విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం లేదని, బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించడంపై బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విశాఖ ఉక్కును సొంతం చేసుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదిపింది. కారణాలేంటో తెలియదు కానీ, కేసీఆర్ సర్కార్ విశాఖపై వేసిన ముందడుగే, కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి కారణమైందనే సంకేతాలు వెల్లువెత్తుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ రాజకీయానికి ఇది తొలి విజయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోడానికి బీఆర్ఎస్ వేసిన ఎత్తులు ఫలించాయి. ఇదే సందర్భంలో ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలను ఆత్మరక్షణలో పడేశాయి. ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీకి కొమ్ము కాయడం వల్లే, ప్రైవేటీకరణను అడ్డుకోలేకపోయాయనే విమర్శ బలంగా వుంది.
తాజాగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకున్న ఘనత తమకే దక్కుతుందని బీఆర్ఎస్ నేతలు ఉత్సాహంగా చెబుతున్నారు. రాజకీయంగా తాజా పరిణామాలు బీఆర్ఎస్‌కు కలిసి వస్తాయనడంలో అతిశయోక్తి లేదు. బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ మరోసారి ఏపీ అధికార, ప్రతిపక్ష పార్టీలపై చెలరేగిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లోని రెండు రాజకీయ పార్టీలు నోర్మూసుకున్నాయని ధ్వజమెత్తారు. అధికార పక్షం, అలాగే ప్రతిపక్షం నోరు విప్పలేదని వైసీపీ, టీడీపీలపై విరుచుకుపడ్డారు.
రెండు పార్టీలు నోర్మూసుకున్నా బీఆర్ఎస్ పార్టీ పోరాడిందన్నారు. ప్రజలు, కార్మికులు పోరాడారన్నారు. అందుకే ఇవాళ కేంద్రం దిగొచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కును బలోపేతం చేస్తామని ప్రకటన చేయడం చాలా సంతోషకరమన్నారు. అయినా జాగ్రత్తగానే ఉంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే వుంటామన్నారు. ఏపీ ప్రజలకు, కార్మికులకు కేసీఆర్ నేతృత్వంలో గులాబీ జెండా అండగా వుంటుందని మంత్రి హరీష్‌రావు భరోసా ఇచ్చారు.