కర్నూలు ప్రభుత్వాసుపత్రి డిప్యూటీ సూపరిండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఇప్పుడు కాదు.. కరోనా అల్లకల్లోలం సమయంలో కోవిడ్ గురించి ఆయన పెట్టే పోస్టులు, జాగ్రత్త చర్యలు, అతి తక్కువ ధర లో దొరికే మందుల కిట్.. వీటన్నింటితో ఆయనకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగింది. స్వతహాగా సర్జన్ అయిన ఈ సీనియర్ వైద్యుడు కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చేస్తున్న అరుదైన, కఠినమైన, సామాన్యుల ప్రాణాలను నిలబెట్టే సర్జరీల గురించి కూడా పోస్టులు పెడుతూ ఉంటారు.
వాస్తవానికి కర్నూలు ప్రభుత్వాసుపత్రి రాయలసీమ ప్రజలకే కాదు, ఇటు తెలంగాణ, అటు వైపు కర్ణాటక ప్రజలకు కూడా ఎంతో ఉపయుక్తమైన ఆసుపత్రి. ప్రైవేట్ వైద్యానికి వెళ్లలేని సామాన్య రాయలసీమ ప్రజలు కర్నూలు ప్రభుత్వాసుపత్రిని నమ్ముకుంటూ ఉంటారు. యాక్సిడెంట్ కేసులు, క్యాన్సర్లు, ట్యూమర్లతో బాధపడే వారు కర్నూలు ప్రభుత్వాసుపత్రికే చేరుతూ ఉంటారు. నమ్మకం సన్నగిల్లిన కేసులే ఎక్కువగా కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేరుతూ ఉంటాయి కూడా. అలాంటి చాలెంజింగ్ కేసులను డీల్ చేసే కర్నూలు ప్రభుత్వాసుపత్రి సామాన్య ప్రజలకు ఆశాదీపం.
మరి ప్రభుత్వాసుపత్రుల్లో పని చేయడానికి ఎంత మంది సర్జన్లు ఈ రోజుల్లో రెడీగా ఉన్నారు? బెంగళూరులోనో, హైదరాబాద్ లోనో.. మైనర్ సర్జరీ చేసినా ఒక్కో సర్జరీకి వైద్యుల చార్జ్ లక్ష రూపాయల పైనే! అపోలో, ఫోర్టిస్ వంటి ఖరీదైన ఆసుపత్రుల్లో ఇలాంటి సర్జరీలు రోజుకు పదుల, వందల సంఖ్యల్లో జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చేయి తిరిగిన సర్జన్లనకు ఉన్న గిరాకీ అంతా ఇంతా కాదు. ఇక సొంత ఆసుపత్రులు పెట్టుకుని, టీవీల్లో కనిపిస్తూ వందల కోట్ల రూపాయలు సంపాదించామని చెబుతున్న డాక్టర్లూ వార్తల్లో ఉండనే ఉన్నారు!
అనుభవం, నైపుణ్యం విషయంలో ధీటైన సర్జన్ అయిన ప్రభాకర్ రెడ్డి గురించి ఈనాడు పత్రిక వరస పెట్టి కథనాలు వండుతోంది. దీనికి కారణం ఏమిటంటే.. ఆయన జగన్ ను పొగుడుతున్నారట! ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సౌకర్యాలు మెరుగవుతున్నాయని, ప్రభుత్వ పాఠశాలలను జగన్ బాగు చేస్తున్నారని, సంక్షేమ పథకాలతో సామాన్యులకు అండగా నిలుస్తున్నారని ప్రభాకర్ రెడ్డి పోస్టులు పెడుతూ ఉన్నారు. ఇది ఈనాడుకు కంటగింపుగా మారింది. దీంతో ఆ వైద్యుడిపై వరస కథనాలు వండి వార్చడానికి ఈనాడు పత్రిక తన విలువైన ప్రింట్ ను ఖర్చు చేసుకుంటూ ఉంది.
తనపై వస్తున్న ఆ కథనాలను సదరు వైద్యుడు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. డిప్యూటీ సూపరింటెండ్ హోదాలోని ఆయన సూపరిండెంట్ పొజిషన్ కోసం ఆయన జగన్ ను పొగుడుతున్నారంటూ ఈనాడు ఆరోపిస్తోంది. ఆయనేమో తను జగన్ నే ప్రసన్నం చేసుకుంటే.. ఏ ఎమ్మెల్యే టికెట్టో, ఎమ్మెల్సీ నామినేషనో అడుగుతాను తప్ప.. డిప్యూటీ నుంచి ఒక హోదాను పెరగాలనుకుంటానా.. అంటూ ఈనాడు మార్కు వెర్రిబాగుల తనాన్ని ఎండగడుతున్నారు. 90ల నాటి తన మార్కు జర్నలిజాన్ని అనుసరిస్తూ తమకు నచ్చని వారిపై ఈనాడు బురద జల్లే ప్రయత్నాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉంది. ఆ డాక్టరేమో.. తను ఆసుపత్రిలో పని చేస్తే పేషెంట్లు హ్యాపీ, లేకపోతే ఫ్యామిలీ హ్యాపీ అంటూ ఈనాడును నీరుగారుస్తున్నారాయన!