విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్టు కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ ప్రకటించడం రాజకీయంగా సంచలనం రేకెత్తిస్తోంది. తమ దెబ్బతోనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ వ్యక్తుల చేతల్లోకి వెళ్లకుండా అడ్డుకున్న ఘనత బీఆర్ఎస్కు దక్కుతుందని ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.
విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు తాము వ్యతిరేకిస్తున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు కొన్ని రోజులుగా చెబుతున్నారు. అవసరమైతే తామే కొనుగోలు చేస్తామని కూడా వారు ప్రకటించారు. ఈ మేరకు బిడ్ వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపింది. బిడ్ వేసే క్రమంలో సింగరేణి అధికారులు విశాఖ ఉక్కు పరిశ్రమకు వచ్చి రెండు రోజులు పరిశీలించారు.
తెలంగాణలో బయ్యారం ఉక్కు పరిశ్రమ నెలకొల్పడం మాని, ఆంధ్రాలో రాజకీయాలు ఏంటంటూ ప్రత్యర్థులు విమర్శలకు దిగారు. అయినప్పటికీ బీఆర్ఎస్ వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో ప్రైవేటీకరణను తాత్కాలికంగా విరమించుకున్నట్టు సంబంధిత మంత్రి చెప్పడం… తమ విజయమే అని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఏపీలో బీఆర్ఎస్ రాజకీయానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
విశాఖ ఉక్కుపై గట్టిగా మాట్లాడింది తెలంగాణ సీఎం కేసీఆరే మాత్రమే అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తాము తెగించి కొట్లాడాం కాబట్టే విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు. కేసీఆర్ దెబ్బ అంటే అట్లా ఉంటదని కేటీఆర్ తేల్చి చెప్పారు. మొత్తానికి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గడం బీఆర్ఎస్ ఖాతాలోకే వెళ్లే అవకాశాలున్నాయి. దీన్ని అడ్డు పెట్టుకుని ఏపీలో బీఆర్ఎస్ ముందుకెళ్లడానికి ఒక ఆయుధం దొరికినట్టైంది.