హీరోల మధ్య పోటీ ఉంటుంది. హీరోయిన్ల మధ్య పోటీ ఉంటుంది. కానీ బ్యానర్ల మధ్య పోటీ ఉండదు. డీవీవీ దానయ్య హిట్ సినిమా ఇచ్చాడని మైత్రీ నవీన్ ఫీల్ అవ్వడు. అలాగే అల్లు అరవింద్ హిట్టిచ్చాడని దిల్ రాజు ఫీల్ అవ్వడు. కానీ రాబోయే రోజుల్లో మాత్రం ఓ రెండు బ్యానర్ల మధ్య పోటీ కచ్చితంగా కనిపించేలా ఉంది. అదే గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్. ఒకటి చిరంజీవి కూతురు సుష్మిత కొణెదలది, మరొకటి నాగబాబు కూతురు నిహారిక కొణెదలది.
గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ గురించి చాలామందికి తెలిసిందే. చిరంజీవి కూతురు, అల్లుడు కలిసి స్థాపించిన నిర్మాణ సంస్థ ఇది. అనుభవం గడించడం కోసం ముందుగా వెబ్ సిరీస్ లు తీశారు. ఆ తర్వాత శ్రీదేవి శోభన్ బాబు అనే చిన్న సినిమా తీశారు. దీంతో ఇటు ఓటీటీపై, అటు థియేట్రికల్ సిస్టమ్ పై ఓ మోస్తరు అనుభవం గడించారు. ఈ అనుభవంతో మరిన్ని ప్రాజెక్టుల్ని లైనప్ చేసుకున్నారు. భవిష్యత్తులో మెగా హీరోలతో సినిమాలు చేయాలనేది సుష్మిత లక్ష్యం.
ఇటు నిహారిక కొణెదల కూడా ప్రొడక్షన్ పై అంతే సీరియస్ గా ఉంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్ ఈమెకు ఉంది. ఈమె కూడా షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ తీసింది. ఇప్పుడు తన బ్యానర్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లే ఆలోచనలో ఉంది. హైదరాబాద్ లో ఆఫీస్ కూడా తెరిచింది.
ఒకే టైమ్ లో మెగా డాటర్స్ ఇద్దరూ ప్రొడక్షన్ ఫీల్డ్ లో యాక్టివ్ అయ్యారు. ఎవరి లైనప్స్ తో వాళ్లు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గమ్మత్తయిన విషయం ఏంటంటే.. ప్రస్తుతానికి ఈ ఇద్దరు మహిళా నిర్మాతలు “మెగా సపోర్ట్” కోరుకోవడం లేదు. సొంతంగా తమ ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ రెండు బ్యానర్లలో ఏది క్లిక్ అవుతుందో చూడాలి.