ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యంత బలీయమైన ముద్ర వేసిన నాయకుడు. స్వపక్షమైనా, విపక్షమైనా జగన్ కేంద్రంగానే రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి. జగన్ కేంద్రంగా జరుగుతున్న చర్చ, రచ్చ… గతంలో ఏ నాయకుడిపై లేదంటే అతిశయోక్తి కాదు. విపక్షాల విమర్శలు ఏవైనా జగన్ మాత్రం పట్టించుకోవడం లేదు. తాను అనుకున్నది చేసుకుంటూ పోతున్నారు. తన ఆలోచనల్ని వైసీపీ ప్రజాప్రతినిధుల ద్వారా అమలు చేస్తున్నారు.
జగన్ నమ్ముతున్న సిద్ధాంతం ఒక్కటే… జనాన్ని మనం నమ్ముకుంటే, వాళ్లు ఎప్పుడూ వమ్ము చేయరని. బహుశా జనంపై జగన్‌లో విపరీతమైన భరోసా కలగడానికి ప్రధాన కారణం… సుదీర్ఘ పాదయాత్రే. ఇందులో రెండో మాటకే చోటు లేదు. అందుకే జగన్ నిత్యం జనం నామ స్మరణ చేస్తుంటారు. తన నమ్మకం మీరే అని ప్రజలనుద్దేశించి జగన్ అనడం విన్నాం, చూశాం. కేవలం జగన్ మాటలకే పరిమితం కాలేదు.
ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచి తన ఎమ్మెల్యేలు, మంత్రులను అప్రమత్తం చేశారు. ‘గడపగడపకూ మన ప్రభుత్వం’, తాజాగా ‘మా నమ్మకం నువ్వే జగన్’ పేరుతో జనంలోకి ప్రజాప్రతినిధులను పంపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను జగన్‌కు ముందు, ఆ తర్వాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే తన రాజకీయ అనుభవమంత వయసు కూడా లేదని వెటకరించే చంద్రబాబు సైతం జగన్‌నే అనుసరించాల్సిన దయనీయ స్థితి.
జగన్ తన వాళ్లను జనంలోకి పంపడంతో చంద్రబాబు కూడా అదే పంథాలో పయనించాల్సి వస్తోంది. గతంలో ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు మాత్రమే రాజకీయ నాయకులు జనంలోకి వెళ్లేవారు. ఇప్పుడు ఆ పరిస్థితిని పూర్తిగా మార్చిన ఘనత జగన్‌కే దక్కింది. నిత్యంలో జనంలో ఉన్న వాళ్లకే సీట్లు అనే హెచ్చరికతో వైసీపీ ప్రజాప్రతినిధులు, నియోజక వర్గాల ఇన్‌చార్జ్‌లు తప్పని సరి పరిస్థితుల్లో ప్రజల వద్దకు వెళ్లాల్సి వచ్చింది. ప్రజల సమస్యల్ని, నిలదీతల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఇది మంచి పరిణామం. లోటుపాట్లను సరిదిద్దుకోడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది? జనం…జనం అంటూ జగన్ నిత్యం స్మరిస్తుండడం ప్రత్యర్థులకు మింగుడు పడడం లేదు. ఏపీ రాజకీయాల్లో జగన్ అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా అవతరించారంటే ఎవరూ కాదనలేని వాస్తవం. ఈ వాస్తవం విపక్షాలకు బాగా తెలుసు. అందుకే జగన్‌ను ఎదుర్కోవాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని తహతహలాడడం. ముఖ్యంగా ఈ దఫా అధికారంలోకి రాకపోతే… చరిత్ర కాలగర్భంలో టీడీపీ కలిసిపోతుందని చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నా, తాను నమ్ముకున్న జనం అండగా నిలుస్తారని జగన్ ధీమాగా ఉన్నారు. మళ్లీ మనదే అధికారం అనే భరోసాను పార్టీ నేతలు, శ్రేణుల్లో ఆయన నింపగలుగుతున్నారు. జనం నాడి తెలిసిన నాయకుడు కావడం వల్లే ఆయనలో ఆ నమ్మకం, విశ్వాసం. వయసులోనూ, రాజకీయ అనుభవంలోనూ జగన్ చిన్నవాడు. కానీ ప్రజల ఆలోచనల్ని, అవసరాలని గుర్తించడంలో జగన్ ఆరితేరారు. అదే జగన్ బలం, ప్రత్యర్థుల బలహీనత.