విశాఖ రాజధాని అవడం ఖాయమని ఎవరు నమ్మకపోయినా టాలీవుడ్ జీవులు మాత్రం గట్టిగానే నమ్ముతున్నారు. ఇప్పటికే విశాఖలో సినిమా సందడి బాగా ఉంది. దాన్ని మించి ఇపుడు హడావుడి కనిపిస్తోంది. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సక్సెస్ మీట్ ని రాజధాని ప్రతిపాదన తరువాతనే విశాఖలో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సినిమా యూనిట్ విశాఖ అంటే తమకు ప్రత్యేక అభిమానమని చెప్పుకుంది. వియ్ లవ్ విశాఖ అని నినదించింది.
దానికి ముందు జరిగిన విశాఖ ఉత్సవ్ లో మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖను సినీ రాజధాని చేస్తామని చెప్పుకొచ్చారు. ఆ ఉత్సవానికి హాజరైన సినీ పెద్దలు కూడా విశాఖ టాలీవుడ్ కి వెన్నుదన్ను అని మాట్లాడారు. మరో వైపు యాంకర్ రష్మీ గౌతమ్ తాను విశాఖవాసినేనని అంటూ, ఈ ప్రాంతం అభివ్రుధ్ధి చెందితే తన కంటే సంతోషించేవారు ఎవరూ ఎవరూ లేరంటోంది. ఆమె తాజా స్టేట్మెంట్స్ ఇపుడు చర్చగా మారుతున్నాయి.
విశాఖలో ఇప్పటికే సినిమావారికి భూములు ఉన్నాయి. దివంగత నిర్మాత డి. రామానాయుడు టీడీపీ ఎంపీగా ఉన్నపుడే ఆయనకు విశాఖలో స్టూడియో నిర్మాణానికి భూములను నాటి సీఎం చంద్రబాబు కేటాయించారు. అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా విశాఖను సినీ రాజధానిగా అభివ్రుద్ధి చేసేందుకు భూములను ఇచ్చాయి. ఇక ఆ మధ్య వరకూ టాలీవుడ్ హైదరాబాద్ లోనే ఉంటుందని అంతా భావించినా విశాఖ రాజధాని ప్రకటనతో మళ్ళీ సినీ సీమ చూపు ఈ వైపుగా పడిందని చెప్పాలి.
ఇక విశాఖ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ సైతం నిర్మాతగా సినిమాలు తీశారు. ఆయన సైతం సినిమా పరిశ్రమను విశాఖ తీసుకువస్తామని చెబుతున్నారు. రాజధానిగా విశాఖను చేస్తామని ప్రకటించించిన తరువాత సగటున ప్రతి నాలుగు రోజులకు ఒక సినీ ప్రముఖుడు విశాఖలో విడిది చేస్తున్నారు. ఈ ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు.
మరో వైపు సినీ రంగం ప్రముఖులు కొందరు రియల్టర్ల అవతారం కూడా ఎత్తేందుకు రెడీ అయిపోతున్నారు. భవిష్యత్తు బాగుంటుందన్న ఆశతో విశాఖ వైపు చూస్తున్నారు. వారిలో తెలుగు సినీ ప్రముఖ నటులు, వివిధ రంగాల సాంకేతిక నిపుణులు ఉండడం విశేషం. చూడాలి మరి ఈ జోరు ఎంతవరకూ వెళ్తుందో.