ఆయన నిరుపేదల కోసమే తన వైద్యాన్ని అంకితం చేశారు. ఆయన కొన్ని దశాబ్దాలుగా విశాఖలో పేదలకు వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ వారికి దేవుడే అయిపోయారు. ప్రత్యేకించి పోలియో వ్యాధితో బాధపడేవారికి వైద్యం అందించి వారిని మామూలు వారిగా చేయడంలో దిట్ట.
ఆయనే డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు. ఆయన ఇపుడు ఎనిమిది పదుల వయసు దాటారు. వయోభారంతో ఉన్నా కూడా వైద్యాన్ని మరవలేదు.
ఆయన ఆసుపత్రిని ఏర్పాటు చేయడం ద్వారా ఇప్పటికి మూడు లక్షల మందికి ఆపరేషన్లు చేశారు అంటే అది పెద్ద రికార్డుగానే చూడాలి. అంతే కాదు, సొంతంగా దాదాపుగా వేయి దాకా వైద్య శిబిరాలు నిర్వహించారు.
అటువంటి ఆయనకు పద్మశ్రీ అవార్డు అందించడం అంటే నిజంగా గొప్ప విషయమేనని అంతా అంటున్నారు. ఒక విధంగా ఇది పేదలకు అందుతున్న వైద్యానికి లభించిన గొప్ప గౌరవం అని కూడా అంటున్నారు. ఆదినారాయణరావుకు పెద్ద ఎత్తున అన్ని వర్గాల నుంచి అభినందనలు లభిస్తున్నాయి.