కడప జిల్లా బహిష్కరణకు గురైన వైఎస్ కుటుంబ సభ్యుడు వైఎస్ కొండారెడ్డి రాజకీయంగా మళ్లీ యాక్టీవ్ అయ్యారు. పులివెందుల నియోజక వర్గంలోని చక్రాయపేట మండల వైసీపీ బాధ్యతల్ని మళ్లీ ఆయనే చూసుకోనున్నారు. గత ఏడాది ఎస్ఆర్‌కే కన్‌స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్లను బెదిరించిన కేసులో అరెస్ట్ అయ్యారు. కొన్ని రోజులు జైల్లో ఉన్నారు. ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరిస్తున్నారంటూ ఆయన్ను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు.
అంతేకాదు, ఏకంగా జిల్లా నుంచి బహిష్కరిస్తూ కలెక్టర్‌కు ఎస్పీ సిఫార్సులు చేయడం తెలిసిందే. సీఎం జగన్ ఆదేశాల మేరకే జిల్లా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. తాజాగా వైఎస్ కొండారెడ్డి చక్రాయపేటలో గతంలో మాదిరిగా ఇన్‌చార్జ్ బాధ్యతల్ని తీసుకున్నట్టు సమాచారం. ఆయనపై కోర్టులో కేసు కొట్టివేయడంతో వైసీపీ అధిష్టానం కొండారెడ్డిపై చల్లబడినట్టు తెలుస్తోంది.
ఎన్నికలు సమీపిస్తుండడంతో వైఎస్ కొండారెడ్డి అవసరాన్ని వైసీపీ అధిష్టానం గుర్తించినట్టు చెబుతున్నారు. వైఎస్ కొండారెడ్డి దూకుడు ఒక్కో సమయంలో హద్దులు దాటుతోంటోంది. అదే వైసీపీపై వ్యతిరేకతకు దారి తీస్తుంటుంది. అయితే కుటుంబ సభ్యుడు కావడంతో ఆయన్ను తిరిగి చక్రాయపేట రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేలా ఆదేశించినట్టు సమాచారం.
ప్రస్తుతం ఆయన చక్రాయపేట నియోజకవర్గంలో కలియదిరుగుతున్నారని తెలిసింది. ఇకపై వైఎస్ కొండారెడ్డి మార్క్ రాజకీయాన్ని చక్రాయపేట వాసులు చూడాల్సి వుంటుంది. ఇది రాజకీయంగా లాభమో, నష్టమో ఎన్నికల ఫలితాల్లో తేలనుంది.