ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి తిరిగిన వాళ్లని, తిరుగుతున్నవాళ్లని చూస్తూనే ఉంటాం. అర్జీలు పెట్టి పెట్టి విసిగి వేసారినవాళ్లనీ చూస్తుంటాం. బల్లకింద చేయి పెట్టనిదే పనికాదు, అలా చేయలేనివాళ్లకు ఎదురు చూపులు తప్ప ఇంకేమీ రాదు.
ఇలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. పని చేయకపోతే.. దానికి సాకులు చెప్పే వెసులుబాటుని, తప్పించుకోడానికి అబద్ధాలు చెప్పే అవకాశాన్ని కూడా ఉద్యోగులకు లేకుండా చేస్తోంది.
ఏ ఫైల్ ఎక్కడుంది, ఏ అధికారి వద్ద ఎన్నిరోజులు ఉన్నది, అనే విషయం ఎప్పటికప్పుడు అర్జీదారులకు ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. దీనికి సంబంధించి నూతన సాఫ్ట్ వేర్ పోర్టల్ ని సీఎం జగన్ లాంఛనంగా ఈరోజు ఆవిష్కరిస్తారు.
ఇప్పటి వరకూ ఉన్న విధానం ప్రకారం ఎన్ని రోజుల్లో అర్జీ పరిష్కరించారనేది తెలుస్తుంది. కొత్త సాఫ్ట్ వేర్ ప్రకారం ఏ అధికారి వద్ద ఎన్ని రోజులు పెండింగ్ లో ఉన్నది కూడా తెలుస్తుంది. 'సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ 2.ఓ' దీని పేరు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15వేల గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 545 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి.
అయితే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత అది ఆయా శాఖల పరిధిలోకి వెళ్తుంది. స్టేటస్ ఏంటనేది సచివాలయ సిబ్బందికి కానీ, అర్జీదారులకు కానీ తెలిసే అవకాశం లేదు. పని పూర్తయ్యాక మాత్రమే తెలుస్తుంది.
ఇకనుంచి ఏ దరఖాస్తు ఏ స్టేజ్ లో ఉంది, ఏ అధికారి వద్ద ఉంది, ఎంత సమయం ఉంది అనేది కూడా మొత్తం పారదర్శకంగా అర్జీ దారులకు తెలిసేలా చేస్తున్నారు.
20 రోజులుగా దీనికి సంబంధించిన ట్రయల్ రన్ విజయవంతంగా నడుస్తోంది. ఇప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో పట్టాలెక్కించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇకపై ప్రభుత్వ సిబ్బంది పనితీరులో మరింత పారదర్శకత పెరిగే అవకాశముంది. సాకులు చెప్పే ఛాన్సే లేదు. తమ పరిధిలో లేదు అని చెప్పి తప్పించుకోనూ లేరు. ఎవరెవరి వద్ద ఎన్ని రోజులపాటు పెండింగ్ లో ఉంది అనే విషయం కూడా స్పష్టంగా తెలిసిపోతుంది
కాబట్టి.. ఉద్యోగులకు ఇది కత్తిమీద సామే అని చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగుల్లో జవాబుదారీతనాన్ని మరింత పెంచేందుకు ఇలాంటి నూతన వ్యవస్థలు ఉపయోగపడతాయి. ఉద్యోగుల బాధ్యత పెరుగుతుంది, అర్జీదారులు ఏళ్ల తరబడి ఆఫీస్ ల చుట్టూ తిరిగే అవస్థా తప్పుతుంది.