దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్పై ఆయన రాజకీయ, సినీ వారసులు కనబరుస్తున్న ప్రేమ అంతా ఉత్తుత్తిదేనా? అంటే…ఔననే చెప్పక తప్పదని పలువురు అంటున్నారు. తమ ప్రధాన ప్రత్యర్థి రాజకీయ పార్టీకి చెందిన వ్యవస్థాపక అధ్యక్షుడైనప్పటికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయన పేరును ఓ జిల్లాకు పెట్టడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
కానీ నిత్యం ఎన్టీఆర్ నామస్మరణ చేసే చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తదితర రాజకీయ, సినీ వారసుల నుంచి మాత్రం నామమాత్ర స్పందన కూడా రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎన్టీఆర్ కుమార్తె, మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం ట్విటర్ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
“ఆ మహనీయుడు నందమూరి తారక రామారావు గారు పుట్టిన జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టడం, ఆయన బిడ్డగా నేను స్వాగతిస్తున్నాను. ప్రజాభీష్టం ఈ నాటికీ నెరవేరింది. జై ఎన్టీఆర్!” అంటూ ఆమె ట్వీట్ చేయడం గమనార్హం. మరి దివంగత ఎన్టీఆర్ మిగిలిన సంతానం మాటేమిటి?
కనీసం తండ్రి పేరును ప్రత్యర్థి పార్టీకి చెందిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ …రాజకీయాలకు అతీతంగా కృష్ణా జిల్లాకు పేరు పెడితే కృతజ్ఞత, ఆనందాన్ని వ్యక్తం చేసే సంస్కారం కూడా లేకపోయిందా? అనే విమర్శలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.
ప్రతిపక్ష నేతగా జగన్ కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో తాము అధికారంలోకి వస్తే…ఎన్టీఆర్ పేరు పెడతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు చేయలేని పనిని, జగన్ చేశారనే ఓర్వలేని తనాన్ని ఎన్టీఆర్ వారసుల్లో ఉందని వారి మౌనవ్రతాన్ని బట్టి అర్థం చేసుకోవాలా? అని ప్రశ్నించే వాళ్లకు ఏం సమాధానం చెబుతారు? కనీసం దగ్గుబాటి పురందేశ్వరి సంస్కారం కూడా వాళ్ల మిగిలిన పిల్లల్లో లేకపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఎన్టీఆర్ పుట్టిన జిల్లాకు ఆయన పేరు పెట్టడాన్ని చంద్రబాబు సహించలేనట్టున్నారనే వ్యంగ్య కామెంట్స్ ప్రత్యక్షమవుతున్నాయి. ఎన్టీఆర్ పేరుతో ఇటు సినీ, రాజకీయ రంగాల్లో పబ్బం గడుపుకుంటున్న వాళ్లకి, ఆయన పేరును శాశ్వతంగా నిలపడంపై కనీస స్పందన వ్యక్తం చేయకపోవడం చూస్తే… తండ్రిపై, మామపై, తాతపై ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో అర్థమవుతోందని చెప్పేవాళ్ల లేకపోలేదు.