అనుకున్నంతా అయింది, ఉద్యోగులు ఫిబ్రవరి 6 అర్థరాత్రి నుంచి సమ్మెకు వెళ్తామన్నా.. ఇప్పటికే ఉద్యోగులు విధులకు సున్నా చుట్టారు, నిరసనల పేరుతో రోడ్లెక్కేశారు. ఈరోజు నుంచి మరిన్ని దీక్షలు చేయబోతున్నారు. అయితే ఉద్యోగుల జీతభత్యాలపై తర్జన భర్జన కొనసాగుతోంది. ఈపాటికే బిల్లులు ప్రాసెస్ కావాల్సి ఉన్నా.. కొత్త పీఆర్సీయా, పాత పీఆర్సీయా అనే దగ్గరే పీటముడి పడుతోంది. కానీ ఆర్థిక శాఖ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది.
జీతాలు కొత్త పీఆర్సీ ప్రకారమే ప్రాసెస్ చేయాలని సచివాలయ శాఖాధిపతులకు, ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలకు సర్క్యులర్ పంపించింది. అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలంది. తాజాగా ఇచ్చిన ఈ ఆదేశాలను ఉద్యోగులు లెక్క చేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.
ట్రెజరీ ఉద్యోగుల్లో టెన్షన్..
సాధారణంగా నెలాఖరు వచ్చేసరికి ట్రెజరీ ఉద్యోగుల పని పీక్ స్టేజ్ కి వెళ్లిపోతుంది. నెలంతా పని తక్కువగా ఉన్నా.. జీతాల బిల్లుల సమయంలో మాత్రం పని ఒత్తిడి పెరుగుతుంది. ఈసారి అది వంద రెట్లు పెరిగిపోయింది.
కొత్త పీఆర్సీయా, పాత పీఆర్సీయా అనే లెక్కలో ట్రెజరీ ఉద్యోగులు సతమతం అవుతున్నారు. తమపై ఒత్తిడి తెస్తే కుదరదని ఈపాటికే ఉద్యోగులు తేల్చి చెప్పినా ఆర్థిక శాఖ తాజా ఆదేశాలతో వారిలో మరోసారి టెన్షన్ మొదలైంది.
నోటీస్ పీరియడ్ లో పనిచేయకపోతే ఎలా..?
ఉద్యోగులు ఇచ్చిన సమ్మె నోటీస్ ప్రకారం కచ్చితంగా ఫిబ్రవరి 6 అర్థరాత్రి వరకు పనిచేయాల్సిందే. మిగతా ఉద్యోగుల సంగతి పర్వాలేదు కానీ, ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ ఉద్యోగులే ఇప్పుడు తిప్పలు పడుతున్నారు. పోనీ కొత్త పీఆర్సీ ప్రకారమే బిల్లులు పెట్టి ఈ గండం గట్టెక్కుదామనుకుంటే.. తాము చేస్తున్న ఉద్యమానికి ద్రోహం చేసినట్టే లెక్క. మిగతా ఉద్యోగులంతా విరుచుకుపడిపోతారు. దీంతో ట్రెజరీ ఉద్యోగులు అడకత్తెరలో పోకచక్కలా మారారు.
మరోవైపు ఆర్థిక శాఖ మాత్రం కొత్త పీఆర్సీయే అమలు చేయాలంటూ మరోసారి సర్క్యులర్ పంపించింది. జీవోలను ధిక్కరించినా, బిల్లులు ప్రాసెస్ చేయకపోయినా.. కఠిన చర్యలు తీసుకోవాలని శాఖాధిపతులకు ఆదేశాలిచ్చారు. దీంతో ఈ వివాదం మరో కొత్త మలుపు తిరిగింది.