అధికారిక ఆస్తుల్లో దేశంలోని ముఖ్యమంత్రుల్లో కెళ్లా అత్యంత ఆస్తిపరుడుగా నిలుస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) ఈ మేరకు దేశంలో సీఎంల ఆస్తిపాస్తులు, వారిపై గల కేసుల వివరాలను వెల్లడించింది. అధికారికంగా నమోదు చేసుకున్న ఆస్తుల ప్రకారం ఈ జాబితాలో జగన్ పేరు ముందు వరసలో ఉంది.
వారసత్వంగా, తను సంపాదించిన ఆస్తులతో జగన్ తొలిస్థానంలో నిలుస్తున్నారు. ఆయన మొత్తం ఆస్తి 510 కోట్ల రూపాయలుగా ఏడీఆర్ పేర్కొంది. చాలా సంవత్సరాల నుంచినే భారీ ఎత్తున ఇన్ కమ్ ట్యాక్స్ కట్టడం ద్వారా కూడా జగన్ వార్తల్లో నిలిచారు. పుష్కర కాలం కిందటే జగన్ అడ్వాన్స్ టాక్స్ చెల్లింపు అంశాన్ని కూడా వ్యతిరేక మీడియా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిపింది. టాక్స్ కట్టినా తప్పేనా.. అంటూ జగన్ వర్గం అప్పుడు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మరి అధికారిక ఆస్తుల్లో దేశంలో నంబర్ వన్ సీఎం జగన్ అని వార్తలు వస్తే టీడీపీ ఏ రేంజ్ లో రెచ్చిపోతుందో!
ఇక రెండో స్థానంలో నిలిచాడు బుల్లి రాష్ట్రం అరుణ్ చల్ ప్రదేశ్ సీఎం ప్రేమ ఖండూ. ఆయన అధికారిక ఆస్తులు సుమారు 163 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. ఇక రిచెస్ట్ సీఎంల జాబితాలో మూడో స్థానంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచారు. ఆయన ఆస్తులు అధికారికంగా సుమారు 63 కోట్ల రూపాయలు అని ఏడీఆర్ పేర్కొంది.
ఇక ఇదే జాబితాను కింది నుంచి చూస్తూ తొలి స్థానంలో నిలుస్తున్నారు మమతా బెనర్జీ. ఆమె ఆస్తులు కేవలం 15 లక్షల రూపాయలేనట! కేరళ సీఎం కింది నుంచి రెండో స్థానంలో నిలిచారు. పినరాయి విజయన్ ఆస్తులు సుమారు కోటి రూపాయలా ఇరవై లక్షలు. కింది నుంచి మూడో స్థానంలో నిలిచారు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్. ఆయన ఆస్తులు కోటిన్నర రూపాయలు అని ఏడీఆర్ వివరించింది.