టాలీవుడ్ జనాలకు ఏఆర్ రెహ్మాన్ అనే వ్యక్తి ఓ ఫ్యాన్సీలా మారాడు. మరికొందరు మేకర్స్ కు ఇతగాడు ఓ బ్రహ్మపదార్థం. ఓ పెద్ద సినిమా ఎనౌన్స్ అయితే చాలు, మ్యూజిక్ డైరక్టర్ గా రెహ్మాన్ పేరు ముందుగా తెరపైకొస్తుంది. ఆ తర్వాత అంతే వేగంగా ఆ పేరు లిస్ట్ లోంచి మాయమైపోతుంది. కేవలం హైప్ కోసం రెహ్మాన్ పేరును ఇలా వాడుకొని వదిలేస్తున్నారా అనే అనుమానం కూడా కలుగుతుంది.
ఇప్పుడు తాజా మేటర్ ఏంటంటే.. రామ్ చరణ్ సినిమాకు రెహ్మాన్ సంగీతం అంట. బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు చరణ్. రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా రెహ్మాన్ ను తీసుకున్నారనే టాక్ నడుస్తోంది. ఈసారైనా రెహ్మాన్ రాక సాధ్యమా కాదా అనేది చూడాలి.
రెహ్మాన్ తో అంత ఈజీ కాదు..
రెహ్మాన్ తో వర్క్ చేయడం గొప్ప కావొచ్చు. కానీ రెహ్మాన్ తో వర్క్ చేయించుకోవడం చాలా కష్టం. స్వయంగా మణిరత్నం లాంటి దర్శకుడే రెహ్మాన్ తో చాలా కష్టపడ్డానని ఓపెన్ గా చెప్పడం దీనికి ఉదాహరణ. రెహ్మాన్ రాత్రిళ్లు పనిచేస్తారు. అతడితో పాటు వర్క్ చేయాల్సి ఉంటుంది.
ఇక ట్యూన్స్ విషయంలో రెగ్యులర్ మ్యూజిక్ డైరక్టర్స్ లా రెహ్మాన్ దగ్గర ఆప్షన్లు ఉండవు. ఒకటికి ఇంకో ట్యూన్ మాత్రమే అదనంగా వినిపిస్తాడని, వాటిలోంచి ఒకటి సెలక్ట్ చేసుకోవాలని మాత్రం చెబుతుంటాడట. ఇక రీ-రికార్డింగ్ లో ఎవరు వేలు పెట్టిన అస్సలు ఇష్టం ఉండదు. అది దర్శకుడు అయినా కూడా.
నెగెటివ్ సెంటిమెంట్ కూడా..
దీనికితోడు టాలీవుడ్ లో రెహ్మాన్ పై నెగెటివ్ సెంటిమెంట్ కూడా ఉంది. ఓ తెలుగు సినిమాకు రెహ్మాన్ సంగీతం అందిస్తే, పాటలు హిట్టవ్వొచ్చేమో కానీ, సినిమా హిట్టవ్వదనే రిమార్క్ బలంగా నాటుకుపోయింది. కేవలం ఈ సెంటిమెంట్ తోనే సైరా సినిమాకు రెహ్మాన్ ను వద్దనుకున్నారనే టాక్ కూడా అప్పట్లో నడిచింది.
మరి ఇన్ని సెంటిమెంట్లు, కండిషన్లు దాటుకొని చరణ్-బుచ్చిబాబు సినిమా కోసం రెహ్మాన్ ను తీసుకుంటే మాత్రం అది కచ్చితంగా ఓ రకమైన ఎఛీవ్ మెంట్ కిందకే వస్తుంది. అంతేకాదు, సిసలైన పాన్ ఇండియా మూవీ కూడా అనిపించుకుంటుంది.
సెప్టెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. ఈలోగా రెహ్మాన్ నిజంగానే ఈ ప్రాజెక్టులో ఉన్నాడా లేక ఎప్పట్లానే ఆయన పేరును హైప్ కోసం వాడుకున్నారా అనేది తేలిపోతుంది.