మ‌రో ప‌ది ప‌న్నెండు రోజుల్లో పీక్స్ కు కోవిడ్ కేసులు!

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మ‌రో ప‌ది-ప‌న్నెండు రోజుల్లో ప‌తాక స్థాయికి చేరుతుంద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అంచ‌నా వేస్తోంది. కోవిడ్ ఈ వేవ్ లో మ‌రో ప‌న్నెండు రోజుల్లోనే ప‌తాక స్థాయికి…

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మ‌రో ప‌ది-ప‌న్నెండు రోజుల్లో ప‌తాక స్థాయికి చేరుతుంద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అంచ‌నా వేస్తోంది. కోవిడ్ ఈ వేవ్ లో మ‌రో ప‌న్నెండు రోజుల్లోనే ప‌తాక స్థాయికి చేరి, ఆ వెంట‌నే త‌గ్గుముఖ ప‌డుతుంద‌ని అంచ‌నాలు వేసింది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో క‌రోనా కేసుల సంఖ్య చెప్పుకోద‌గిన స్థాయిలో న‌మోదు అవుతూ ఉంది. 

దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ప్ర‌స్తుతం ఈ సంఖ్య 40 వేల‌ను దాటింది. ప్ర‌స్తుతం రోజువారీగా ఏడు వేల స్థాయిలో కేసులు న‌మోదవుతున్నాయి. ఈ సంఖ్య ప‌క్షం రోజుల వ్య‌వ‌ధిలో ప‌తాక స్థాయికి చేరుతుంద‌ని అంచ‌నా. ఒమిక్రాన్ వేరియెంట్ విప‌రీ స్థాయిలో వ్యాపించిన 2022 జ‌న‌వ‌రి స‌మ‌యం త‌ర్వాత ఇప్పుడే యాక్టివ్ కేసుల సంఖ్య 40 వేల స్థాయిని చేరింది. దాదాపు 15 నెల‌ల త‌ర్వాత యాక్టివ్ కేసుల సంఖ్య ఈ స్థాయికి చేరింది. గ‌త ఇర‌వై నాలుగు గంట‌ల్లో కోవిడ్ కార‌ణంగా 16 మంది మ‌ర‌ణించార‌ని ప్ర‌భుత్వ గ‌ణాంకాలు చెబుతూ ఉన్నాయి. 

రానున్న ప‌ది ప‌న్నెండు రోజులూ చాలా కీల‌కం అని, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు సూచిస్తూ ఉన్నాయి. మాస్కులు ధ‌రించ‌డం, జ‌న‌స‌మూహాల్లోకి వెళ్ల‌క‌పోవ‌డం మంచిద‌ని ప్ర‌భుత్వాలు సూచిస్తూ ఉన్నాయి. అయితే కోవిడ్ ప‌ట్ల ప్ర‌జ‌లేమీ అంత అప్ర‌మ‌త్తంగా లేరు. సిటీల్లో అక్క‌డ‌క్క‌డ  మాస్కులు ధ‌రించి క‌నిపిస్తూ ఉన్నారు కానీ, అంత‌కు మించి జాగ్ర‌త్త చ‌ర్య‌లేవీ లేవు. కేసుల సంఖ్య పెరుగుతున్న రీతిని బ‌ట్టి దీన్ని నాలుగో వేవ్ అనొచ్చేమో. 

క‌రోనా తొలి వేవ్ 2020 మార్చి నెల‌తో ఆరంభం అయ్యి సెప్టెంబ‌ర్ వ‌ర‌కూ ఇక్క‌ట్ల పాల్జేసింది. రెండో వేవ్ 2021 ఏప్రిల్ లో ప‌తాక స్థాయికి చేరి అల్లక‌ల్లోలం రేపింది. రెండో వేవ్ లోనే క‌రోనా అత్యంత తీవ్ర‌త‌ను న‌మోదు చేసింది. ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను తీసింది. ఇక 2021 డిసెంబ‌ర్-2022 జ‌న‌వ‌రి స‌మ‌యంలో మూడో వేవ్ భారీ సంఖ్య‌లో కేసుల‌ను న‌మోదు చేసింది. అయితే ఒమిక్రాన్ రూపంలో అప్పుడు తీవ్ర‌త త‌గ్గింది. ఇప్ప‌టి వ‌ర‌కూ దేశంలో క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించిన వారి సంఖ్య 5,31,016 అని కేంద్ర ప్ర‌భుత్వ అధికారిక గ‌ణాంకాలు చెబుతూ ఉన్నాయి!