ఆంధ్రప్రదేశ్‌లోని భారతీయ జనతా పార్టీ నాయకులు కొన్ని సంవత్సరాలుగా డొంకతిరుగుడు మాటలు మాట్లాడుతూనే ఉన్నారు కానీ… ప్రత్యేక హోదా గురించి క్లారిటీ ఇవ్వడానికి, తమ కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టంగా ప్రజలకు చెప్పడానికి వారికి ధైర్యం చాలలేదు. అయితే కొత్తగా బిజెపిలో చేరిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆ బాధ్యత తన భుజాల మీద వేసుకున్నట్లు ఉన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వైఖరి గురించి ఆయన స్పష్టత ఇచ్చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం హక్కుగా దక్కవలసిన ప్రత్యేక హోదాను ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంచనకు పాల్పడిన సంగతి అందరికీ తెలిసిందే. అనాధలా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, స్వయం సమృద్ధి సాధించడానికి ప్రత్యేక హోదా అనేది ఎంతో కీలకం కాగా.. ‘ఐదేళ్లు చాలదు పదేళ్లు ఇస్తాం’ అంటూ ప్రగల్బాలు పలికిన నరేంద్ర మోడీ ఆచరణలో మాత్రం రిక్తహస్తం చూపించారు.
ప్రత్యేక హోదా గురించి పోరాడవలసిన రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు కేవలం వినతి పత్రాలు ఇవ్వడం, అప్పుడప్పుడు ప్రకటనలు చేయడంతోనే సరిపెట్టుకుంటున్నాయి. హోదా సంగతి ముగిసిపోయినట్టే అని ఢిల్లీ పెద్దలు పార్లమెంటులో చెబుతూనే ఉంటారు. అయితే రాష్ట్ర నాయకులు హోదా డిమాండ్ వినతిపత్రాన్ని ఢిల్లీ పెద్దలకు ఇస్తూనే ఉంటారు. ఈ ప్రహసనం చాలాకాలంగా ఇలాగే నడుస్తోంది.
ప్రత్యేక హోదా విషయంలో బిజెపి వంచన గురించి విలేకరులు లేదా ప్రజలు ప్రశ్నించిన సందర్భంలో బిజెపి నాయకులు నీళ్లు నములుతూ డొంక తిరుగుడు మాటలు చెబుతున్నారే తప్ప క్లారిటీ ఇవ్వడం లేదు. కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరిన వెంటనే ఈ సస్పెన్స్ కు తెర దించేశారు. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తామని కేంద్రం ప్రకటించింది అంటూ అసలు విషయం తేల్చేశారు.
కిరణ్ బిజెపిలో చేరడం వలన మరొక విషయంలో కూడా క్లారిటీ వచ్చింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించడం లేదు అని కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీనికోసం రాష్ట్రమంతా చాలా కాలంగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇంత క్లారిటీగా రాష్ట్ర బిజెపి నాయకులు చెప్పలేకపోయారు. కనీసం కిరణ్ స్పష్టంగా చెప్పగలిగారు అని ఆందోళనకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ ఒక విషయంలో కిరణ్ క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా కొందరిలో సందేహాలు అలాగే ఉన్నాయి. కార్మికులతో కేంద్రం మంతనాలకు దిగుతున్నది, చర్చలకు పిలుస్తున్నది అనే వార్తలు వారిని కంగారుపెడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డి.. బిజెపిలో అడుగుపెట్టిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఒక తీపి, ఒక చేదు వార్త వినిపించారు. హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం అనేది చేదువార్త! ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడానికి తాము ఇంకా పోరాడుతున్నామని చెప్పుకోవడానికి పార్టీలు ఇక ప్రయత్నించకుండా ఉంటే మంచిది.
విశాఖ ఉక్కును విక్రయించడం లేదు అనడం కిరణ్ చెప్పిన శుభవార్త! ఒకవేళ అందుకు భిన్నంగా కేంద్రం వైఖరి ఉంటే కనుక తెలుగు ప్రజలు మరోసారి పోరుబాట ఎంచుకోవాల్సి వస్తుంది.