టీ పోయి బీ వచ్చె… అయినా ప్రాంతీయ ఉన్మాదమే

బీఆర్ఎస్ ఏపీలో చేస్తున్న రాజకీయ హడావుడికి వైసీపీ మంత్రుల నుంచి స్ట్రోక్స్ బాగా పడుతున్నాయి. టీ పోయి బీ వచ్చినంత మాత్రాన మీది రాత్రికి రాత్రి జాతీయ  పార్టీగా మారిపోతుందా అంటూ కన్నెర్ర చేశారు…

బీఆర్ఎస్ ఏపీలో చేస్తున్న రాజకీయ హడావుడికి వైసీపీ మంత్రుల నుంచి స్ట్రోక్స్ బాగా పడుతున్నాయి. టీ పోయి బీ వచ్చినంత మాత్రాన మీది రాత్రికి రాత్రి జాతీయ  పార్టీగా మారిపోతుందా అంటూ కన్నెర్ర చేశారు సిక్కోలు మంత్రి సీదరి అప్పలరాజు. ప్రాంతీయ ఉన్మాదంతో పుట్టిన పార్టీ టీఆర్ఎస్ అని వెనకటి గుట్టు విడమరచి చెప్పారు.

ఆంధ్రులను అడుగడుగునా అవమానించిన పార్టీ మీది. ఈ రోజు ఏపీని ఉద్ధరిస్తామంటే నమ్మే వెర్రి వాళ్ళుంటారా అని బాగానే తగులుకున్నారాయన. జాతీయ పార్టీ అని చెప్పుకోవడం కాదు, వీసమెత్తు అయినా జాతీయ భావన ఉందా గులాబీ నేతలూ అని నిలదీశారు.

ఏపీ మేలు ఏ రోజు అయినా కోరుకున్నారా అని సీదరి ప్రశ్నించారు. గోదావారి జలాల నుంచి క్రిష్ణా జలాల దాకా ఏపీలోని ప్రాజెక్టుల విషయంలో ఏది చూసినా మీరు సంకుచితంగా అడ్డుకున్న వారే కదా అని ఆయన విమర్శించారు.

తెలంగాణాలో చేసిన మాదిరిగా ఏపీని ఏలుదామనుకుంటే అసలు కుదరదని తేల్చిచెప్పారు. మామ అల్లుడు, మామ కొడుకు కూతురు అంతా కలసి కుటుంబంగా తెలంగాణాలో పాలన చేస్తున్నారు, ఏపీ ఎప్పటికీ మీ తెలంగాణా కాదు, కాబోదు అని అప్పలరాజు స్పష్టం చేశారు

ఈ రోజున హైదరాబాద్ లో ఉన్న పెట్టుబడులు అభివృద్ధి అంతా ఎవరిని అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రులు అంతా పెట్టిన‌ పెట్టుబడులతో అభివృద్ధి చెంది మహా నగరంగా మారితే విభజన రాజకీయాలు చేసి విద్వేషాలు రేపి ఉమ్మడి ఏపీని విడగొట్టింది మీరు కాదా అని సూటిగానే ఆయన నిలదీశారు

ఏపీ జనాలు ఎన్నటికీ బీఆర్ఎస్ ని నమ్మేది లేదని, తెలంగాణా ప్రాంతీయ వాదాన్ని కూడా ఉన్మాదంగా మార్చిన చరిత్ర బీఆర్ఎస్ నేతలదని మండిపడ్డారు. ఈ రోజు తగుదునమ్మా అని ఏపీతో సహా దేశమంతా మేము రాజకీయం చేస్తామంటే ఎవరు ఆదరిస్తారని ఆయన అంటున్నారు. మీ కుటుంబ రాజకీయాలు ఏపీలో చెల్లవు కాక చెల్లవని సీదరి అంటున్నారు. ఇది బీఆర్ఎస్ కి స్ట్రాంగ్ డోస్ గానే భావిస్తున్నారు.