ఉత్సాహవంతుడు, నిబద్ధత కలిగిన నాయకుడనే ఉద్దేశంతో మేరుగ నాగార్జునకు సాంఘిక సంక్షేమ శాఖ బాధ్యతల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్పగించారు. అయితే ఆయన అసలు పని వదిలేసి, కొసరు పనుల్లో మునిగితేలినట్టున్నారు. మేరుగ నాగార్జున బాధ్యతలు నిర్వర్తిస్తున్న సాంఘిక సంక్షేమశాఖ నిర్లక్ష్యం ఎస్సీ విద్యార్థుల పాలిట శాపంగా పరిణమించింది. కేంద్ర ప్రభుత్వం అనుగ్రహించినా, ఏపీ సాంఘిక సంక్షేమశాఖ తీవ్రమైన అలసత్వం ఎస్సీ విద్యార్థులకు మెరుగైన విద్య, ఇతరత్రా సౌకర్యాలను దూరం చేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎస్సీ విద్యార్థులకు నాణ్యమైన చదువుతో పాటు సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ నవోదయ విద్యాలయాలను తీసుకొచ్చింది. రెసిడెన్షియల్ సౌకర్యాలను కల్పిస్తోంది. దేశ వ్యాప్తంగా 150 అంబేద్కర్ నవోదయ విద్యాలయ పాఠశాలలను మంజూరు చేయగా, అందులో రెండింటిని ఆంధ్రాకు కేటాయించారు. బాపట్ల, తిరుపతి జిల్లాల్లో ఈ పాఠశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
బాపట్లలో ఇంకా స్థలం సేకరణ జరగలేదు. కానీ తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి చొరవతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏర్పేడులో 30 ఎకరాల స్థలాన్ని కూడా ఎంపిక చేశారు. ఇక ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ నుంచి కేంద్ర ప్రభుత్వానికి అనుమతలు వెళ్లాల్సి వుంది. ఈ విషయంలో సుదీర్ఘ కాలయాపన జరుగుతోంది. సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వద్ద 100 రోజులు మగ్గి, ఆ తర్వాత మంత్రి కార్యాలయానికి ఫైల్ వెళ్లింది. ప్రస్తుతం మంత్రిత్వ కార్యాలయంలో 107 రోజులుగా క్లియరెన్స్ కోసం ఆ ఫైల్ ఎదురు చూస్తోంది.
ఏపీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఫైల్ వెళితే, రూ.150 కోట్లతో స్కూల్ కట్టడానికి మోదీ సర్కార్ సిద్ధంగా వుంది. తమ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసమే పని చేస్తోందని మేరుగ నాగార్జున ఉపన్యాసాలు ఇస్తుంటారు. కానీ ఆచరణకు వచ్చే సరికి… సొంత సామాజిక వర్గానికి కూడా చేసింది, చేస్తున్నదేమీ లేదు. ఈ స్కూల్ కో-ఎడ్యుకేషన్‌కు సంబంధించింది. ఎస్సీలకు సంబంధించింది కావడంతో ఫైల్ కదలడానికి ఇం”ధనం” ఇచ్చే వాళ్లెవరూ లేరని, అందుకే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికైనా ఏర్పేడులో స్కూల్ నిర్మాణానికి ఎదురు చూస్తున్న ఆ 30 ఎకరాల్లో త్వరగా విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఎస్సీలకు నాణ్యమైన విద్య, వసతి కల్పించడానికి మించిన గొప్ప పని మరొకటి లేదు. అలసత్వాన్ని వీడి ఎస్సీ విద్యార్థులకు ప్రయోజనం కలిగించే పనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది. లేదంటే ఎస్సీ విద్యార్థులకు ద్రోహం చేసిన వారిగా మిగిలిపోతారు.