2024 ఎన్నికలలో బిజెపి కలిసి రాకపోయినా టిడిపి, జనసేన కలిసి పోటీ చేయడం తథ్యమని తోస్తోంది. బాబు జనసేనకు సీట్లెన్ని యిస్తారు, పవన్‌కు పదవేది ఆఫర్ చేస్తారు అన్నదానిపై క్లారిటీ రావడమే తరువాయి. ఆ టర్మ్‌స్ ఏ మాత్రం గౌరవప్రదంగా ఉన్నా పవన్ ఒప్పేసుకుంటారు. ఎన్నికలకు పది నెలల సమయం మాత్రమే ఉంది. చేతిలో అనేక సినిమాలున్నాయి. ఇప్పటికిప్పుడు పార్టీని 175 నియోజకవర్గాల్లోనూ బలోపేతం చేసి, అభ్యర్థులను వెతుక్కోవడం, వారందరి తరఫునా ప్రచారం చేయడం, ఖర్చులు చూసుకోవడం సాధ్యమయ్యే పని కాదు. అంత తీరికా లేదు, ఓపికా లేదు. టిడిపితో పొత్తు పెట్టుకుంటే ఆ గొడవలన్నీ అదే చూసుకుంటుంది. బిజెపి కలవదని తేటతెల్లమైన రోజున లెఫ్ట్ వచ్చి కూటమిలో చేరతానంటుంది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో వాళ్లతో బంధం పెట్టుకుని లాభపడిన బాబు సరేనంటారు. టిడిపి-జెఎస్-లెఫ్ట్ కూటమి ఏర్పడడం ఖాయమనిపిస్తోంది.
లెఫ్ట్ ప్రభావం తక్కువే కాబట్టి దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదు. టిడిపి, జనసేన కలిస్తే మాత్రం వైసిపికి ముప్పే అన్న ధోరణిలో చాలామంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు. జనసేనకు గతంలో 5.5% వస్తే యీసారి 12%, కొన్ని చోట్ల 15% కూడా ఓట్లు వచ్చేస్తాయని, దానికి టిడిపి 39.3% కలిస్తే వైసిపి 50% ని దాటిపోయి గెలిచేస్తారని అంటున్నారు. ఇది నాకు నమ్మబుద్ధిగా లేదు. వైసిపిని ఓడిస్తే ఓడించవచ్చేమో కానీ 50% దాటిపోతుందనేది అసాధ్యమని నా వాదన. నేను చెప్పే లాజిక్‌లో తప్పులుంటే మీరు చెప్పండి. ఈ శాతాల లెక్క చాలా ట్రిక్కీగా ఉంటుంది. సీట్ల సంఖ్యకూ దానికీ పొంతనుండదు. శాతాల ప్రకారం చూస్తే 2019లో టిడిపికి 69 సీట్లు రావాలి. రాలేదు కదా! ఓట్లు పడే చోట్ల భారీ మెజారిటీ వచ్చి, తక్కిన చోట వెనకబడితే సీట్లు రావు. అన్ని చోట్లా, యించుమించు ఒకేలా ఓట్లు పడితేనే, ఓట్లకూ, సీట్లకూ పొంతన ఉంటుంది.
ఎన్నికలంటే ప్యూర్ అరిథ్మెటిక్ కాదు, టూ ప్లస్ టూ, ఫోర్ కాదు. అయినా ఆలోచన మొదలుపెట్టడానికి అది ఒక ఆలంబన. అక్కణ్నుంచి అనేక అంశాలను లెక్కలోకి తీసుకుంటూ, మనం మార్పులు చేర్పులు చేసుకుంటూ పోవాలి. దీనిలో నేను కొన్ని శాతాలు ఊహిస్తూ పోయాను. మీ ప్రకారం ఆ అంకెల్లో మార్పులుండవచ్చు. ఫార్ములా కరక్టా కాదా అని చూస్తే చాలు. పై ఎనాలిసిస్‌లో జనసేన సీట్ల శాతం రెట్టింపుకి, యింకా పైకి అవుతుంది అనే వ్యాఖ్యే నాకు ఆసక్తికరం. జనసేన 2019లో 137 స్థానాల్లో పోటీ చేసి 17.37 లక్షల ఓట్లు తెచ్చుకుంది. ఇప్పుడు అన్ని స్థానాల్లో పోటీ చేయదు కదా! అప్పుడైతే ఒంటరిగా పోటీ చేసింది. ఇప్పుడు కూటమి భాగస్వామిగా 30 స్థానాల్లో పోటీ చేస్తుందని అనుకోవచ్చు. ఈ అంకె ఎలా వచ్చింది? టిడిపి ఆ మధ్య జనసేనకు 25 యిస్తే చాలనుకుందని, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ధీమా పెరిగి, 20తో సరిపెడదా మనుకుంటోందని వార్తలు వస్తున్నాయి.
2019లో ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా పోటీ చేసింది కాబట్టి, సొంత బలమెంతో అంచనా వచ్చింది. ఆ ప్రకారం టిడిపి ఓట్ల శాతంలో 14% జనసేనకు వచ్చింది. ఇప్పుడు కూటమిలో 5 స్థానాలు లెఫ్ట్‌కు యిచ్చారనుకుంటే 170 స్థానాలను పాత ఓట్ల శాతం ప్రకారమైతే 88-12 నిష్పత్తిలో పంచుకోవాలి. అంటే టిడిపికి 150, జనసేనకు 20. అబ్బే, 2019 నుంచి యిప్పటికి చాలా ఎదిగిపోయాం, పైగా మీరే మాకు ప్రేమలేఖలు రాశారు, 40యేనా యివ్వండి అని జనసేన పేచీ పెడితే చివరకు ఏ 30 దగ్గరో బేరం తెగవచ్చు. 2019లో 80% ఓటింగు జరిగి 3.13 కోట్ల మంది ఓటేశారు. ఈసారీ అలాగే ఉంటుందనుకుని, ఓటర్ల సంఖ్య పెరిగి 3.15 అనుకుంటే లెక్క వేయడం యీజీ.
నిపుణులు చెప్తున్నట్లు వీటిలో 12% జనసేనకు ఓట్లు వస్తాయని ఒప్పుకుంటే 37.80 లక్షల ఓట్లు రావాలి. ఐదేళ్ల క్రితం 17.37 లక్షల ఓట్లు వచ్చాయి కాబట్టి రెండు రెట్లకు మించి అన్నమాట. పైగా యీ 37.80 లక్షల ఓట్లు 30 స్థానాల్లోనే రావాలి. అంటే సగటున ఒక్కో స్థానంలో 1.26 లక్షల ఓట్లు. 2019లో గాజువాకలో పవన్‌కు వచ్చిన ఓట్లు 59 వేలు, భీమవరంలో 62 వేలు. సగటున ఒక్కో నియోజకవర్గంలో 1.80 లక్షల (3.15 బై 175) ఓట్లుంటాయి. వాటిలో 1.26 లక్షలంటే సగటున 70% జనసేనకే పడతాయన్నమాట. ఇదే జరిగితే పోటీ చేసిన 30 స్థానాల్లోనూ జనసేన గెలిచేయాలి. ఇదేమైనా నమ్మేట్లుగా ఉందా?
పోనీ 12 కాదు, 10% ఓట్లనుకుంటే 31.50 లక్షల ఓట్లు, సగటున నియోజకవర్గంలో లక్షకు పైగా ఓట్లు, అనగా మొత్తం ఓట్లలో 58% అన్నమాట. అలాగైనా అన్ని సీట్లూ గెలిచేస్తారు. ఇదీ నమ్మబుద్ధిగా లేదు. మనం సరాసరి తీసుకుని లెక్కలేస్తే యిలాగే ఉంటుంది. ఒక నియోజకవర్గంలో ఎక్కువ, మరో చోట తక్కువ వచ్చి సగటున వచ్చే శాతాన్ని చేరుకుంటాయి. అన్ని సీట్లూ గెలిచినా, గెలవకపోయినా జనసేనకు పోలైన ఓట్లలో 31.50 లక్షల ఓట్లు వస్తాయన్నా నమ్మడం కష్టం. 137 స్థానాల్లో పోటీ చేస్తే వచ్చినవి 17.37 లక్షలు (సగటున 13 వేలు)! ఇప్పుడు 30 స్థానాల్లో 31.50 లక్షలు (సగటున 1.05 లక్షలు) వస్తాయంటే నమ్మడం ఎలా? అంత ఎదిగిపోయిందా!? టిడిపితో పొత్తు కారణంగా లక్ష ఓట్లు వస్తాయి అనుకుంటే అప్పుడు టిడిపి ఓట్ల శాతం లోంచి ఆ భాగం తగ్గించాలి. జనసేన పోటీ చేయని 107 (137-30) స్థానాల్లోని జనసేన ఓట్లు యీసారి టిడిపికి పడతాయి అనుకుంటే, టిడిపికి ఆ మేరకు ఓట్ల శాతం పెరుగుతుంది.
ఇక్కడే కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. గతంలో వైసిపి, టిడిపి, జనసేనలకు కాకుండా తక్కినవారికి 5.2% ఓట్లు వచ్చాయి. ఈ సారి అది 10-12 శాతానికి పెరగవచ్చు అనిపిస్తోంది. ఎందువలన అంటే టిక్కెట్లు దక్కని వారు రెబెల్స్‌గా పోటీ చేసి కొన్ని ఓట్లు పట్టుకుపోతారు. స్వతంత్రులు కొన్ని పట్టుకుపోతారు. తిరుపతి ఉపయెన్నిక తరహాలో 2024 ఎన్నికలలో ఓట్ల కొనుగోలు పెద్దగా ఉండకుండా జగన్ ప్రయత్నిస్తున్నారన్న వార్త నిజమైతే సాధారణ నాయకులు కూడా స్వతంత్రులుగా నిలబడవచ్చు. టిడిపి, వైసిపి దొందుకు దొందే అనుకునేవాళ్లు వాళ్లకు వేయనూ వేయవచ్చు. భారాస ఎంతో కొంత ప్రభావం చూపవచ్చు. బిజెపి కూడా గతంలో కంటె ఎక్కువగా ఓట్లు తెచ్చుకోవచ్చు. వాళ్లు నాయకులను చేర్చుకోవడం మొదలుపెట్టారు. 2029 నాటికి ముఖ్య పోటీదారుగా ఉందామనుకుంటే 2024 నాటికి 5-6% ఓట్లయినా తెచ్చుకోవాలి కదా!
వీళ్లందరికీ కలిపి 12% వస్తాయనుకోవడంలో తప్పేమీ లేదనుకుంటా. మిగిలిన 88% ను టిడిపి కూటమి, వైసిపి పంచుకోవాలి. మీ అంచనా వేరేలా ఉంటే ఉండవచ్చు. వాదన ప్రారంభించడానికి నాందిగా గెలిచే పక్షానికి, ఓడే పక్షానికి మధ్య 3-5% ఓట్ల తేడా ఉంటుందనుకుందాం. ఇది రాష్ట్రమంతా ఒకేలా ఉండదు. 2019లో వైసిపికి వచ్చిన 50% రాష్ట్రమంతా ఒకే స్థాయిలో లేదు. పైన చెప్పినట్లు కొన్ని చోట్ల ఎక్కువ, మరి కొన్ని చోట్ల తక్కువ ఉంది. ఆ శాతంలో కూడా వైసిపి అనుకూల ఓటు కొంత, టిడిపి వ్యతిరేక ఓటు కొంత ఉంటుంది. అదే విధంగా టిడిపికి వచ్చిన ఓట్లలో కూడా వైసిపి వ్యతిరేక ఓటు, టిడిపి అనుకూల ఓటు కలిసి ఉంటాయి. నాలుగేళ్ల పాలన తర్వాత వైసిపి మూట కట్టుకున్న ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం తప్పకుండా ఉంటుంది. అందుకే గతంలో యిరు పక్షాల మధ్య ఉన్న 11% వ్యత్యాసం తగ్గి 3-5% ఔతుందనుకోవడం సమంజసం.
ప్రస్తుతానికి వైసిపికి ఓటమి తథ్యం అని చెప్పే పరిస్థితి లేదని నా ఉద్దేశం. 30-40 సీట్లు పోగొట్టుకుని 110-120 దగ్గర ఆగవచ్చేమో అనిపిస్తోంది. దాన్ని ఓట్ల శాతంగా తర్జుమా చేసి వైసిపికి 46%, టిడిపి కూటమికి 42% అనుకుందామా? అలా అనుకుంటే టిడిపి కూటమిలో జనసేనకే 10-12% వస్తుందంటే నమ్మబుద్ధి కావటం లేదు. టిడిపికి 37%, జనసేనకు 5% (30 సీట్లలోనే పోటీ చేస్తుందనుకున్నాం కాబట్టి) వస్తాయనుకోవడం సమంజసం. దీన్ని పూర్వపక్షం చేసే వాదనలు రెండున్నాయి. గతంలో కంటె జనసేన బలం పెరిగింది, రెండోది వైసిపి వ్యతిరేక ఓటు పెరిగింది. రెండో పాయింటు గురించి ‘‘ఫ్యామిలీ డాక్టరు ఓట్లు తెస్తాడా?’’ అనే వ్యాసంలో చర్చిస్తాను.
2019లో జనసేనకు 5.5% ఓట్లు వచ్చాయి. 2014లో అది పోటీ చేయలేదు కాబట్టి, 2019లో అది కొన్ని టిడిపి ఓట్లను, కొన్ని వైసిపి ఓట్లను లాక్కుని ఆ శాతం సంపాదించిందని భావించాలి. 2024 నాటికి దాని బలం పెరిగి, వైసిపి నుంచి ఓట్లు గుంజుకోగలిగినప్పుడే వారి కూటమికి లాభం. 2019లో టిడిపి నుంచి గుంజుకున్న ఓట్లు మళ్లీ దానికే అప్పగిస్తే కూటమికి అదనంగా ఒనగూడేది ఏమీ లేదు. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చాక, టిడిపి వర్గాలు జనసేన కారణంగా తాము 31 సీట్లలో ఓడిపోయామని, ఎందుకంటే వైసిపికి వచ్చిన ఆధిక్యత కంటె జనసేనకు ఓట్లు ఎక్కువ పడ్డాయని చెప్పుకున్నారు. అప్పుడే యీ కూటమి ఉండి ఉంటే టిడిపి 23 ప్లస్ జనసేన 1 ప్లస్ కూటమి లేకపోవడం చేత మిస్సయిన 31 – మొత్తం 57 సీట్లు వచ్చేవన్నమాట.
పైన నేను వైసిపికి 110-120 సీట్లు వస్తాయని రాశాను కాబట్టి యీసారి కూటమికి దాదాపు యిన్ని సీట్లు రావడానికి స్కోపుంది. 2019లో జనసేనకు వేసిన వాళ్లందరూ యీసారి టిడిపి అభ్యర్థులకూ తప్పకుండా ఓటేస్తారని, టిడిపికి ఓటేసిన వారందరూ జనసేన అభ్యర్థులకూ ఓటేస్తారని అనుకుని, దీనితో పాటు జనసేన వైసిపి నుంచి ఓట్లు గుంజుకో గలుగుతుందని అనుకుంటే ఈ 57కి మించి యీసారి సీట్లు రావాలి. జనసేనపై ఫోకస్ ఎందుకంటే విశ్లేషకులు జనసేన బలమే పెరిగిందని చెప్తున్నారు కాబట్టి! 2019లో పవన్ అభిమానులు ఆయనే సిఎం అని నమ్మారు. అయినా 30% స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు దక్కలేదు. ఐదే ఐదు స్థానాల్లో ప్రభావం చూపింది. మూడు చోట్ల ద్వితీయ స్థానంలో నిలిచింది. 75 స్థానాల్లో అభ్యర్థులకు 10 వేల ఓట్లు కూడా రాలేదు. కొన్ని చోట్ల 4వ, 5వ స్థానాలు దక్కాయి. కొన్ని చోట్ల కాంగ్రెసుకు, నోటాకు వచ్చిన ఓట్ల కంటె తక్కువ వచ్చాయి. ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. పార్టీ అధ్యక్షుడు రెండు చోట్ల ఓడారు.
ఎందుకలా అంటే అన్ని కులాలలోని పవన్ అభిమానులు ఓటేశారు తప్ప గణనీయమైన సంఖ్యలో కాపులు ఓటేయలేదనుకోవాలి. జనాభాలో కాపులు 15% ఉంటారనుకుంటే వారిలో 5% కంటె తక్కువ మంది పవన్‌కు ఓటేశారనుకోవాలి. 2009లో ప్రజారాజ్యం పోటీ చేసినప్పుడు ఆంధ్ర ప్రాంతంలో 16 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అన్ని కులాల నుంచి కలిపి దాదాపు 23-24% ఓట్లు వచ్చాయి. 2019లో పవన్‌కు అటువంటి ఆదరణ లభించలేదు. మూడింట రెండు వంతుల మంది కాపులు వైసిపికో, టిడిపికో వేశారు. కాపు కార్పోరేషన్ విషయంలో, ఆఖరి నిమిషంలో రిజర్వేషన్ విషయంలో బాబు వ్యవహారంతో అలిగిన కాపులు రిజర్వేషన్ యివ్వనని చెప్పినా జగన్‌ను 2019లో బాగా ఆదరించారని విశ్లేషకులు చెప్పారు. ఇప్పుడు కాపులందరూ వైసిపితో విసిగి పోయి దాన్ని వీడి, పూర్తిగా టిడిపి వైపో జనసేన వైపో వస్తేనే గణనీయమైన మార్పు వస్తుంది.
2019లో పవన్ సిఎం అవుతారన్న నమ్మకం లేక వాళ్లు అలా చెదిరిపోయారని అనుకుంటే, యిప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందా? పవన్‌ను సిఎం అభ్యర్థిగా ప్రకటిస్తే రావచ్చు. కానీ ఆ అవకాశం కనబడటం లేదు. పోనీ ఉప ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారా? అదేమంత పెద్ద పోస్టు కాదు. వైసిపి కాబినెట్‌లో 5 గురున్నారు. కూటమి అధికారంలోకి వస్తే ఏ పేరు పెట్టినా లోకేశ్‌దే ద్వితీయస్థానం ఉంటుందని నమ్మవచ్చు. గతంలో వైసిపికి ఓట్లేసిన కాపులు యీసారి పవన్ అభ్యర్థన మేరకు, బాబును మళ్లీ అందలం ఎక్కించడానికై కూటమికి ఓటేస్తారని నమ్మగలమా? నిజానికి పవన్‌కు కాపు ఐడెంటిటీ ఏమీ లేదు. ఆయన కాపులకు చేసినదీ లేదు. సినిమా రంగంలో ఆయన తన సహనటుల్లో కానీ, దర్శకుల్లో కానీ, నిర్మాతలలో కానీ కాపులకంటూ ప్రత్యేకంగా చేసినదేమీ లేదు. బయట కాపు యువతకు హాస్టళ్ల లాటి సేవా కార్యక్రమాలూ చేయలేదు. కాపు సమావేశాల్లో పాల్గొన్నదీ లేదు.
రాజకీయాల్లో కూడా ప్రశ్నిస్తా, మూడో ప్రత్యామ్నాయంగా వస్తానంటూ వచ్చారు తప్ప కులాన్ని బేస్ చేసుకుని రాజకీయాలు చేయలేదు. ఈ మధ్యే కులం గురించి మాట్లాడుతున్నారు. వైసిపిలో ఉండే కాపు ముఖ్యులను తిడుతున్నారు. అందువలన కాపులందరూ పవన్ వెంట ఉంటారని తీర్మానించడం కష్టం. ఆయనకు కాపు ఐడెంటిటీ పెరిగిన కొద్దీ టిడిపికి అండగా ఉన్న కమ్మ, బిసిలు ఎలా రియాక్టవుతారో ఊహించడం కష్టం. ఈ రెండు వర్గాలకూ కాపులతో పడదని ప్రతీతి. బిసిలు టిడిపితో చాలాకాలం ఉన్నారు. కానీ 2019లో వైసిపి వైపు పెద్ద సంఖ్యలో తిరిగారు. 40% మంది అని అప్పట్లో కొన్ని సర్వేలు రాశాయి. 2014లో కమ్మలు, జనసేన పట్ల సుముఖంగా ఉన్నారు కదా అంటే అప్పుడు పవన్ పదవులేమీ కోరుకోలేదు. ఇప్పుడు కోరుకుంటున్నారు. తనకు కాకపోయినా, తన అనుచరులకైనా ముఖ్య పదవులు యిమ్మనమని డిమాండు చేయవచ్చు.
బాబు పవన్‌కు ప్రాముఖ్యత యిస్తే కొందరు కమ్మలకు ఒళ్లు మండవచ్చు. కానీ వారికి ప్రత్యామ్నాయం ఏముంది? 2019లో 40% దాకా కమ్మలు వైసిపికి ఓటేశారట. జగన్ ప్రస్ఫుటంగా చూపుతున్న కమ్మ వ్యతిరేకత కారణంగా వారు దూరమై ఉంటారని ఊహించవచ్చు. అందువలన టిడిపి, వైసిపి వైఖరులు నచ్చని కమ్మలు కొందరు మధ్యలో బిజెపికి వేయవచ్చు. కాపులను భారాస చేరదీస్తోంది కాబట్టి బిజెపి కమ్మలను దువ్వుతుందేమో తెలియదు. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ స్పష్టత వస్తుంది. ఇప్పటిదాకా జనసేనలో భారీ కాదు కదా, ఓ మాదిరి చేరికలు కూడా లేవు. పవన్ రాజకీయాలను ఎంత సీరియస్‌గా తీసుకుంటున్నారనే దానిపై చాలా ఆధారపడుతుంది. ఆయన ఎడాపెడా సినిమాలు ఒప్పేసుకోవడం తప్పుడు సంకేతాన్ని పంపుతోంది. జనసేన అభ్యర్థుల ఎంపిక, ప్రచారనిర్వహణ యివన్నీ బాబుకి వదిలేస్తే, ఆయనపై ఆశలు పెట్టుకున్న కాపులు, అభిమానులు, యువత నిరాశ పడతారు.
ఇలాటి పరిస్థితుల్లో జనసేన బలపడిందని ఎలా అనుకోవాలో నాకు తెలియటం లేదు. అయితేగియితే ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా టిడిపి బలపడిందని అనుకోవచ్చు. ఎందుకంటే జగన్‌కు ప్రత్యామ్నాయం బాబు మాత్రమే. బాబును దింపి జగన్‌ను ఎక్కించినట్లుగా, జగన్‌ను దింపి బాబును ఎక్కిస్తారు జనాలు. మహా అయితే పవన్ కేటలిస్టు మాత్రమే. తెలుగు మీడియా ఆయన యిమేజి ఒక్కోసారి పెంచుతూ, మరోసారి తగ్గిస్తూ వస్తోంది. ఎప్పుడు పెంచుతుందో, ఎప్పుడు దింపుతుందో వేరే చెప్పనక్కర లేదు. ఈ విషయంలో పవన్ చేయగలిగినదేమీ లేదు. ఆయనకంటూ మీడియా లేదు. క్షేత్రస్థాయిలో కొన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు తప్ప, పార్టీ యంత్రాంగమూ లేదు, నాయకులూ లేరు. వైసిపికి తగ్గే ఓట్ల శాతం టిడిపికి వెళ్లి చేరతాయి. ఆ క్రమంలో టిడిపితో పొత్తు పెట్టుకోబోయే జనసేన అభ్యర్థికి కూడా చేరతాయి. అంతే తప్ప జనసేనకు విడిగా 12-15% ఓట్లు వస్తాయనకోవడం సబబు కాదని నా అభిప్రాయం. ఇక ప్రభుత్వ వ్యతిరేకత తగ్గించడానికి వైసిపి చేస్తున్న ప్రయత్నం గురించి ‘‘ఫ్యామిలీ డాక్టరు ఓట్లు తెస్తాడా?’’ అనే వ్యాసంలో ముచ్చటిస్తాను.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2023)