రాజ్ భవన్.. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా?

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు తొలి గవర్నర్ నరసింహన్. ప్రస్తుత గవర్నర్ తమిళి సై సౌందరరాజన్. ఈ ఇద్దరి టైమ్ లో ఒకరే ముఖ్యమంత్రి. ఆయనే కేసీఆర్. కానీ ప్రవర్తనలో మాత్రం స్పష్టమైన తేడా.…

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు తొలి గవర్నర్ నరసింహన్. ప్రస్తుత గవర్నర్ తమిళి సై సౌందరరాజన్. ఈ ఇద్దరి టైమ్ లో ఒకరే ముఖ్యమంత్రి. ఆయనే కేసీఆర్. కానీ ప్రవర్తనలో మాత్రం స్పష్టమైన తేడా. నరసింహన్ ఉన్నప్పుడు కేసీఆర్ అభిమానానికి అంతే లేదు. ప్రతి చిన్న విషయానికి రాజ్ భవన్ వెళ్లేవారు. గవర్నర్ తో నిత్యం సంప్రదింపులే. కుటుంబ సమేతంగా వెళ్లి నరసింహన్ ను పలకరించి, భోజనాలు చేసి వచ్చేవారు. 

తెలంగాణ ఆలయాలకు కూడా గవర్నర్ వెంట వెళ్లేవారు కేసీఆర్. బహుమతులు అందించేవారు. కానీ ఇప్పుడు తమిళి సై విషయంలో పూర్తిగా రివర్స్. గవర్నర్ ను కేసీఆర్ అస్సలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య గ్యాప్ ఉందనే విషయం గతేడాది కరోనా టైమ్ లోనే బయటపడింది. ఇప్పుడు మరోసారి అది స్పష్టమైంది.

రిపబ్లిక్ డే వేడుకలకు గవర్నర్, సీఎం కలుసుకోలేదు. ఆనవాయితీ ప్రకారం కేసీఆర్, రాజ్ భవన్ కు వెళ్లలేదు. అటు గవర్నర్ కూడా ఆనవాయితీ పక్కనపెట్టారు. తన ప్రసంగంలో తెలంగాణ సంక్షేమ పథకాల్ని ప్రస్తావించలేదు. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా అంటూ ఫొటోలతో సహా చర్చించుకుంటున్నారు నెటిజన్లు.

రాజ్ భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు డుమ్మా కొట్టిన కేసీఆర్, తన క్యాంప్ ఆఫీస్ లో జెండా ఎగురవేశారు. సహజంగా రిపబ్లిక్ డే రోజు గవర్నర్ ఆధ్వర్యంలో వేడుక జరుగుతుంది, దానికి సీఎం కచ్చితంగా వెళ్తారు. కానీ ఈసారి ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టారు కేసీఆర్.

తమిళిసై పక్కా బీజేపీ వాది. ఆమె రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా కూడా బీజేపీ అభిమానం అప్పుడప్పుడూ బయటపడుతుంటుంది. ప్రస్తుతం కేసీఆర్ బీజేపీపై కత్తులు దూస్తున్నారు. పదే పదే ప్రధాని మోదీ సహా.. ఇతర కేంద్ర పెద్దలకు చాకిరేవు పెడుతున్నారు. తనతో పాటు తన మంత్రులతో కూడా తిట్టిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య వ్యవహారం ఉప్పు నిప్పులా ఉంది. 

తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళిసై.. కరోనా టైమ్ లో కేసుల సంఖ్య పెరగడంపై ఓ దశలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారుల్ని నేరుగా రాజ్ భవన్ కి పిలిపించుకుని సమీక్ష నిర్వహించారు. అప్పట్లో ప్రభుత్వంతో మొదలైన ఆ ఆధిపత్య పోరు తర్వాత కూడా కొనసాగుతోంది. కౌశిక్ రెడ్డి వ్యవహారంతో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య చీలిక స్పష్టంగా కనిపించింది.

గవర్నర్ ని ఆహ్వానించాల్సిన ఏ సందర్భంలోనూ కేసీఆర్ ఆ పని చేయలేదు. తీరా ఇప్పుడు అసలు రాజ్ భవన్ కే వెళ్లకుండా సరిపెట్టారు, అది కూడా రిపబ్లిక్ డే వేడుక వంటి కీలక కార్యక్రమానికి కేసీఆర్ వెళ్లలేదు. దీంతో వారిద్దరి మధ్య సఖ్యత లేదని తేలిపోయింది. ప్రతిపక్షాలు మాత్రం ఈ వ్యవహారశైలిని తప్పుబడుతున్నాయి. రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిందేనని కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఆ మధ్య మహారాష్ట్రలో ఇలాగే గవర్నర్ కి సీఎం కి మధ్య విభేదాలొచ్చాయి, పశ్చిమబెంగాల్ లో ఏకంగా మాటల తూటాలు భారీగా పేలాయి, ఇటీవల తమిళనాడులో కూడా గవర్నర్ అధికారాలకి కత్తెర వేస్తూ యూనివర్శిటీలపై స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు అలాంటి ఉదాహరణలు లేవు. ఇప్పుడు తొలిసారిగా గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ కి మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.