప్రస్తుత బిజెపి తన విస్తరణ విధానాల్లో భాగంగా అనేక పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీలను కూడా మెప్పించ గలుగుతోంది.
అంతెందుకు యోగి ఆదిత్యనాథ్ ఎంతటి ముస్లిము వ్యతిరేకో అందరికీ తెలుసు. అయినా 2022 అసెంబ్లీ ఎన్నికలలో జనాభాలో 19% ఉన్న ముస్లిములు గతంలో కంటె 2% ఎక్కువగా 8% మంది బిజెపి కూటమికి ఓటేశారు. ఎందుకు? సంక్షేమ పథకాల ఫలితాలను అందించడంలో వాళ్ల పట్ల ఎటువంటి వివక్షత చూపనందుకు! జగన్ సంక్షేమ పథకాల లబ్ధిదారులకై ఒకటే మీట నొక్కుతున్నాడా, పార్టీల ప్రకారం, కులాల ప్రకారం వేరేవేరే మీటలు ఏర్పరుచుకుని అవి నొక్కుతున్నాడా అనే దానిపై వైసిపి ఆ వర్గాల్లో పాప్యులారిటీ సంపాదించిందా లేదా అనేది తెలుస్తుంది. పథకాలందుకున్న వారందరూ ప్రభుత్వానికే ఓట్లేస్తారని ఎవరూ చెప్పలేరు. మునుగోడులో లబ్ధిదారుల్లో 32% మంది మాత్రమే అలా వేశారు. కానీ అక్కడ అధికార పార్టీ అభ్యర్థి వీక్, ప్రతిపక్ష అభ్యర్థి మహా స్ట్రాంగ్ అని గుర్తు పెట్టుకోవాలి. తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ అన్ని నియోజకవర్గాల్లో అదే పరిస్థితి ఉంటుందని చెప్పలేం.
సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలకే నిధులను వెచ్చిస్తూ, ఉద్యోగి, వ్యాపార వర్గాలను ఉపేక్షిస్తున్న జగన్‌కు ఆ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందనడం ఖాయం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆ సూచన వచ్చింది. ఒక్కో స్థానంలో 2.50-3.00 లక్షల దాకా ఓటర్లుంటారు. వారిలో 75% మంది సంక్షేమ పథక గ్రహీతలై ఉండరు. వాళ్ల ద్వితీయ ప్రాధాన్యతా ఓట్లతో, వామపక్ష సంఘాల మద్దతుతో ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి మూడు సీట్లూ గెలిచింది. ఈ శాంపుల్ చిన్నదే అయినా ఉన్నత, ఎగువ మధ్యతరగతి, విద్యావంతుల వర్గాలలో వైసిపి పట్ల వ్యతిరేకత సూచిస్తోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడక పోవడం కారణంగా అర్బన్ ఓటరు కూడా వైసిపికి దూరమై ఉంటాడు.
ఈ లోటును పూడ్చుకోవడానికి జగన్ రూరల్ ఏరియాలను, దిగువ, మధ్యతరగతి, పేద వర్గాలను బాగా దువ్వుతున్నాడు. అయితే సంక్షేమ పథకాలొక్కటే గట్టెక్కించవని అనేక రాష్ట్రాలలో నిరూపితమైంది. నగదు బదిలీ పథకం ద్వారా యిచ్చేది మా సొమ్మేగా అనే భావంలో ఉన్న ఓటర్లు కేవలం సంక్షేమాలు చూసి ఓటేయటం లేదు. బాబు కూడా తన హయాంలో చాలానే యిచ్చారు. కానీ విన్నింగ్ మార్జిన్ రాక ఓడిపోయారు. అందుకని జగన్ యితర మార్గాల ద్వారా కూడా వారిని ఆకట్టుకోవడానికి చూస్తున్నాడు. ప్రభుత్వపరంగా విద్య, వైద్య రంగాల్లో మెరుగుదల కనబరచి, పరోక్షంగా వారికి ఖర్చు మిగిల్చి మెప్పిద్దామని చూస్తున్నాడు. ఇది అభిలషణీయమే. నగదు బదిలీ చేసి, ఓటర్లను బద్ధకస్తుల్ని చేసే బదులు, సమాజపరంగా అభివృద్ధి కనబరచి, ఆ ఫలాలు వారికి అందేట్లు చేయడం హర్షదాయకం. నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ స్కూళ్ల స్థాయి పెంచి ఎడ్మిషన్లు పెంచి, సామాన్యులపై విద్యాభ్యాసభారం తగ్గించినట్లే, చికిత్సాభారం కూడా తగ్గిస్తే అంతకంటె కావలసినది ఏముంది?
దిల్లీలోని మొహల్లా క్లినిక్‌లు ఆప్‌కు ఎంత రాజకీయ లబ్ధి తెచ్చాయో చూశాక అనేక ప్రభుత్వాలు అనుకరించాయి. ఈ నెలలో జగన్ ప్రారంభించిన ఫ్యామిలీ డాక్టరు పథకం అలాటిదే అనుకోవాలి. రాజకీయ కారణాలెలా ఉన్నా, సరిగ్గా అమలైతే యిది దివ్యమైన స్కీము. సమాజంలో ఫ్యామిలీ డాక్టరు కాన్సెప్ట్ కనుమరుగు కావడమే మన కష్టాలకు కారణం. మా చిన్నపుడు మా డాక్టరు గారికి మా కుటుంబచరిత్ర యావత్తు తెలుసు. మా శరీరతత్వాలేమిటో, ఏ మందు వేస్తే వికటిస్తుందో అన్నీ తెలుసు. దాన్ని బట్టి మందు వేయడమో, అక్కర్లేదులే, నాలుగు రోజులు లంఖణాలు చెయ్ అనడమో చేసేవారు. ఇప్పుడు అలాటివారు ఎవరూ లేరు. అందరూ స్పెషలిస్టులే.
తల తిరగడానికి అరడజను కారణాలుండవచ్చు. బిపి, చెవి, నరాలు.. యిలా! ఏ స్పెషలిస్టు దగ్గరకి వెళ్లాలో చెప్పవలసినది ప్రాథమిక పరీక్ష చేసే ఎంబిబిఎస్ డాక్టరు. కానీ అలాటాయన అందుబాటులో లేడు కాబట్టి, ఎవరి దగ్గరకు వెళ్లాలో మనకు మనమే నిర్ణయించేస్తున్నాం. వెళ్లాక ఆ స్పెషలిస్టులు కలికి కామాక్షి పాటలో లాగ ‘నేనెరుగ, నేనెరుగ, పక్కవాళ్లను అడుగు’ అంటున్నారు. ఈలోగా మనకు విసుగొస్తుంది, రోగతీవ్రత తగ్గుతుంది. ఉపేక్షిస్తాం. కొద్దికాలానికి అది బ్రహ్మరాక్షసై, మనను పీక్కు తింటుంది. మందులూ అంతే, మెడికల్ షాపు వాడే మన పాలిట ధన్వంతరి!
కరోనా రోజుల్లో భయపడి, ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోక రోగాలను ముదరపెట్టుకున్నాం. ఇప్పుడు కార్పోరేటు ఆసుపత్రుల్లో స్పెషలిస్టు కన్సల్టేషన్ ఫీజులు యిచ్చుకోలేక, గంటల తరబడి వెయిట్ చేయలేక, టెస్టుల ఖర్చుకి దడిసి నాలుగు చెప్తే రెండే చేయించుకుని, ఆరు మందులు రెండు వారాలకు రాస్తే, మూడు మందులు ఒక వారానికే కొని రోగం సగం తగ్గగానే మానేస్తున్నాం. ఈ విధంగా మన యిమ్యూనిటీని సర్వనాశనం చేసుకుని, ఈ రోజు విజృంభిస్తున్న వైరస్ల పాలన పడుతున్నాం. ఇవి మన ప్రాణాలను హరించటం లేదు కానీ, శల్యావశిష్టులను చేసి వదులుతున్నాయి.
పట్నాల్లో ఉన్నవారి సంగతే యిలా ఉంటే, ఓ మోస్తరు పట్టణాల్లో, పల్లెల్లో ఉన్నవాళ్ల సంగతేమిటి? వృద్ధుల సంగతి పట్టించుకునే వాడెవడు? బ్రెడ్ విన్నర్ ఆరోగ్యంగా ఉంటే చాలనుకునే మన సమాజంలో యిల్లాలి గోడు ఎవరూ వినరు. పిల్లల సంగతీ అంతే. వారిలో లోపాలను ఎవరూ గుర్తించరు. ఊళ్లో మెడికల్ క్యాంపు పెడితే, యింట్లో వాళ్లు తీసుకెళితే బయట పడాలంతే! ఓ పిల్లాడు కళ్లు చికిలించి చూస్తూంటే వాడు చిన్నప్పటి నుంచీ అంతే అని వదిలేస్తారు తప్ప కళ్లు చూపించాలనుకోరు. దొడ్డికాళ్లతో నడిస్తే వాళ్ల నాన్న పోలిక వచ్చిందంటారు తప్ప ఆర్థోపెడిక్ సమస్యేమో అనే కోణంలో ఆలోచించరు. ఆటిజం పొడసూపుతూంటే మందబుద్ధి అని తిట్టి వదిలేస్తారంతే. ఎవరైనా డాక్టరు యింటికే వస్తే యిలాటివి చూస్తూనే గమనించేస్తాడు. తొలిదశలోనే చికిత్స మొదలుపెడితే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడి, తనంతట తానే ఆర్థికంగా మెరుగు పరుచుకునే వ్యవస్థ ఏర్పడుతుంది. సామాజిక పరంగా భవిష్యత్తులో పెట్టవలసిన ఖర్చు ఆదా అవుతుంది.
మా చిన్నపుడు మలేరియా డిపార్టుమెంటు వాళ్లంటూ నెలనెలా వచ్చి ఇంట్లో ఎవరికైనా జ్వరం వచ్చిందా అని అడిగి, గోడ మీద పెన్సిల్‌తో పట్టీలు వేసి వెళ్లేవారు. ఇప్పుడవన్నీ పోయాయి. వైద్యం చాలా ప్రియమై పోయింది. మంచి వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన నాయకుణ్ని ప్రజలు మెచ్చుతున్నారు. 2019లో వైయస్ మళ్లీ నెగ్గడానికి ఆరోగ్యశ్రీయే ప్రధాన కారణమని చెప్పాలి. 2014-19లో చంద్రబాబు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు తప్పనిసరిగా హాజరయ్యేట్లా చూశారని, వాటి పనితీరు గణనీయంగా మెరుగు పరచారని విన్నాను. ఓడిపోతే ఓడిపోవచ్చు కానీ 39% ఓట్లు వచ్చాయంటే యిలాటి వాటి వలనే వచ్చాయనుకోవచ్చు.
ఇప్పుడీ స్కీములో మండలానికి రెండు పిఎచ్‌సిలు, ఒక్కోదానికి యిద్దరు డాక్టర్లు. ఒక డాక్టరు ఆసుపత్రిలో ఉంటే, మరొకాయన ఊళ్లు తిరుగుతూ, 2000 కుటుంబాలకు నెలలో రెండు సార్లు వైద్యసేవలు అందిస్తారట. స్కూళ్లు, అంగన్వాడి సెంటర్లు వెళతారు కాబట్టి పిల్లల్లో అనారోగ్యాన్ని గుర్తు పట్టే అవకాశం ఉంది. ఒకే డాక్టరు చూస్తూంటాడు కాబట్టి పేషంటు సంగతేమిటో తెలిసి, సరైన సూచనలు చేయగలుగుతాడు. మావో చైనాలో బేర్‌ఫుట్ డాక్టర్ల స్కీము పెట్టి విజయం సాధించినప్పుడు మన దగ్గరా దాని గురించి మాట్లాడారు తప్ప, అమల్లోకి రాలేదు. ఈ ఫ్యామిలీ డాక్టరు పథకం వినడానికి బాగానే ఉంది కానీ సరిపడా వైద్యులున్నారా అనే సందేహం వస్తోంది. డిగ్రీలున్న ఆయుర్వేద, హోమియో వైద్యులను కూడా యీ పథకంలో భాగం చేస్తే సమస్య కొంతవరకు పరిష్కరించవచ్చు.
బ్రెయిన్ డెడ్ వ్యాసంలో ప్రాథమిక చికిత్స, సిపిఆర్ లాటి వాటిల్లో కొంతమందికి తర్ఫీదు యిస్తే బాగుండునని రాశాను. వాలంటీరు వ్యవస్థ ఎలాగూ ఉంది. డాక్టరు ఆ ఊరు వచ్చినపుడు వీళ్లకి దానిలో తర్ఫీదు యిస్తే, గొప్ప మేలు జరుగుతుంది. సమయానికి ఆదుకున్న వాలంటీరుకు పేషంట్లు తృణమో, పణమో యివ్వకుండా ఉండరు. వాలంటీర్ల పథకం పెట్టినపుడు విమర్శలు వచ్చాయి. అయిదారు వేలకు అంత పని ఎవరు చేస్తారండి? అని. కానీ వాళ్లు వాలంటరీగా, స్వచ్ఛందంగానే ముందుకు వచ్చారు కదా. కరోనా రోజుల్లో అది బాగా ఉపయోగ పడింది. సమస్తం యింటికి తెచ్చిపెడుతున్న వాళ్లకు చేతిలో ఐదో, పదో పెడుతూండడం వలన కాబోలు వాలంటీర్లు రాజీనామా చేసిన వార్తలు రాలేదు.
ఫ్యామిలీ డాక్టరు పథకంపై ఎబిఎన్‌లో చర్చ వచ్చినపుడు గఫూర్ అనే సిపిఎం నాయకుడు పథకాన్ని ఒక విధంగా తప్పు పట్టారు. ఒక డాక్టరు ఆయనకు చెప్పారట, ‘ఇప్పటికే పిఎచ్‌సిలో ఓపీలో 300 మందిని చూస్తున్నాం, యిప్పుడు ఒక డాక్టర్‌ను ఊళ్ల మీద తిప్పితే మిగిలిన ఒక్క డాక్టరూ ఎలా నిభాయించగలడు?’ అని. మొదటగా 300 మంది వస్తున్నారంటే సంతోషం వేసింది. ఇదివరలో పేషంట్లు లేక అవన్నీ వెలతెలాపోయేవి అని వార్తలు చదివేవాణ్ని. ఇప్పుడు ప్రభుత్వవైద్యంపై నమ్మకం పెరిగిందని అర్థమై ఆనందించాను. ఇక అన్ని పిఎచ్సిలలోనూ అదే పరిస్థితా అనేది నాకు తెలియదు. ఒక డాక్టరు వెళ్లి గ్రామాల్లోనే రోగులను చూసేస్తూంటే మండలకేంద్రం దాకా వచ్చే పేషంట్లు తగ్గిపోతారు కదాన్న పాయింటు గఫూర్ గారికి ఎందుకు తట్టలేదో తెలియదు.
ప్రతీ పార్టీ సమాజంలో అన్ని వర్గాలూ తమకు సమానమేనంటూ, అందరికీ అన్నీ చేసేస్తామని చెపుతుంది కానీ ఆచరణలో అసాధ్యమని గుర్తించి, కొన్ని వర్గాలనే ఎక్కువ సమానంగా చూస్తుంది. ఆ క్రమంలో కొన్ని వర్గాలకు నష్టం కలిగి, వారు కష్టపెట్టుకుంటారు. ఎవరితో నెయ్యం పెట్టుకోవాలి, ఎవరితో కయ్యం పెట్టుకునా ఫర్వాలేదనుకోవాలి అనే విషయంలో ఒక్కో పార్టీ ఒక్కోలా ఆలోచిస్తుంది. ఉన్నత, మధ్య వర్గాలను ఆకట్టుకోవడం, నిలుపుకోవడం కష్టం. వాళ్లు గంపగుత్తగా ఓటేయరు. కుటుంబంలో అందరూ కలిసి ఒకే సినిమాకు వెళ్లరు. ఒకే టీవీ ఛానెల్ చూడరు. ఎవరికి వారికే స్వతంత్ర భావాలుంటాయి. పైగా చిన్న విషయాలకే అలుగుతారు. దిగువ వర్గాల్లో సంతృప్తి ఫ్యాక్టర్ ఎక్కువ. మూకుమ్మడిగా ఓటేసే అవకాశం ఉంది. అందుకని మధ్యతరగతికి జెల్ల కొట్టి, ఎంతసేపూ దిగువ వారి గురించే పార్టీలు ఆలోచిస్తాయి.
ఈ స్కీము విన్నాక ఒకందుకు మాత్రం నాకు సంతోషం వేసింది. సాధారణంగా ప్రభుత్వ పథకం అనగానే అన్ని పార్టీలు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బిసిల కోసం.. అంటూ అవే పాట పాడతాయి, తక్కినవాళ్లెవరూ మనుష్యులు కానట్లు! జగన్‌కు యీ జపం మరీ ఎక్కువ. ఈ స్కీములో ఆ కుటుంబాలనే చూస్తామని, లేదా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవాళ్లనే చూస్తామని అనకుండా, డాక్టరు అందర్నీ చూస్తారంటున్నారు. పేదలకైతే డయాగ్నస్టిక్స్‌లో రాయితీ యివ్వవచ్చు, అభ్యంతరం లేదు. కానీ వైద్యావసరం అన్ని వర్గాలకూ ఒకేలా ఉంది. ఆంధ్ర కేరళలా తయారైంది. సిటీలు లేవు. పట్టణాలు, గ్రామాలే ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం కాపాడగలిగితే, రోడ్లు సరిగ్గా లేక మంచి ఆసుపత్రికి సమయానికి చేరడం ఒక సవాలుగా మారుతున్న పరిస్థితుల్లో యింటి దగ్గరే వైద్యుడు లభిస్తే రాష్ట్రం బాగుపడినట్లే. సమాజం ఆరోగ్యం మెరుగుపడితే అంతకన్న కావలసినదేముంది?
చివరగా ఫ్యామిలీ డాక్టరు ఓట్లు తెచ్చిపెడతాడా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. 2019 ఎన్నికలకు కాస్త ముందుగా టిడిపి చేపట్టిన పసుపు-కుంకుమ, పెన్షన్ పెంపు అనే రెండిటి కారణంగా 5-6% ఎక్కువ ఓట్లు వచ్చాయి అని ఒక విశ్లేషకుడు చెప్పారు. ఆ అంచనాకు ఆధారమేమిటో నాకు తెలియదు కానీ, జెసి దివాకర రెడ్డి దగ్గర్నుంచి మహిళలను అవి చాలా ఆకట్టుకున్నాయి కాబట్టి, ఓటింగు సమయం దాటి పోయినా వేచి ఉండి ఓట్లేశారని చెప్పారు. ఫలితాలు వచ్చేవరకూ కూడా టిడిపిలో అందరూ అదే మాట చెప్పారు. చివరకు 23 సీట్లు మాత్రమే వచ్చాయన్నది నిజమే కానీ 39% ఓట్లు కూడా వచ్చాయి కదా. టిడిపి పాలనపై అనేక ఫిర్యాదులున్నా 39% రావడంలో యీ 5-6% వాటా కూడా ఉందేమో!
ఆ విధంగా చూస్తే యీ ఫ్యామిలీ డాక్టరు పథకం, సరిగ్గా అమలైతే, యిది అండర్లైన్ చేసుకోవాలి, వైసిపికి 2-3% ఓట్లు అదనంగా తెచ్చిపెట్టవచ్చని నా ఊహ. మహానగరమైన దిల్లీలోనే మొహల్లా క్లినిక్‌లు ఓట్లు తెచ్చిపెట్టినపుడు గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న ఆంధ్రలో గ్రామాల్లో ఆరోగ్యవసతి మెరుగుపడినప్పుడు అది ఓట్లగా మారకుండా ఉంటుందా? అనారోగ్యమనేది గతంలో వృద్ధుల సమస్యే అనుకునేవారు. ఇప్పుడది మధ్యవయసు నుంచే పట్టుకుంటోంది. అందువలన యీ పథకం వలన మేలు పొందేవాళ్ల శాతం చాలానే ఉంటుంది. వారిలో కొందరు ప్రభుత్వానికి అనుకూలంగా మారినా, స్వింగ్ బాగా వస్తుంది. ఒకవేళ అది రాజకీయంగా లబ్ధి చేకూర్చక పోయినా తర్వాత వచ్చే ప్రభుత్వం యీ పథకాన్ని కొనసాగించాలని అభిలషిస్తాను.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2023)