సిక్కోలు వారి డిమాండ్ చూశారా… ?

ఏపీ సర్కార్ సాహసోపేతంగా కొత్త జిల్లాలను ప్రకటించింది. అభ్యంతరాలకు, సలహా సూచనలకు నెల రోజుల పాటు టైమ్ ఇచ్చింది. అయితే ఒక విధంగా తేనె తుట్టెను కదిలించిందా అంటే అవును అనే జవాబు వస్తోంది.…

ఏపీ సర్కార్ సాహసోపేతంగా కొత్త జిల్లాలను ప్రకటించింది. అభ్యంతరాలకు, సలహా సూచనలకు నెల రోజుల పాటు టైమ్ ఇచ్చింది. అయితే ఒక విధంగా తేనె తుట్టెను కదిలించిందా అంటే అవును అనే జవాబు వస్తోంది. గతంలో ఉన్న జిల్లాలకు పేర్లు యధాతధంగా ఉంది. కొత్తగా జిల్లాలుగా చేసిన వాటిలో కొన్నింటికే పేర్లు కొత్తవి పెట్టారు.

అయితే ఈ పేర్లతోనే ఇపుడు సరికొత్త పంచాయతీ వస్తోంది. ప్రతీ ప్రాంతంలో ప్రముఖులు ఉన్నారు. అలాగే చారిత్రాత్మక అంశాలు కూడా ఎన్నో ఉన్నాయి. దాంతో ఇపుడు వాటిని ముందుకు తెచ్చి ఆయా పేర్లు పెట్టాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి.

ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లా 1950లో ఏర్పాటు అయింది. అయితే శ్రీకాకుళం నుంచి ఇపుడు కొన్ని ప్రాంతాలను వేరు చేసి మన్యం జిల్లాలో కలుపుతున్నారు. రాజాం ని తీసుకెళ్ళి విజయన‌గరం జిల్లాలో విలీనం చేస్తున్నారు. ఇది తప్ప మిగిలిన శ్రీకాకుళం జిల్లా అలాగే ఉంది. 

అయితే ఇపుడు సిక్కోలు జిల్లా వాసుల నుంచి కొత్త డిమాండ్ వస్తోంది. ఇదే జిల్లాకు చెందిన బీసీ నేత, స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న పేరును ఈ జిల్లాకు జోడించాలని కోరుతున్నారు. ఈ విషయంలో ఉద్యమిస్తామని కూడా బీసీ సంఘాలు చెబుతున్నాయి.

మరో ముచ్చట చూస్తే విజయనగరం జిల్లా 1979లో ఏర్పాటు అయింది. నాడు దానికి పూసపాటి వంశీకుల గౌరవార్ధం వారి పేరు పెట్టాలని అనుకున్నారు. ఏ కారణం చేతనో అది వీలు పడలేదు, మరిపుడు ఆ డిమాండ్ కూడా తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అలాగే మన్యం పేరుతో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాను పార్వతీపురం పేరిట జిల్లాగా ఉంచాలని కోరుతున్నారు. అది వీలు కాకపోతే గిరిజన ప్రముఖుడి పేరు పెట్టాలని అంటున్నారు. ఇదే తీరున అనకాపల్లి విషయంలో కూడా స్థానిక ప్రముఖుల పేర్లు, చారిత్రాక అంశాలు తెర ముందుకు వస్తున్నాయి. మరి ప్రభుత్వానికి వచ్చే ఈ సలహా సూచనలలో ఎన్ని నెరవేరుతాయో చూడాలి.