చెరుకూరి సత్యన్నారాయణ అని మా బెజవాడలో ఒకాయన ఉండేవాడు. జై ఆంధ్ర సత్యం అని కూడా ఆయన్ని పిలుస్తూ ఉండేవారు. ఆర్చరీ అకాడమీ మొదలుపెట్టి ఎంతో మంది అర్చర్లను తయారు చేశారు.
ఆయన ఏదో సందర్భంలో రామోజీ రావు ఇంటిపేరు మా ఇంటి పేరు ఒకటే… బాగా దూరపు బంధువు అన్నాడు.
అంతే… కొన్ని రోజులకు ఆయనపై ఈనాడు సిటీ పేజీల్లో ఓ పెద్ద నెగిటివ్ స్టోరీ వచ్చింది. చందాలు వసూలు చేస్తున్నాడని భారీ ఆరోపణ.
అతను ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాడు. ప్రెస్స్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేశారు. అక్కణ్ణుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఢిల్లీ వెళ్ళి ప్రెస్స్ కౌన్సిల్ ఆఫీసులో వత్తిడి చేశాడు.
సరే, ప్రెస్ కౌన్సిల్ ఈనాడుకు ఓ నోటీసు తయారు చేసి ఆయనకు ఓ కాపీ ఇచ్చారు. అయినా ఏమీ జరగ లేదు. మళ్ళీ డిల్లీ వెళ్ళి వాకబు చేస్తే ఆ నోటీసు ఈనాడుకు వెళ్ళలేదు అని తేలింది. అతను మళ్ళీ వత్తిడి చేసి ఆ నోటీసు పోస్టు చేసేలా చేశాడు.
ఇలా చాలా తతంగం నడిచింది. నోటీసులు ప్రెస్ కౌన్సిల్ ఆఫీసు దాటి వెళ్ళేవి కాదు. కొన్ని నోటీసులు ఈనాడుకు వెళ్ళేవి కాదు. మరి కొన్ని ఆయనకూ అందేవి కావు. అలా మేనేజ్ చేసేవారు ఈనాడు వారు.
నాకు తెలిసి ఓ వంద సార్లు ఆయన ఢిల్లీ వెళ్ళి మొత్తానికి ఈనాడు స్టోరీ తప్పు అని నిరూపించాడు. తనపై తప్పుడు స్టోరీ రాసినందుకు క్షమాపణలు చెపుతూ అదే సిటీ పేజీల్లో వార్త వేయాలని పట్టుబట్టాడు. చాలా కాలం తర్వాత “చింతిస్తున్నాము” అంటూ ఓ చిన్న వార్త కనబడి, కనబడనట్టు వేశారు. అతను మళ్ళీ ఓ పదిసార్లు ఢిల్లీ ప్రెస్ కౌన్సిల్ ఆఫీసు చుట్టూ తిరిగాడు.
నా మీద తప్పుడు వార్త మొదటి పేజీలో వేసి, చింతిస్తున్నాము అనే ముక్క లోపలి పేజీల్లో వేస్తే పోయిన నా పరువు వస్తుందా అంటూ వాపోయాడు.
“బాబూ… ఈ మాత్రం చింతిస్తున్నాము అనే ముక్క అయినా వచ్చింది. అదే సంతోషం. ఇంతకు మించి ఈనాడు వాళ్ళతో ఇంకేమీ చేయించలేం” అని ప్రెస్ కౌన్సిల్ అధికారులు చెప్పారట.
అట్టుంటది ఈనాడు తో… నిలువెత్తు బురద చల్లి చివరికి ఓ చెంచాడు నీళ్ళతో కడుక్కోమంటారు.
మా బెజవాడలోనే “ఆసుల రంగనాయకులు” అని స్లమ్ ప్రజల ప్రతినిధి ఉండేవాడు. ఇప్పుడు కమ్యునిస్టు పార్టీలో ఉన్నాడు. అతనిపై కూడా ఓ పెద్ద వార్త… “సైకిల్ పై తిరుగుతూ లక్షల్లో సంపాదన” లాంటి శీర్షిక ఏదో పెట్టి పెద్ద వార్త… పరువు పోయి సిగ్గుతో చచ్చాడు పాపం.
ఢిల్లీ వెళ్ళలేక పోయాడు. ప్రెస్ కౌన్సిల్ అధికారులను ఈనాడుకు మించి ప్రభావితం చేయలేక పోయాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా భారీ కుట్రలు ఉన్నాయి…
Facebook post by D Gopi