స్టీల్ ప్లాంట్ కొనేయడం అంత సులువా?

స్టీల్ ప్లాంట్ అమ్మకానికి బిడ్ లు పిలిచారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం వెళ్లింది. ఆంధ్ర ఫ్రభుత్వానికి బిడ్ వేసే యోచనే లేదు. ఆ మాత్రం అయిదు వేల కోట్లు ఖర్చు చేసి బిడ్…

స్టీల్ ప్లాంట్ అమ్మకానికి బిడ్ లు పిలిచారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం వెళ్లింది. ఆంధ్ర ఫ్రభుత్వానికి బిడ్ వేసే యోచనే లేదు. ఆ మాత్రం అయిదు వేల కోట్లు ఖర్చు చేసి బిడ్ వేయలేరా..బటన్ నొక్కలేరా..ఇలా రకరకాల వార్తలు..కథనాలు. ఏంటీ..స్టీల్ ప్లాంట్ కొనేయడం అంత సులువా? అయిదు వేల కోట్లు ఖర్చు చేస్తే స్టీల్ ప్లాంట్ మనదైపోతుందా? అస్సలు నమ్మదగ్గ విషయమేనా ఇది?

తెలుగుదేశం అనుకూల మీడియా ఈ విషయంలో రెండు విధాలుగా ప్రవర్తిస్తోంది. ఒక మీడియా…దీన్ని జగన్ చాతకాని తనంగా ప్రొజెక్ట్ చేయాలని చూస్తోంది. ఆంధ్ర జనాలకు అవమానంగా చూస్తోంది. మరో మీడియా ఇదంతా భారాస డ్రామా అన్నట్లు చెబుతోంది. ఇంతకీ ఏది నిజం?

ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాల బిడ్ ల్లో పాల్గొనకూడదు అని కేంద్రం జారీ చేసిన ఓ రూలు. మరి దాని ప్రకారం సింగరేణి సంస్థ స్టీల్ ప్లాంట్ ను ఎలా కొంటుంది?

అసలు నిజంగా స్టీల్ ప్లాంట్ అమ్మకం కోసమే బిడ్ పిలిచారా? అంటే అదీ ఫాల్స్ న్యూస్ నే. స్టీల్ ప్లాంట్ తన దగ్గర ముడిసరుకు లేక, ప్లాంట్, సిబ్బందికి సరిపడా పని లేదు కనుక ఓ కొత్త స్కీమ్ కు బిడ్ పిలిచింది. ఎవరైతే ముడిసరుకు ఇస్తారో, దాన్ని ఉత్పత్తిగా మార్చి, ఆ సరుకు ఇస్తారు. దీనికి కొన్ని పద్దతులు, లెక్కలు గట్రా వుంటాయి. అది మాట్లాడుకోవడానికి వెళ్లిందీ సింగరేణి బృందం.

సరే, ఇంతకీ సింగరేణి బృందం స్టీల్ ప్లాంట్ కు ఏ సరుకు ఇచ్చి, ఇనుముగా మార్చి తెచ్చుకుంటుంది? ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్ కు వాడే బొగ్గు ఇది కాదు. అది విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. సింగరేణి బొగ్గు ధర్మల్ ప్లాంట్ లకు పనికి వస్తుంది తప్ప స్టీల్ ప్లాంట్ లకు కాదు. అంటే తెలంగాణలోని బయ్యారం గనుల ఐరన్ ఓర్ ను ఇవ్వాలి. కానీ ఎలా ఇస్తారు?

తెలంగాణ ఉద్యమ సమయంలో మా బయ్యారం గనులు విశాఖకు ఎలా ఇస్తారు..ఇస్తే ఊరుకుంటామా? అన్నారు. అందువల్ల ఆ గనులు వాడి, తమ దగ్గర వున్న అయిదువేల కోట్లు వాడి తెలంగాణలో ఓ స్టీల్ ప్లాంట్ కట్టేయచ్చు కదా?

సరే, ఆ సంగతి అలా వుంచుదాం. అసలు స్టీల్ ప్లాంట్ అమ్మకానికే బిడ్ పిలిచారు అని కాస్సేపు అనుకుందాం. ఓ స్టీల్ ప్లాంట్ కొనడానికి బిడ్ వేయడం అంటే మామూలు విషయమా? దానికి ఎంత టెక్నికల్ ఎక్స్ పెర్ట్స్ కావాలి. విశాఖ స్టీల్ విలువ లెక్కవేయడానికే ముందుగా చాలా సమయం పడుతుంది. చాలా బృందం కావాలి. అలాంటి సంస్థలను నియమించడానికి చాలా ఖర్చు చేయాలి. అలాంటి బిడ్ లు ఒక్క దశలో ఓకె అయిపోవు. బిడ్ వేసే సంస్థల అనుభవం, అవకాశం చూస్తారు కూడా. రెండు మూడు దశలు వుంటాయి. అలాంటి స్టీల్ ప్లాంట్ విలువ అయిదు వేల కోట్లేనా?

స్టీల్ ప్లాంట్ కు వున్న భూముల విలువే అపారం. అందువల్ల స్టీల్ ప్లాంట్ విలువ అయిదు వేల కోట్లే అయితే కనుక మైహోమ్ లాంటి భారీ రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా బిడ్ వేసి, భూములు జమ చేసుకోవచ్చు కదా. కొన్నాక ఏం చేసుకుంటారన్నది వాటి ఇష్టం.

ఇవేవీ చెప్పకుండా, ఇవేవీ డిస్కస్ చేయకుండా. అదిగో స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు. తెలంగాణ కొనేస్తోంది. జగన్ వల్ల ఆంధ్ర పరువు పోయింది. ఇదే కులపిచ్చితో కొట్టుకుంటున్న మీడియా రాతలు తప్ప మరేం కాదు.

అసలు ఇవన్నీ ఇలా వుంచుందాం.

నిజంగానే కేంద్రం స్టీల్ ప్లాంట్ ను అమ్మేసింది అనుకుందాం. ఏమవుతుంది. దాన్ని భూమితో సహా పెకలించి పట్టుకుపోతారా? అక్కడే వుంటుంది కదా? ఇదే ఉద్యోగులు పని చేస్తారు కదా..ఇవే జీతాలు అందుకుంటారు కదా? మరి ఎందుకు యాగీ…అక్కడే వుంది మర్మం. ప్రయివేటు యాజమాన్యం పని చేయించుకుంటుంది. ప్రభుత్వ యాజమాన్యం అంటే ఆ లెక్క వేరుగా వుంటుంది.