సిట్టింగుల‌కు బీజేపీ షాకుల మీద షాకులు!

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల అభ్య‌ర్థుల‌ను మిగ‌తా పార్టీల‌తో పోలిస్తే చాలా ఆల‌స్యంగా విడుద‌ల చేస్తున్న క‌మ‌లం పార్టీ త‌న రెండో జాబితాలో కూడా సిట్టింగుల‌కు షాకులు ఇచ్చింది. తొలి జాబితాలో ఏకంగా యాభై మంది…

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల అభ్య‌ర్థుల‌ను మిగ‌తా పార్టీల‌తో పోలిస్తే చాలా ఆల‌స్యంగా విడుద‌ల చేస్తున్న క‌మ‌లం పార్టీ త‌న రెండో జాబితాలో కూడా సిట్టింగుల‌కు షాకులు ఇచ్చింది. తొలి జాబితాలో ఏకంగా యాభై మంది కొత్త ముఖాల‌ను బ‌రిలోకి దించుతూ బీజేపీ సంచ‌ల‌నం రేపింది. ఇక తాజాగా 23 మంది పేర్ల‌తో విడుద‌ల అయిన రెండో జాబితాతో కూడా ఏకంగా ఏడుమంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు బీజేపీ హైక‌మాండ్ ఝ‌ల‌క్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం!

క‌ర్ణాట‌క స్టీరింగును ఎప్పుడో త‌మ ఆధీనంలోకి తీసుకున్న క‌మ‌లం పార్టీ అధిష్టానం మాజీ సీఎంల‌ను కూడా పెద్ద ఖాత‌రు చేయ‌డం లేదు. ఈశ్వ‌ర‌ప్ప‌, జ‌గ‌దీష్ షెట్ట‌ర్ లాంటి వాళ్లకు కూడా ఈ సారి దిక్కులేకుండా పోయింది. య‌డియూర‌ప్ప త‌న‌యుడికి మాత్రం టికెట్ ద‌క్కింది. ఒక ఫ్యామిలీ ఒకే టికెట్ విధానంతో సొంత పార్టీ ఆశావ‌హుల‌ను నిరాశ ప‌రిచిన క‌మ‌లం పార్టీ ఏకంగా మూడో వంతు స్థానాల్లో కొత్త అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దింపుతూ పెను సంచ‌ల‌నానికే దారి తీసింది.

టికెట్ ద‌క్క‌ని తాజామాజీ ఎమ్మెల్యేలు నిప్పులు గ‌క్కుతున్నారు. కొంద‌రు పార్టీకి రాజీనామా అంటూ ప్ర‌క‌టిస్తూ ఉన్నారు. మ‌రి కొంద‌రు అధిష్టానాన్ని ప్ర‌స‌న్నం చేసుకునేందుకు పాట్లు పడుతున్నారు.  ఈశ్వ‌ర‌ప్ప‌, జ‌గ‌దీష్ షెట్ట‌ర్ లు అదే ప‌నిలో ఉన్న‌ట్టున్నారు. 

మ‌రి మూడో వంతు స్థానాల్లో కొత్త ముఖాల‌తో భార‌తీయ జ‌న‌తా పార్టీ చేస్తున్న ఈ ప్ర‌యోగం ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుంద‌నేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది. కేవ‌లం మోడీ పేరుతోనే ఎన్నిక‌లు అనే విష‌యాన్ని బీజేపీ అధిష్టానం పూర్తిగా విశ్వసిస్తోంది. 

ఎమ్మెల్యే ఎవ‌ర‌నేది అన‌వ‌స‌రం మోడీ మొహం చూసి ఓటు ప‌డుతుంద‌ని బీజేపీ లెక్క‌లాగుంది. మ‌రి ముఖ్య‌మంత్రి ఎవ‌ర‌నేది బీజేపీ ఎప్పుడో ప‌క్క‌న పెట్టేసింది. మ‌రి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవ‌ర‌నేది కూడా అన‌వ‌స‌రం అన్న‌ట్టుగా ఉంది వ్య‌వ‌హారం. ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌న్న స‌ర్వేల నేపథ్యంలో కూడా ఇలా ఏకంగా మూడో వంతు మంది కొత్త వారిని తెర‌పైకి తీసుకొచ్చిన‌ట్టుగా కూడా ఉన్నారు. మరి బీజేపీ అనుస‌రిస్తున్న ఈ రాజ‌కీయ వ్యూహం ఎలాంటి ఫ‌లితాల‌ను ఇస్తుందో!