ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటుకు ఉద్యోగుల నుంచి సహాయ నిరాకరణ ఎదురుకానుందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిన్నటి వరకూ 13 జిల్లాలున్నాయి. మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ జగన్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తామన్న ఎన్నికల హామీకి కట్టుబడి జగన్ ప్రభుత్వం ముందడుగు వేసింది.
ఈ నేపథ్యంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియపై ప్రభుత్వం సమగ్ర దృష్టి పెట్టింది. అయితే పీఆర్సీ వ్యవహారంపై ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య వివాదం నెలకుంది. నూతన పీఆర్సీని ఉద్యోగులు వ్యతిరేకిస్తూ ఉద్యమ బాట పట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసు కూడా ఇవ్వడం తెలిసిందే. ఇదే సమయంలో ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రక్రియ చేపట్టడం చర్చనీయాంశమైంది.
నూతన పీఆర్సీని అమలు చేస్తూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా పీఆర్సీ సాధన సమితి నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కొత్త జిల్లాల ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
తమ ఉద్యమ సమయంలోనే జిల్లాల ప్రక్రియను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. జిల్లాల పునర్విభజనపై తాము చేయగలిగినంత చేస్తామని ఆయన అన్నారు. అయితే తమపై ఒత్తిడి తీసుకురావద్దని కలెక్టర్లను కోరుతున్నామన్నారు. జిల్లాల విభజన ప్రక్రియపై అధికారుల ఒత్తిళ్లకు లొంగేది లేదని ఆయన స్పష్టం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు తాము సహాయ నిరాకరణ చేస్తామని బొప్పరాజు పరోక్షంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఆమోదయోగ్యమైన పీఆర్సీ ఇవ్వని ప్రభుత్వానికి తామెందుకు సహకరించాలనే ధిక్కరణ స్వభావం ఉద్యోగ నేతల్లో కనిపిస్తోంది. అంతా తమ ఇష్టానుసారం ప్రభుత్వం వ్యవహరిస్తే మాత్రం పని చేస్తామనే ధోరణి వారి మాటల్లో వ్యక్తమవుతోంది.
ప్రజలకు ప్రయోజనకరమైన నిర్ణయాలను అమలు చేయడంలో శ్రద్ధ కనబరచరని, అందుకే ఉద్యోగుల డిమాండ్లపై పౌర సమాజం నుంచి మద్దతు లభించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగుల సహాయ నిరాకరణ నేపథ్యంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియపై ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళుతుందనేది ప్రశ్నగా మిగిలింది.