జర్నలిజం ముసుగులో రామోజీరావు చేసే అరాచకం గురించి కథలుకథలుగా చెప్పుకుంటుంటారు. గిట్టని పాలక, ప్రతిపక్ష నేతలపై ఇష్టానుసారం కథనాలు రాస్తుంటారనే విమర్శ వుంటుంది. ఇదే తాను ఇష్టపడే పాలకుల అక్రమాల గురించి కనీసం ఒక్క వాక్యం కూడా రాయకుండా, మరుగున పడేయడంలో రామోజీరావు తర్వాతే ఎవరైనా, ఏమైనా అనే వాదన వుంది. ఇందుకు ఇవాళ్టి ఈనాడు పత్రికే నిలువెత్తు నిదర్శనం.
విలువల గురించి పేజీల కొద్ది రాయడమే తప్ప, ఆచరించడం తనకు వర్తించదని రామోజీరావు చెప్పకనే చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత వాట్సాప్ చాటింగ్ లీక్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఆంధ్రజ్యోతి, సాక్షి ప్రధాన దినపత్రికలు ప్రాధాన్యంతో కూడిన కథనాలు ప్రచురించాయి. ఇదే మీడియా దిగ్గజంగా చెప్పుకునే ఈనాడు పత్రిక మాత్రం… ఆ విషయాన్ని మరుగున పడేసేందుకు ఆసక్తి చూపింది.
జర్నలిజానికి, విలువలకు ప్రతీకంగా ఈనాడు, రామోజీ అని ఇటీవల మహాను భావులు కొందరు చెబుతుండడం తెలిసిందే. బతికితే రామోజీరావులా ఒక్క రోజు బతికితే చాలన్న సినీ ప్రముఖులున్నారు. రామోజీ అదీ, రామోజీ ఇదీ అంటూ పొగిడే వాళ్లంతా… ఇవాళ కవిత వాట్సాప్ లీక్‌పై ఈనాడు ఎందుకు వార్త రాయలేదో సమాధానం చెప్పాలి.
ఇదే ఈనాడులో ఇవాళ ఓ ఆసక్తికర కథనం ప్రచురితమైంది. ఢిల్లీలో ఏపీ సీఐడీ ఏడీజీ సంజయ్ మార్గదర్శిపై నిర్వహించిన మీడియా సమావేశానికి సాక్షి తప్ప, మిగిలిన తెలుగు మీడియా ప్రతినిధుల్ని పిలవకపోవడాన్ని ప్రశ్నిస్తూ… వార్తా కథనం రాశారు. ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహంతో మార్గదర్శిపై, సీఐడీ అధికారులు చేస్తున్న ఆరోపణల గురించి తెలుగు మీడియా ప్రతినిధులు లోతైన ప్రశ్నలు వేస్తారన్న ఉద్దేశంతో వారిని రానీయకుండా చేయాలని చూశారంటూ రాసుకొచ్చారు.
మరి తనతో కవిత చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్ లను సుఖేశ్ చంద్రశేఖర్ విడుదల చేయడం ఈనాడు, రామోజీరావు దృష్టిలో వార్తగా కనిపించలేదా? మార్గదర్శి కేసులో తెలంగాణ సర్కార్ ఉండవల్లి పిటిషన్‌లో ఇంప్లీడ్ కాని విషయం తెలిసిందే. ఆ కృతజ్ఞతతోనే కవితకు సంబంధించి చాటింగ్‌ను ఈనాడు రాయలేదని అర్థం చేసుకోవాలా? ఇదే జగన్‌కు సంబంధించి జరిగి వుంటే…ఈనాడు రాయకుండా ఉండేదా? ఇంకా పదింతలు తాను సృష్టించి జనంలో అసహ్యం కలిగించేందుకు తన వంతు పాత్రను రామోజీరావు పోషించేవారు కాదా?
తన నేరాల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడం వల్లే తెలంగాణ సీఎంకు రామోజీరావు సాగిలపడ్డారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ దొరా…బాంచన్ అంటూ రామోజీ పాతాళానికి దిగజారారనే సెటైర్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. విలువల పేరుతో ఈనాడు ప్రస్థానం మొదలెట్టి, జీవిత చరమాంకంలో నేరాల నుంచి కాపాడుకునేందుకు దిగంబరంగా నిలబడ్డ మీడియా దిగ్గజం రామోజీని చూస్తుంటే జాలేస్తోందన్న అభిప్రాయం మీడియా సర్కిల్స్ నుంచి వ్యక్తమవుతోంది.
చివరికి కవితపై కూడా వార్త రాయలేని దుస్థితి వస్తుందని రామోజీరావు కలలో కూడా ఊహించి ఉండరనే సానుభూతి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.