అమెజాన్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఎక్కడ..హైదరాబాద్ ఎక్కడ. సడెన్ గా ఇక్కడ ప్రత్యక్షం కావడం ఏమిటి? అది కూడా ఎన్టీఆర్ పార్టీ ఇవ్వడం, దానికి టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు కొందరు హాజరు కావడం ఇదంతా కాస్త ఆసక్తికరమే. పైగా ఇది ముందుగా ఎక్కడా బయటకు రాలేదు. ఆహ్వానాలు అందుకున్నవారు రాత్రి పది గంటల వేళకు వెళ్లారు. కొందరు కొంత సేపు వున్నారు. కొందరు అర్థరాత్రి రెండు దాటే వరకు వున్నారు. అసలు దీని వెనుక ఏం జరిగింది?
ఆర్ఆర్ఆర్ హడావుడి మీద అమెరికాలో జరిగిన ఓ గ్రీట్ మీట్ లో ఎన్టీఆర్ కు అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్ కు పరిచయం అయింది. త్వరలో ఇండియా వస్తున్నా అని, అక్కడ కలుద్దామని ఆయన కాజువల్ గా అన్నారు. అన్నట్లుగానే ఈవారం ముంబాయి వచ్చి బాలీవుడ్ ప్రముఖులతో గెట్ టు గెదర్ పెట్టుకున్నారు. అప్పుడే ఎన్టీఆర్ కు కాల్ చేసి ఆహ్వానించారు.
అయితే ఎన్టీఆర్ ఆయననే హైదరాబాద్ రమ్మని పిలిచారు. తాను మంచి పార్టీ హోస్ట్ చేసి, ఇండస్ట్రీ ప్రముఖులను పిలుస్తానని, జేమ్స్ ను అందులో పాల్గొనమని ఆహ్వానించారు. దాంతో జేమ్స్ ముంబాయి నుంచి హైదరాబాద్ కు వచ్చారు. అదీ సంగతి.
ఈ పార్టీకి హీరోలను పిలవలేదు. కొందరు దర్శకులను, నిర్మాతలను మాత్రం పిలిచారు. సుకుమార్ విశాఖలో వుండడం వల్ల రాలేదు. మిగిలిన వారంతా వచ్చారు. హీరోలు ఎవ్వరినీ పిలవలేదు కానీ ఎన్టీఆర్ కు జిగినీ దోస్త్ కదా రామ్ చరణ్ ను కూడా అదే కోటాలో దూరం పెట్టడం కాస్త ఆశ్చర్యమే.